పార్క్ అవర్

1 Oct, 2014 02:11 IST|Sakshi
పార్క్ అవర్

ఫిట్‌నెస్ కోసం కోడి కూయక ముందే నిద్ర లేచి భారంగా జాగింగ్ వెళ్తుంటాం. దృఢమైన శరీరం కోసం చెమటలు కక్కుతూ గంటలకు గంటలు జిమ్‌లో గడుపుతాం. సరదాగా కాసేపు గంతులేస్తే చాలు మీ ఒళ్లు ఫిట్ చేస్తానంటోంది ‘పార్కోవర్’. మిలటరీ ట్రైనింగ్ తరహాలో కనిపించే ఈ గేమ్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతోంది. ఫ్రాన్స్‌లో పుట్టిన ఈ ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్ పార్కుల్లో ఎందరికో ఆరోగ్యాన్ని పంచుతోంది. ఇంతకీ ఈ ‘పార్కోవర్’ కథాకమామిషు ఏమిటో చూద్దాం.
 
 ఫ్రాన్స్ ఆర్ట్‌గా పేరొందిన పార్కోవర్ ఎల్లలు దాటి మన సిటీకి వచ్చేసింది. ఈ స్పోర్ట్స్ ఎక్సర్‌సైజ్‌ను ఒంటరిగానే కాదు బృందంగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సినంత స్థలం ఉన్న ప్రాంతాలను ఇందుకోసం ఎంచుకుంటారు. మన సిటీజనులు పార్కోవర్ ఫీట్ల కోసం పార్కులను ఎంచుకుంటున్నారు. సువిశాలమైన స్థలంతో పాటు కోర్స్ ట్రైనింగ్‌కు అనువుగా ఉండటంతో అందరూ పార్క్‌లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
 
 జంప్ అండ్ జాయ్..
 సరదాగా సాగే పార్కోవర్ గేమ్స్‌లో వినోదంతో పాటు కావాల్సినంత ఫిట్‌నెస్ దొరుకుతుంది. పార్క్‌లో రెండు గమ్యాలు నిర్దేశించుకుని ఒక దాని నుంచి మరొకదానికి చేరుకోవడమే ఇందులో థీమ్. ఈ జర్నీలో డిఫరెంట్ అబ్‌స్టాకిల్స్ ఉంటాయి. రన్నింగ్, క్లైంబింగ్, జంపింగ్, రోలింగ్, వాల్టింగ్, మంకీ వాల్ట్, లేజీ వాల్ట్, కాశ్ వాల్ట్, డాష్ వాల్ట్, కోంగ్ వాల్ట్, డబుల్ కోంగ్ వాల్ట్, సైడ్ వాల్ట్, స్పీడ్ వాల్ట్ తదితర గేమ్‌లు మనసును ఉత్తేజపరుస్తూ శరీరక బలాన్ని అందిస్తాయి. పరుగున వచ్చి ఎదురుగా ఎత్తులో ఉన్న పైపు మీదుగా దూకడం, ఒకవైపు దూకడం, కాళ్లను ఆనించి ఎగిరి దూకడం, గోడలు ఎక్కడం.. ఇలా డిఫరెంట్ గేమ్స్‌లో ట్రైనింగ్ ఇస్తారు. మొదటి రెండు నెలలు బేసిక్స్ నేర్పిస్తారు. తర్వాత పార్కోవర్ శిక్షణ ఇస్తారు.
 
 ఫుల్ రెస్పాన్స్..
సిటీలో పార్కోవర్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందంటున్నారు ట్రైనర్ అభినవ్. ‘చిన్నప్పటి నుంచే లాంగ్ జంప్, హై జంప్ చేయడమంటే ఇష్టం. పాఠశాల, కళాశాల స్థాయిలో జరిగిన ఈవెంట్లలో టాప్ పొజిషన్‌లో నిలిచాను. నాలుగేళ్ల కిందట పార్కోవర్ గురించి తెలిసింది. అప్పటి నుంచి యూ ట్యూబ్ సహకారంతో ఆ గేమ్‌ల గురించి తెలుసుకున్నా. ప్రాక్టీస్ చేశాను. ఫేస్‌బుక్ సహాయంతో ఫ్రెండ్స్ అయిన ఫ్రాన్స్ మిత్రులు రెండేళ్ల కిందట నగరానికి వచ్చి పార్కోవర్‌పై నాకు పూర్తి పట్టు వచ్చేలా ట్రైన్ చేశారు. ఇదే టైంలో చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన అఖిలేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్, పార్కోవర్ ఫ్రీ రన్నింగ్‌పై మంచి పట్టున్న అఖిలేష్ నాతో కలిశాడు. మేమిద్దరం కలసి లైవ్‌వైర్ డ్యాన్స్/ పార్కోవర్ కంపెనీని స్థాపించాం. రోజురోజుకి ఈ ట్రైనింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంద’ని అభినవ్ తె లిపారు. దీనికితోడు భారత్‌లోనే పార్కోవర్ తొలి మహిళ ఇన్‌స్ట్రక్టర్ జ్యోతి మాతో పనిచేస్తోందని చెప్పారు.
 
 ట్రైనింగ్...
 ఆది, మంగళ, గురు, శని వారాల్లో నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఈ ట్రైనింగ్ ఉంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో బొటానికల్ గార్డెన్‌లోనూ ఇదే టైంలో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఫేస్‌బుక్‌లో Livewire dance/parkour company  లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చంటున్నారు నిర్వాహకులు.
 - వాంకె శ్రీనివాస్

మరిన్ని వార్తలు