మధుమేహం ఉపవాసంతో చెక్‌!

15 Oct, 2018 01:12 IST|Sakshi

ప్రణాళికా బద్ధంగా చేసే ఉపవాసం ద్వారా టైప్‌–2 రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించడంతోపాటు ఇన్సులిన్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చునని వైద్యులు అంటున్నారు. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ఓ పరిశోధనా వ్యాసం ప్రకారం.. రోజులో ఎక్కువ కాలంపాటు ఆహారం తీసుకోకుండా ఉండటం మధుమేహులకు మేలు చేస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న, మధుమేహంతో బాధపడుతున్న ముగ్గురు పురుషులపై ఒక ప్రయోగం జరిగింది.

పోషకాహారంపై జరిగిన ఒక సదస్సు ద్వారా ఈ ముగ్గురికి మధుమేహం ఎలా వస్తుంది? ఎలాటి ప్రభావం చూపుతుంది? ఇన్సులిన్‌ నిరోధకత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఆ తరువాత వారికి నిర్దిష్ట వేళలు, ఆహారాన్ని సూచించారు. ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు రోజు విడిచి రోజు 24 గంటల ఉపవాసం ఉంటే.. ఇంకొకరు వారంలో మూడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.

ఉపవాసం ఉన్న రోజుల్లో టీ/కాఫీ, నీళ్లు తాగడంతోపాటు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని సాయంకాలం అందించారు.  పదినెలల తరువాత ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్, సగటు చక్కెర మోతాదు, శరీర బరువు, నడుము చుట్టుకొలత వంటి వివరాలు సేకరించారు. మునుపటితో పోలిస్తే పది నుంచి 18 శాతం బరువు తగ్గడంతోపాటు ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ మోతాదులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు గుర్తించారు. అయితే మరింత విస్తృత స్థాయి ప్రయోగాలు జరిపి ఫలితాలను రూఢి చేసుకున్న తరువాతే ఈ పద్ధతిని అందరూ వాడేందుకు అవకాశం ఉంటుందని అంచనా.

ఈ టెక్నాలజీ భూతాపోన్నతిని ఆపుతుందా?
భూతాపోన్నతి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. గాల్లో ఏటికేడాదీ ఎక్కువైపోతున్న బొగ్గుపులుసు వాయువును తీసేయడంతోనే సమస్య పరిష్కారం కాదు. కానీ.. ఇది కూడా కీలకమవుతుందని అంటున్నారు క్లైమ్‌వర్క్స్‌ శాస్త్రవేత్తలు. భారీసైజు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు పెట్టి గాలిని పీల్చేయడం.. దాంట్లోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చేయడం.. ఆ క్రమంలోనే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం కోసం క్లైమ్‌వర్క్స్‌ ఓ టెక్నాలజీ అభివృద్ధి చేసింది.

ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు వాడుతున్నప్పటికీ ఈ టెక్నాలజీ ద్వారా విద్యుత్తు నికరంగా మిగులుతోందేగానీ ఖర్చు మాత్రం కావడం లేదు. పైగా విషవాయువులను గాల్లోంచి వేరు చేస్తున్నారు. 2017లో క్లైమ్‌వర్క్స్‌ ఈ టెక్నాలజీని మొదటి సారి పరీక్షించింది. జ్యూరిచ్‌ సమీపంలోని హిన్‌విల్‌ ప్రాంతంలో ఏర్పాటైన ప్లాంట్‌ ఏడాదికి 900 టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టగలదు.

ఈ విషవాయువును కాంక్రీట్‌ మొదలుకొని సౌర ఇంధనాల వరకూ అనేక రూపాల్లో వాడుకోవచ్చునని క్లైమ్‌వర్క్స్‌ చెబుతోంది. మనిషి ఏటా వాతావరణంలోకి పంపుతున్న కార్బన్‌డైఆక్సైడ్‌ 30–40 గిగా టన్నులు ఉంటుందని, సాధారణ పద్ధతుల ద్వారా లేదా మొక్కలు పెంచడం ద్వారా ఇంత భారీ మొత్తంలో కార్బన్‌డైఆక్సైడ్‌ను వాతావరణంలోకి చేరకుండా ఆపడం కష్టం కాబట్టి క్లైమ్‌వర్క్స్‌ టెక్నాలజాలు అవసరమవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని వార్తలు