పెట్స్ స్పాట్

5 Aug, 2014 00:36 IST|Sakshi
పెట్స్ స్పాట్

ఛీ.. కుక్క బతుకు అని తిట్టే వాళ్లు.. ఈ శునకాల రాజసం చూస్తే.. ఆ తిట్టు ఇక తిడితే ఒట్టు. తమ పెట్స్‌ను ముస్తాబు చేయడానికి ప్రత్యేక సెలూన్‌కు తీసుకెళ్తున్నారు పెట్స్ యజమానులు. వారానికో, నెలకో ఓసారి వాటిని కేర్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆపాదమస్తకం అందంగా తీర్చిదిద్దుతున్నారు.
 
 క్లాస్ సెలూన్‌లో హెయిర్ కట్ చేస్తారు.. ఫేషియల్.. బాడీ మసాజ్ వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. మనుషులకైతే ఓకే.. పెంపుడు కుక్కలకు.. పిల్లులకు.. కుందేళ్లకు.. గునియా పిగ్స్.. బర్డ్స్‌కు కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో వాళ్లందరికీ ప్రేమ పంచే పెట్స్‌పై వాటి యజమానులూ అంతే ప్రేమను చూపిస్తున్నారు. కాస్త ఉన్నవాళ్లయితే.. తమ పెంపుడు జంతువులను తమకన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇలాంటి వారికి వరంగా మారాయి పెట్స్ కేర్ సెంటర్స్.
 
 కంప్లీట్ పెట్స్ కేర్
 పెట్స్‌కు హెయిర్ సెట్టింగ్, నెయిల్స్ కటింగ్, స్నానం చేయించే సెలూన్స్ సిటీలో చాలానే ఉన్నాయి.  పెట్ కేర్ సెంటర్స్‌లో వాటిని అందంగానే కాదు ఆరోగ్యంగా చూసుకునే సదుపాయాలు ఉన్నాయి. శునకాలకు స్పా (బాడీ మసాజ్) చేసే చాయిస్ ఉంటుంది. అంతేనా వాటి మనసుకు ఆహ్లాదపరిచే విధంగా ప్రత్యేకంగా అరోమా థెరపీ కూడా ఇస్తున్నారు పెట్ సెంటర్స్ నిర్వాహకులు. డిఫరెంట్ ఫ్లేవర్ స్ప్రే చేసిన రూమ్‌లో లైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ.. వాటికి ఆనందాన్ని కల్పిస్తున్నారు. అరోమా థెరపీ అంటే కుక్కలు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి కూడా.
 
 మేకప్ అదరహో
 ఒత్తుగా జుట్టు ఉండే కుక్కలకు  పెట్ కేర్ సెంటర్స్‌లో ప్రత్యేకంగా హెయిర్ రిమూవ్ చేయడంతో పాటు టిక్ రిమూవల్ (పేన్లు తీసివేయడం) కూడా చేస్తున్నారు. పెట్స్ కు పిలకలు కట్టి.. మంచి మంచి బట్టలు చుట్టి.. అదిరేటి లుక్ ఇస్తున్నారు. యాక్సరీస్, చెయిన్స్ ఫినిషింగ్ ఇవ్వడంతో శునకాల్లో రాజసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీస్ ఎలా చేయాలో కూడా యజమానులకు వివరిస్తున్నారు. ఈ పెట్స్ కేర్ కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
 
 పార్టీ అండ్ రిటర్న్ గిఫ్ట్
 కుక్కలకు, ఇతర పెట్స్‌కు సరదాగా బర్త్ డే పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి వచ్చిన అతిథులకు (ఇవీ పెట్సే) రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఆ పార్టీలో ఫుల్ మ్యూజిక్‌లో తెగ ఎంజాయ్ చేస్తాయి. ప్రవర్తన, యాక్టివ్‌నె స్‌ను బట్టి వాటికి గ్రేడింగ్ (స్పెషల్ ట్రీట్స్, కుక్కీస్, పేస్ట్రీస్) కూడా ఇస్తున్నారు. ఇవి ఆడుకునేందుకు బొమ్మలు కూడా ఉంటాయి.
 
 బోర్డింగ్ అండ్ లాడ్జింగ్
 అనారోగ్యంతో వచ్చిన పెట్స్ కేర్ కోసం ఇక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పెట్స్‌కు అందించే సేవలను బట్టి రూ.50 నుంచి రూ.5,000 వరకు చార్జ్ చేస్తున్నారు.
 
 పిల్లులే డేంజర్
 కుక్కలు కాస్త కుదురుగా ఉన్నా.. పిల్లుల విషయంలో జాగ్రత్త తప్పని సరి. అవి ఒక్కచోట ఉండవు. పైగా కోపం ఎక్కువ. స్నానం చేయించేటప్పుడు.. హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు గీరడానికి ప్రయత్నిస్తుంటాయి. గ్లవ్‌స్ వేసుకుని వీటిని జాగ్రత్తగా టాకిల్ చేయాల్సి ఉంటుంది. పిల్లుల కేర్ విషయంలో చార్జెస్ ఎక్కువగా తీసుకుంటాం.
 - అదితి
 నెయిల్స్ అండ్ టెయిల్స్ పెట్స్ కేర్ సెంటర్

>
మరిన్ని వార్తలు