'అమరనాథ్'కు ఉత్తరఖండ్ ఎఫ్టెక్ట్!

9 Jul, 2013 03:31 IST|Sakshi
'అమరనాథ్'కు ఉత్తరఖండ్ ఎఫ్టెక్ట్!

ఇటీవల చోటుచేసుకున్న ఉత్తర ఖండ్ వరద ప్రమాదంతో అమరనాథ్ యాత్రకు భక్తులు తగ్గిందని ఆలయ బోర్డు అధికారులు తెలిపారు. ఉత్తరఖండ్ తోపాటు సుప్రీం కోర్టు నిబంధనలు కూడా భక్తుల రద్దీ తగ్టేందుకు కారణమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. జూన్ 28 తేదిన ప్రారంభమైన అమరనాథ్ యాత్రకు ముందు ఉత్తర ఖండ్ వరద భీభత్సం కూడా భక్తులను ఆలోచనలో పడేసింది.  సోమవారం ఉదయం వరకు 140,000 మంది యాత్రికులు మాత్రమే పవిత్ర గుహాలోని శివాలయాన్ని దర్శించుకున్నట్టు శ్రీ అమరనాథ్ ఆలయ బోర్డు అధికారులు తెలిపారు.

భక్తులకు వైద్య సహాయం అందించాలని సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గంలో పలుచోట్ల వైద్య సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని తట్టుకునే విధంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాశ్మీర్ లోని బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి గుహలోనికి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో అమరనాథ్ యాత్రపై ఉత్తరాఖండ్ వరదల ప్రభావం ఎక్కువగానే పడింది అని అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యాత్రికుల సంఖ్య తగ్గిందన్నారు.

భక్తుల సంఖ్య తగ్డడంతో వృద్ధులను, శారీరక సమస్యలతో బాధపడే వారిని మోసే 'పోని' యజమానుల వ్యాపారం బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు 7500 మందిని మాత్రమే అనుమతించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పోని వర్తకులపై ప్రభావం తీవ్రంగానే పడిందని నిర్వాహకులు తెలిపారు.

బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి గుహలోని ఆలయానికి చేరుకోవడానికి హెలికాప్టర్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ద్వారా గుహలోని ఆలయానికి చేరుకోవడానికి 2800 రూపాయలను వసూలు చేస్తున్నారు. సమయం కలిసి వచ్చే విధంగా, అసౌకర్యాన్ని తప్పించుకోవడానికి ఎక్కువమంది హెలికాఫ్టర్ సేవలను భక్తులు వినియోగించుకుంటున్నట్టు సమాచారం.

అమరనాథ్ యాత్రకు వెళ్లే వారికి ఉత్తర కాశ్మీర్ లోని మానిగమ్, దక్షిణ కాశ్మీర్ లోని వాల్ నట్ ఫ్యాక్టరీ, మీర్ బజార్ ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు