పర్షియన్ మహాభారతం

18 Feb, 2015 23:53 IST|Sakshi
పర్షియన్ మహాభారతం

జాతస్య హి ద్రువో మృత్యుః పూర్తి కాకుండానే అది మహాభారతంలోని భగవద్గీత శ్లోకమని ఠక్కున చెప్పేస్తాం. మన ఇతిహాసాలు సగటు భారతీయుడిపై అంతగా ముద్ర వేశాయంటే అతిశయోక్తి కాదు. అయితే ‘పర్షియన్ మహాభారతం’ గురించి ఎప్పుడైనా విన్నారా? పర్షియాలో మహాభారతమేంటని అనుమానపోకండి. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన ఈ మహాగ్రంథాన్ని 400 ఏళ్ల కిందట అక్బర్ సంస్థానంలోని ‘నవరత్నా’ల్లో ఒకరైన అబుల్ ఫజిల్ పర్షియన్‌లోకి కూడా అనువాదం చేశారు. ఆ గ్రంథం ఇప్పటికీ చెక్కు చెదరకుండా జామియా నిజామియా గ్రంథాలయంలో భద్రంగా ఉంది.
 ..:: ఎస్.శ్రావణ్‌జయ
 
భాగ్యనగర దర్పానికి చిహ్నంగా నిలిచే చార్మినార్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోని శిబ్లి గంజ్‌లో పురాతన జామియా నిజామియా లైబ్రరీ ఉంది. 144 ఏళ్ల కిందట జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 1874లో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత 25 వేల పుస్తకాలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం లక్ష పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పర్షియన్‌తో పాటు ఇక్కడ ఉర్దు, అరబిక్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని పుస్తకాలను భద్రపరిచారు. అలాగే కొన్ని తెలుగు పుస్తకాలు కూడా ఉంచారు. నిజాం నవాబు వంశంలో 6, 7తరాలకు చెందినవారు కూడా ఇక్కడే చదువుకున్నారు.
 
బంగారు రేకులతో...

జామియా లైబ్రరీలో మహాభారతంతో పాటు దాదాపు 3000 రాత ప్రతులున్నాయి. ‘మను చరిత్రకు సంబంధించి మా వద్ద ఉన్న గ్రంథాలు 200 ఏళ్లకు పూర్వం రచించినవే. అత్యంత పురాతన మను చరిత్ర గ్రంథాన్ని 700 ఏళ్లకు పూర్వమే కితాబ్ ఉల్ తబ్సేరా ఫిల్ ఆషరా రచించారు. మా లైబ్రరీలో మొత్తం 40 సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు 5 భాషల్లో దొరుకుతాయి’ అని లైబ్రేరియన్ షా మహమ్మద్ ఫసీదుద్దీన్ నిజామియా చెప్పారు. ఇక్కడ అత్యంత పురాతనమైన ఖురాన్ గ్రంథం కూడా ఉంది. ఇందులోని మొదటి రెండు పేజీలు బంగారు రేకులతో రూపొందించారు.
 
విద్యాదాయిని...

జామియా నిజామియా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి తిండి, బట్ట, వైద్యం అన్నీ ట్రస్ట్ భరిస్తుంది. దీనికి ప్రభుత్వ సాయం లేదు. కేవలం విరాళాలతోనే ఈ ట్రస్ట్ నడుస్తోంది. బర్మా, శ్రీలంక, యెమెన్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ నుంచి కూడా విద్యార్థులు పీహెచ్‌డీ చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. వారిలో కొందరికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు కూడా లభించాయి. మార్చి 21, 22తేదీల్లోలైబ్రరీ వ్యవస్థాపకుడు జామియా మహమ్మద్ అల్ ఫరూకీ 100వ వ ర్ధంతి ఘనంగా నిర్వహించనున్నారు. పరమత దూషణ, పరమత హింస అక్కడక్కడా జరుగుతున్న ఈ కాలంలో పరభాష నుంచి అనువదించిన గ్రంథాలను వందల ఏళ్ల నుంచి జాగ్రత్తగా కాపాడటం అరుదైన విషయం!

మరిన్ని వార్తలు