అమెరికాలో తెలుగు పాట

2 Aug, 2014 01:29 IST|Sakshi
అమెరికాలో తెలుగు పాట

ఆకునూరి శారద.. శాస్త్రీయ సంగీతంలో ఘనాపాటి కాదు గానీ ఓనమాలు నేర్చుకున్నారు. సాధనతో స్వరం మీద పట్టు తెచ్చుకున్నారు. అమెరికాలోని తెలుగు కల్చరల్ అసోసియేషన్ మెంబర్‌గా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకూ కృషి చేస్తున్నారు. హ్యూస్టన్‌లో తెలుగు రేడియోలో ఆర్‌జేగా తన కమ్మని కంఠంతో పలకరిస్తున్నారు! హైదరాబాద్ వచ్చిన ఈ ఎన్‌ఆర్‌ఐతో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు...
 
 పాడడమంటే ఇష్టం. మూడేళ్లు కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. సినీ, లలితగీతాలు ఎప్పుడూ వినేదాన్ని. అలా వింటూ ప్రాక్టీస్ చేసిన పాటే నా జీవితంలో భాగమైపోయింది. అందుకే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా ఎన్నాళ్లో కంటిన్యూ చేయలేదు. అమెరికా వెళ్లిన కొత్తల్లోనే తెలుగు కల్చరల్ అసోసియేషన్‌లో చేరా. అసోసియేషన్‌కు వరుసగా రెండుసార్లు ప్రెసిడెంట్‌గా ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. ఇళయరాజా దగ్గర్నుంచి దేవీశ్రీప్రసాద్ వరకు అందరి పాటలూ పాడాను. తెలుగే కాదు.. తమిళం, కన్నడ, హిందీ పాటలూ పాడుతా. రామకృష్ణ నుంచి శ్రీకృష్ణ వరకు, జానకమ్మ మొదలు సునీత వరకు అందరితోనూ కలిసి వేదిక పంచుకున్నా. ఆగస్ట్ 2న చెన్నైలో ఎమ్మెస్ విశ్వనాథన్ మ్యూజికల్ నైట్‌లోనూ పాలుపంచుకోబోతున్నా.
 
 సిటీ దిశానిర్దేశం...
 నేను పుట్టింది కాకినాడ.. పెరిగింది బాపట్ల. హయ్యర్ ఎడ్యుకేషన్ తిరుపతిలో. అయినా నాకు హైదరాబాద్‌తోనే అనుబంధం ఎక్కువ. నాకు దిశానిర్దేశం చేసింది ఈ సిటీనే. ఇక్కడి ఏఎమ్‌ఎస్ కాలేజ్‌లో కంప్యూటర్ ప్రోగామర్‌గా చేస్తూ పార్ట్‌టైమ్‌గా సిటీకేబుల్‌లో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చదివేదాన్ని. అప్పుడే స్టార్ట్ అయిన ఈటీవీ ‘సరిగమలు’, జెమినీ ‘నవరాగం’ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా. ఆల్ ఇండియా రేడియో ‘యువవాణి’లో లలితగీతాలు పాడేదాన్ని. కొన్ని రేడియో నాటికల్లోనూ పార్టిసిపేట్ చేశా. అలా ఏడాదిన్నర గడిచిందో లేదో... 1997లో పెళ్లవడంతో హ్యూస్టన్‌లో పనిచేస్తున్న మా వారు శ్రీనివాస్‌తో కలిసి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఇక నా పాటల కచేరీలకు హ్యూస్టన్ వేదికైంది.
 
 రేడియో జాకీగా...
 హ్యూస్టన్‌లోని తెలుగు రేడియోలో ఆర్‌జేగా చేయడం ఎంతో ఇష్టం. అమెరికాలో రేడియోకు శ్రోతలు దొరకడం విచిత్రమే. అక్కడ తెలుగువాళ్లకు పని తప్ప ఇతర వ్యాపకాలుండవు. శ్రోతల భాగస్వామ్యం కోసం రేడియోలో పిల్లలకు మూడు దశలు పాటల పోటీలు ప్రారంభించా. పిల్లల పాట విన్నాక వాళ్ల పేరెంట్స్ శ్రోతలను ఓటింగ్ అడిగేలా ప్లాన్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సామెతలు, నుడికారాలు చెప్పడం.. అడగడం లాంటవీ ప్లాన్ చేశా. నాకు ఇద్దరు పిల్లలు. బాబు చక్కగా పాడతాడు. పియానో వాయిస్తాడు. పాప కూడా బాగా
 పాడుతుంది.
              -   సరస్వతి రమ

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా