సిటీజన్స్ స్క్రీన్ జంకీస్

13 Sep, 2014 01:23 IST|Sakshi
సిటీజన్స్ స్క్రీన్ జంకీస్

గ్రేటర్‌లో సగం మంది రోజుకు ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కు పోతారట. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్, మొబైల్ వీటిల్లో ఏదో ఒక తెరతో కుస్తీపడుతూ... కళ్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తాజా ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే... ఈ విషయంలో మన సిటీ ముంబైతో పోటీపడుతోంది. ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ టైటాన్ ఐవేర్ డివిజన్ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ‘స్క్రీన్ జంకీ పోల్’లో  పలు మెట్రో నగరాలకు చెందిన వెయ్యిమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. జాతీయ స్థాయిలో మొత్తంగా 41 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల వంటివి వినియోగిస్తున్నట్టు తేలింది. సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు...
 
  ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్ వంటి విభిన్న రకాల తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో కేవలం 11 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. వారాంతంలో మాత్రం ఇది 41 శాతానికి  చేరుకోవడం విశేషం. ఇందులో ట్యాబ్లెట్స్ వినియోగించే వారే అధికం.
  -    ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోవాసుల్లో 25 శాతం మంది మాత్రం రోజులో ఎక్కువ గంటలు టీవీని వీక్షించి కాలక్షేపం చేస్తున్నారు.
 -    ఇక వీకెండ్‌లో డిజిటల్ తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో 41 శాతం, అహ్మదాబాద్‌లో 68 శాతం, లక్నోలో 64 శాతం మంది.
 
  -    భువనేశ్వర్‌లో 47 శాతం మంది మొబైల్స్, స్మార్‌‌ట ఫోన్లు వినియోగిస్తున్నారు.
  -    లక్నోలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు వినియోగించేందుకు 50 శాతం మంది మక్కువ చూపుతున్నారు.
  -    ట్యాబ్‌లెట్స్ వినియోగంలో దేశరాజధాని ఢిల్లీ వాసులు టాప్‌లో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న వారిలో 7 శాతం మంది ట్యాబ్‌లెట్స్‌పై మనసు పారేసుకోవడం విశేషం.
 
 అతిగా వాడితే కళ్లకు చేటే..
గంటల తరబడి ఆయా తెరలతో కుస్తీపడుతున్న వాళ్లకు కళ్లకు సంబంధించిన సమస్యలు తప్పవని కంటి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తెరలపై పనిచేయాల్సి వచ్చినపుడు,వీక్షిస్తున్నప్పుడు కళ్లకు చేటు చేయని నాణ్యమైన కళ్లజోళ్లు ధరించాలని సూచిస్తున్నారు. తరచూ కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు