బుక్ & క్లిక్

16 Apr, 2015 22:44 IST|Sakshi
బుక్ & క్లిక్

ఓల్డ్ ఈజ్ గోల్డ్. అదేమిటో తెలియాలంటే నాటి వాసనలు నేటికీ పోని పాతబస్తీకి వెళ్లాలి. చరిత్ర చెప్పే చార్మినార్ చూడాలి. కొండంత రాచఠీవీ ఒలకబోసే గోల్కొండ చూడాలి. చౌమహల్లా ప్యాలెస్సూ, నిజాం నగల తేజస్సూ దర్శించాలి.  ఈ సిటీ.. కొత్త ఒక వింత. ఇదేమిటో తెలియాలంటే సింగపూర్‌కి సీక్వెల్ లాంటి మాదాపూర్‌కి వెళ్లాలి. హైటెక్ సిటీ దిశగా హైజంప్ చేయాలి. ఐమ్యాక్స్ తెరకు కళ్లప్పగించాలి. ఫిలింనగర్ స్టార్లూ.. ఫైవ్‌స్టార్ బార్లూ.. సాలార్‌జంగ్ మ్యూజియమ్మూ.. పబ్బుల్లో దమ్మారో దమ్మూ.. ఒకటికి ఒకటి పొసగని జీవనశైలుల వైరుధ్యానికి, సజీవ సంప్రదాయాల సమన్వయానికి  ఉదాహరణ ఈ నగరం.

కలల నగరం.. కలానికి వరం..

ఇదొక విచిత్రాల ఊరు. తెల్సుకుంటున్న కొద్దీ తెరుచుకునే విశేషాల హోరు. ప్రయాస లేకుండానే ప్రాణం పోసుకునే ప్రాస కవితలా.. అలా అలా తిరుగుతుంటే చాలు సిటీపై ఇష్టం కూడా అనాయాసంగా పుట్టుకొస్తుంది. సిటీలో తిరుగుతున్నకొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ప్రేయసి మీద పెరిగే ప్రేమ అయితే వర్ణిస్తూ ప్రేమలేఖ రాస్తామేమో..! ప్రేమ పునాదిగా పురుడు పోసుకున్న ఈ లవ్లీ సిటీ మీద ఇష్టం పెరుగుతున్న కొద్దీ సిటీ స్పెషల్‌గా ఏదైనా రాయలనిపిస్తోందేమో..! అందుకే ఈ నగరం మీద వచ్చినన్ని పుస్తకాలు బహుశా మరే నగరం గురించీ ఇప్పటిదాకా వచ్చి ఉండకపోవచ్చు. ఇంకా పుంఖానుపుంఖాలుగా వస్తూనే  ఉండవచ్చు.

ఎన్నెన్నో పుస్తకాలు.. ఫొటోలు..

‘ఎంత చెప్పినా, ఎంత చూపినా ఇంకా కొంత మిగిలే ఉండే వండర్ మన భాగ్యనగరం’ అంటారు నగరంలో ఫొటోగ్రాఫర్‌గా ప్రసిద్ధుడైన రవీందర్‌రెడ్డి. రచయిత నూపుర్‌కుమార్‌తో కలిసి ఆయన భాగ్య నగరంలోని వింతలు విశేషాలతో పోట్రెయిట్ ఆఫ్ ఎ సిటీ పేరుతో పుస్తకం రూపొందించారు. నరేంద్రలూధర్ ఆవిష్కరించిన ‘రాజా దీనదయాళ్’, ‘రాక్ స్పేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’, సయ్యద్ ఇమామ్ రచించిన ‘ది అన్‌టోల్డ్ చార్మినార్’, వనజ బెనజిర్ అందించిన ‘హైదరాబాద్ హజిర్ హై’, మధు వట్టి రచన ‘ఎ గైడ్ టు హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్’, మల్లాది కృష్ణానంద్ రాసిన ‘హెరిటేజ్ హైదరాబాద్’, ఇంకా... ‘హైదరాబాద్ ఎ విజువల్ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ’, ‘ది స్ల్పెండర్స్ ఆఫ్ హైదరాబాద్’, ‘హైదరాబాద్ 400 ఇయర్స్’.. ఇలాంటివెన్నో ఉన్నాయి.

నగరం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకాలను తిరగేయడం ఓ మంచి అవకాశం. మరోవైపు ఎంత రాసినా ఇంకా తర‘గని’ విశేషాల గని లాంటి ఈ ఊరు రచయితల కలాలకూ, హైదరాబాద్ ఫొటోగ్రాఫర్ల కెమెరాలకూ పనిపెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో సిటీపై బుక్స్ మాత్రమే కాదు డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిలింస్ వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమాలకైనా, డాక్యుమెంటరీస్‌కైనా.. సిటీని మించిన ముడిసరుకు ఎక్కడా దొరకదు’ అని చెప్పారు సిటీ బేస్డ్ టూరిస్ట్ ప్లేసెస్‌పై ఇటీవలే ఒక విజయవంతమైన డాక్యుమెంటరీని రూపొందించిన సిటీ యువకుడు రాజ్‌కిషోర్.
 ..:: ఎస్.సత్యబాబు
 

మరిన్ని వార్తలు