తెలుపనా తెలుగు మాట..

20 Dec, 2014 00:24 IST|Sakshi
తెలుపనా తెలుగు మాట..

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మంచి సంపాదన.. అంతకు మించి అందమైన ఫ్యామిలీ. ఇన్ని వసతులు ఉన్న వ్యక్తి డాలర్లను రూపాయలుగా మార్చే పనిలో బిజీగా ఉంటారు. కానీ.. ఆయన మాత్రం ఖండాతరాన తెలుపనా తెలుగు మాట అని తన వాణి వినిపిస్తున్నారు. తెలుగు భాషాసంస్కృతుల వ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రవాసాంధ్రుడు కొంచాడ మల్లికేశ్వరరావు. తన ప్రయత్నాల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ , తెలుగు వర్సిటీ అధికారులతో సమావేశం అయ్యేందుకు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. ఆస్ట్రేలియాలో ఆయన చేస్తున్న తెలుగు సేద్యం గురించి వివరించారు.
 
 1982లో హైదరాబాద్‌కు వచ్చాను. మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. హౌసింగ్ బోర్డులో జూనియర్ ఇంజినీర్‌గా 13 ఏళ్లు పని చేశాను. తర్వాత హడ్కోలో ఉద్యోగం చేశాను. ఆపై కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని న్యూజిలాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాను. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాను.
 
 తెలుగుమల్లి
 ఆస్ట్రేలియాలో వేలాది మంది తెలుగువారున్నారు. వీరి కోసం స్రవంతి అనే న్యూస్ లెటర్ నడిపాను. మూడు వారాలకోసారి వచ్చేది. ఇలా ఐదేళ్లు నడిపాను. తర్వాత నా భార్య, కొడుకు సహకారంతో ప్రవాస భారతి మ్యాగజైన్ తీసుకువచ్చాను. కాస్ట్ పెరిగిపోవడంతో.. తెలుగుమల్లి వెబ్‌సైట్ పారరంభించాను. వార్తలు, ఈవెంట్స్, వంటలు, సినిమా విశేషాలు అందులో పొందుపరుస్తున్నాం. సాహిత్య సమాచారం, కవితలు, కథలు, చారిత్రక
 
 విషయాలు వెబ్‌సైట్‌లో ఉంచుతున్నాం. నోటీస్ బోర్డ్ పేరుతో పెళ్లి సంబంధాల సమాచారం కూడా  ఉంటుంది. తెలుగుమల్లి పేరుతో ఫేస్‌బుక్ పేజీ కూడా ఉంది.
 
 కమ్యూనిటీ భాషగా..
 ఆస్ట్రేలియాలో ఏ దేశస్తులైనా వారి భాష కోసం పని చేసేందుకు ముందుకు వస్తే.. అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోని మల్లీకల్చరల్ మినిస్ట్రీ ప్రోత్సాహం అందిస్తుంది. మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్లు గ్రాంట్ కూడా ఇస్తుంది. తెలుగు భాష గురించి తాను చేస్తున్న కృషికి విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ‘విక్టోరియన్ మల్టీ కల్చరల్ ఫంక్షన్’ సర్వీస్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందజేసింది. తెలుగును కమ్యూనిటీ లాంగ్వేజ్‌గా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించాం. దీనికి సూచనప్రాయంగా అంగీకరించింది కూడా. ఉగాది నాటికి  నిర్ణయం వెలువడవచ్చు.  
 
 ఉగాది కోసం..
  అస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో ఉగాదికి పెద్దగా సంబరాలు నిర్వహిస్తారు. జానపద కళాకారులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి యక్షగానాలు, బుర్రకథ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. కళాకారులను పంపేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అలాగే ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు వర్సిటీ అధికారులను కలుస్తున్నాం. ఆస్ట్రేలియాలో తెలుగు వ్యాప్తికి ఓ 15 మంది కోర్ కమిటీగా ఏర్పడి సొంత ఖర్చులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలుగు భాషాను ఈ తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో మెల్‌బోర్న్‌లో ప్రతి శనివారం తెలుగు యువత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. భాషావికాసానికి దీర్ఘకాలిక ప్రణాళిక అమలుకు కసరత్తు చేస్తున్నాం. దీనికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నాను. తెలుగు సులువుగా నేర్చుకునే పుస్తకాలను తెలుగు వర్సిటీ అందజేస్తే బాగుంటుంది.
 -  కోన సుధాకర్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు