మన సరోవరం

17 Nov, 2014 01:09 IST|Sakshi
మన సరోవరం

 చూసొద్దాం రండి
 
నగర జలసిరిగా.. సిటీవాసులకు విహార విడిదిగా తళతళ మెరిసే హుస్సేన్‌సాగర్‌కు ఘనకీర్తి ఉంది. జంటనగరాలను కలిపే ట్యాంక్‌బండ్,  తటాకం నడిబొడ్డున  జిబ్రాల్టర్ రాతిపై ఏర్పాటు చేసిన బుద్ధుని ఏకశిలా ప్రతిమ.. జలాలపై దూసుకుపోయే బోట్లు.. సిటీ సరోవరానికి కంఠాభరణంగా వెలిసిన నెక్లెస్ రోడ్డు.. ఇవన్నీ ఎందరికో కాలక్షేపం ఇస్తున్నాయి. ముఖ్యంగా ఏటా సిటీలో అంగరంగ వైభవంగా సాగే వినాయక నిమజ్జనోత్సవం.. హుస్సేన్‌సాగర్ కు మరింత అందాన్నిస్తోంది.
 
హుస్సేన్‌సాగర్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. కుతుబ్‌షాహీ ప్రభువైన ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పాలనలో 1562 ప్రాంతంలో హుస్సేన్ సాగర్‌ను నిర్మించారు.  హైదరాబాద్‌కు 32 కిలోమీటర్ల ఎగువన మూసీనదికి ఉన్న బల్కాపూర్ చానల్ గుండా సాగర్‌కు జలాలు విడుదలయ్యేవి. ఎనిమిది చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న ఈ భారీ తటాకంపై సుమారు ఒకటిన్నర మైలు పొడవున్న ట్యాంక్‌బండ్ నిర్మించారు. సాగర్ జలాలను క్రమబద్ధీకరించేందుకు సికింద్రాబాద్ వైపు నాలుగు
స్లూయిస్‌లున్నాయి.

ఈ తటాక నిర్మాణ బాధ్యతలు ఇబ్రహీం కుతుబ్‌షా ప్రభువు తన అల్లుడు హుస్సేన్‌షాకు అప్పగించాడు. 3 ఏళ్ల 7 నెలల 19 రోజులలో రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ చెరువును నిర్మించారు. నాలుగేళ్లు దాటినా చెరువులోకి చుక్క నీరు చేరుకోకపోవడంతో ఇబ్రహీం కుతుబ్‌షా మూసీ నుంచి నీరు వచ్చేలా కాలువలు తవ్వించమని ఆదేశించారు. దాంతో హుస్సేన్‌సాగర్ తొలిసారి జలకళ సంతరించుకుంది.
 
హుస్సేన్‌సాహెబ్ చెరువు..

హుస్సేన్‌షా వలీ నేతృత్వంలో ఏర్పాటైన చెరువు కావడంతో స్థానికులు దీన్ని హుస్సేన్‌సాహెబ్ చెరువుగా పిలిచేవారు. ఒకరోజు ట్యాంక్‌బండ్ ప్రాంతానికి వ్యాహ్యాళికి వెళ్లిన ఇబ్రహీం కుతుబ్‌షా అక్కడున్న స్థానికులతో ఈ చెరువు పేరేమిటి ? అని అడిగారట. ‘హుస్సేన్‌సాహెబ్ చెరువు’ అని తడుముకోకుండా జవాబు రావడంతో కుతుబ్‌షా అవాక్కయ్యారట. దాంతో తన పేరున మరో చెరువు ఉండాలని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మరో చెరువు తవ్వించాడు. అందుకు తానే స్వయంగా చెరువుకు తగిన నమూనా రూపొందించారట కూడా. జంటనగరాల ప్రజల దాహార్తిని హుస్సేన్‌సాగర్ చాలా కాలం తీర్చింది. కోఠిలోని బ్రిటిష్ రెసిడెంట్‌లకు సైతం సాగర్ నుంచే మంచి నీటి సరఫరా జరిగేది. 1921లో ఉస్మాన్‌సాగర్ నిర్మాణం చేపట్టే వరకు తాగునీటికి హుస్సేన్‌సాగరే ప్రధాన వనరుగా ఉంది. సికింద్రాబాద్ వైపున ఉన్న బోట్స్ క్లబ్ దేశంలో అత్యుత్తమమైనదిగా ప్రసిద్ధి చెందింది.
 
మార్పు కోరుకుందాం..

గతం ఎంత ఘనమైన.. మానవ తప్పిదాలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చేశాయి. ఒకప్పుడు మంచినీటితో కళకళలాడిన ఈ తటాకం.. ఇప్పుడు కలుషిత జలాలతో కంపుకొడుతోంది. సాగర్ పరిసర ప్రాంతాల్లో ముక్కుమూసుకుని నడవాల్సి వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సాగర్ ప్రక్షాళనపై వేగవంతంగా స్పందించడం సాగర్ ప్రియులకు శుభవార్తే. ఇందుకోసం రూపొందిస్తున్న ప్రణాళికలు పక్కాగా కార్యరూపం దాలిస్తే.. మన హుస్సేన్ సాగర్‌కు పూర్వవైభవం వస్తుంది. ఈ మార్పు తొందరగా రావాలని కోరుకుందాం.. !!
 
 మల్లాది కృష్ణానంద్
 malladisukku@gmail.com

 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు