-

టేస్టాతురాణాం... న క్లాసూ... న మాసు!

28 Mar, 2015 00:03 IST|Sakshi
టేస్టాతురాణాం... న క్లాసూ... న మాసు!

పెట్టే చేతిని మరవడం... ఇచ్చే చేతిని కరవడం మన హైదరాబాద్ వాసులకు తెలియని పని. తిండి పెట్టే వారి విషయంలో నగరవాసులకు లాయల్టీ ఎక్కువ. ‘బ్రాండ్ లాయల్టీ’ తరహాలోనే... తమకు ఏదైనా పెట్టేవారి పట్ల ‘ఫుడ్డు లాయల్టీ’ అనే ప్రత్యేక గుణం భాగ్యనగరవాసులకు ఉండటం ఆ పెట్టేవారి మహద్భాగ్యం. తాత్పర్యమేమనగా... సదరు పెట్టేవారు తమ గల్లా పెట్టె నింపుకునేందుకు పెట్టి పుట్టారన్నమాట.
 
ఓ పక్క మింట్ కాంపౌండ్ పక్కనే ఉందా! మరో పక్క రాష్ట్ర పాలన సాగించే కేంద్ర బిందువు సచివాలయం వెనకభాగం ఉందా! ఈ రెండూ కలిసే చోట ఓ పెద్ద  చెట్టు నీడ ఉందా! అక్కడున్న పుచ్చకాయల అమ్మకం ఎంత ఫేమస్సంటే... ‘ఎర్రని పండూ ఎన్నీయల్లో... ఎర్రెర్రెని పండూ ఎన్నీయలో... కోసుకు కొనండి, తినండి ఎన్నీయల్లో... తిని కూలైపోండి ఎన్నీయల్లో’ అంటూ ఆత్రమాత్రంగా తింటుంటారు.  
 
ఇక మరో దృష్టాంతం. ఒకనాటి వివిధభారతి వాణిజ్య విభాగంలో వినిపించే బట్టలషాపు పేరైన ‘తుంగస్వామి’ సిల్క్స్ పక్కనే మరో కొట్టు ఉంటుంది. బయట కణకణలాడుతూ కనిపించే ఓ నిప్పు కణికెల పే...ద్ద పొయ్యి మీద పాలు మరుగుతూ ఉంటాయి. అక్కడ పాలతో పాటు, లస్సీ, మలాయ్ మీద చక్కెర, పాలతో చేసే కలాఖండ్ ఇత్యాది పాల ఉత్పాదనలన్నీ అమ్ముతూ ఉంటారు. అదెంత పాతదంటే... దాదాపు పాతికేళ్ల క్రితమే దుకణాలకు షట్టర్లు అమర్చిన ఈ కాలంలోనూ... అలనాటి పాత గట్టి చెక్క తలుపులతో... అలనాటి వాళ్ల తలపులతో అలరారుతూ ఉంటుందా కొట్టు.

చక్కెర వ్యాధి ఉన్నవాడు దాన్ని చెత్తబుట్టలో వేసేసి, కొలెస్ట్రాల్‌తో కొట్లాడి, దాన్ని పక్కన పడుకోబెట్టి... డబుల్ మలాయ్ మీద త్రిబుల్ చక్కెర వేయించుకుని తింటూ ఉంటాడు. సినిమా థియేటర్ల తాలూకు జురాసిక్ పిరియడ్‌లో ఆ కొట్టుకు సరిగ్గా ఇరువైపులా ముందు భాగంలో రాయల్ టాకీసూ, దిల్‌షాద్ థియేటరూ అని రెండు సినిమా హాళ్లుండేవి. థియేటర్ల జురాసిక్ కాలాంతం నాటికి అలనాటి ఆ థియేటర్లతో పాటూ తర్వాత ఆవిర్భవించిన పరమేశ్వరీ, మహేశ్వరీ లాంటి మరెన్నో అంతరించి పోయాయేమోగానీ... పాలలోని అమృతగుణం వల్ల ఆ షాపు మాత్రం ఇంకా నిప్పుకణికల పొయ్యిలోని ఎర్రదనంతో ఖణఖణలాడుతూ... సారీ కళకళలాడుతూ జనాల మలాయ్ జిహ్వను తీరుస్తూ అక్కడే ఉంది. ఇక మెహదీపట్నం రైతుబజార్ పక్కనే ఉన్న రోడ్డు మీద ఇంటర్నేషనల్ ఫ్రూట్‌జ్యూస్ సెంటర్‌లోని ఫ్రూట్‌సలాడ్ సరేసరి. కాకపోతే అప్పట్లో మట్టిముంతలో ఫ్రూట్‌సలాడ్ ఇచ్చేవారు. కాలక్రమంలో మట్టిముంత మట్టిలో కలిసిపోగా... ఇప్పుడు ప్లాస్టిక్ గిన్నెల్లో ఇస్తున్నారు. ఇలాంటివే మరెన్నో... అల్ఫా చాయ్, బ్లూసీ టీ, బవర్చీ బిర్యానీ, పిస్తాహౌజ్ హలీమ్. వీటన్నింటికీ సలామ్.
 
ఇంత ఏల... మచ్చుకో ఉదాహరణ ఇచ్చుకుందాం చాలు. మన గోకుల్ చాట్‌లో బాంబులు పెట్టి పేల్చేసినా సరే... ఉగ్రవాదుల్నీ, వాళ్ల దుశ్చర్యలనూ తమ నాలుకలను బయటపెట్టి... ‘వెవ్వెవ్వే’ అని వెక్కిరించి... బయటకు తీసిన ఆ నాలుక మీద కాసిన్ని చాట్ ఐటమ్స్‌ను చప్పరిస్తూ ఇప్పటికీ తమ చాటాభిమానం చాట్‌కుంటున్నారు మన నగరవాసులు. ఈ అన్నిచోట్లకూ కార్లలోని క్లాసు పీపుల్‌తో పాటు మాస్ పీపులూ ఒకేలా వస్తూ, ఐటమ్స్‌ను టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇదీ సగటు హైదరాబాదీల కాస్టు ఎఫెక్టివ్ టేస్టు మహిమ.
 
- యాసీన్

మరిన్ని వార్తలు