ఆఫీస్లో అశ్లీలం!

23 Aug, 2013 14:33 IST|Sakshi
ఆఫీస్లో అశ్లీలం!

నీలి చిత్రాల వీక్షణకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పోతోంది. సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో అమరిపోతున్న నేపథ్యంలో నేటి యువత చాలావరకూ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసలవుతోంటే, మరోవైపు బాధ్యతాయుత పదవుల్లో ఉండే ఉద్యోగులు కూడా వీటి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా కర్ణాటకలో మరోసారి నీలి చిత్రాల వీక్షణ కలకలం సృష్టిస్తోంది.

 

అప్పట్లో ఇద్దరు మంత్రులు సాక్షాత్తూ నిండు శాసనసభలో తమ మొబైల్లో బూతు చిత్రాలు వీక్షిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అనంతరం తమ పదవులను కూడా వదులుకోవల్సి వచ్చింది. ఈ జాఢ్యం ఈసారి ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది.  కర్ణాటకలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు పని ఎగ్గొట్టి మరీ ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారని సీఐడీకి సీబీఐ సమాచారమిచ్చింది.

విధాన సౌధలో ఈ పోకడ ఎక్కువగా కనిపించిందని పేర్కొంది. ప్రజలకు మంచి పాలనను అందించాల్సిన విధాన సౌధలో  ప్రస్తుతం 'నీలి' నీడలు కమ్ముకున్నాయి. సీబీఐలోని సైబర్ నిపుణులు ఉగ్రవాద వ్యతిరేక నిఘా వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. విధాన సౌధలో నీలి చిత్రాల వీక్షణ గురించి సీఐడీకి ఎప్పటికప్పుడు సీబీఐ సమాచారం చేరవేసినట్లు తెలిసింది.

‘ప్రభుత్వ పనంటే భగవంతుని పని’ అని రాష్ట్ర పాలనకు మూల స్థానమైన విధాన సౌధపై తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటుంది. అయితే అందులో పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు ఆ నినాద స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ సీబీఐ, సీఐడీకి సమాచార నివేదికను ఇచ్చింది. ఉద్యోగులు పని ఎగ్గొట్టి ‘అశ్లీల సైట్లు’ చూస్తున్నారన్నది నివేదిక సారాంశం. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఇంటర్‌నెట్ కార్యకలాపాలను సీబీఐ పర్యవేక్షిస్తుంది. కర్.నిక్.ఇన్‌తో ఇంటర్‌నెట్ ప్రొటోకాల్‌ను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రభుత్వోద్యోగులు అశ్లీల చిత్రాలను చూస్తున్నారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

 సీబీఐలోని సైబర్ నిపుణులు ఉగ్రవాద వ్యతిరేక నిఘా వేసినప్పుడు ఈ విషయం బయటపడింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువైనప్పటి నుంచీ గత రెండేళ్లుగా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు సీబీఐ పర్యవేక్షణలో ఉన్నాయి. విధాన సౌధలో నీలి చిత్రాల వీక్షణ గురించి సీఐడీకి ఎప్పటికప్పుడు సీబీఐ సమాచారం చేరవేస్తోంది.  మరోవైపు ఈ ఘటనపై  ప్రభుత్వోద్యోగులు నీలి చిత్రాలను వీక్షిస్తున్నారన్న నిగూఢ సమాచారంపై తగు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అశ్లీల చిత్రాలను చూసే అవకాశం లభిస్తోంది. సొంత సాధనాల నుంచి అశ్లీల చిత్రాలను చూడవచ్చేమో కానీ, అధికారిక కంప్యూటర్లలో అలాంటి వాటిని వీక్షించడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు రావడమే కాకుండా శిక్ష కూడా ఉంటుంది. సీబీఐ నుంచి ఇలాంటి నివేదిక అందిందా, లేదా అని ఆరా తీస్తే సీఐడీ అధికారులు పెదవి విప్పడం లేదు. మరోవైపు అశ్లీల చిత్రాల వీక్షణంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐడీ అధికారులు చెప్పటం విశేషం.

కాగా ఇటీవలే చైనాలో ఇంటర్నెట్‌ కేంద్రాల్లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్న ఐదు వేల మందికి పైగా నెటిజన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆ దేశంలోని నెటిజన్లలో పెను సంచలనం సృష్టించింది. చైనాలో దాదాపు 40 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో సింహభాగం మంది అశ్లీల వీడియోలను వీక్షించేందుకే ఇంటర్నెట్ కేంద్రాలను వినియోగిస్తున్నారు. 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా