పూరీలో నేడు జగన్నాథుని బహుదాయాత్ర

18 Jul, 2013 03:31 IST|Sakshi
పూరీలో నేడు జగన్నాథుని బహుదాయాత్ర

(పూరీలో నేడు జగన్నాథుని బహుదాయాత్ర, రేపు సునాబేషా ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా...)

 శ్రీజగన్నాథుని తత్త్వం సాక్షాత్తు మానవీయం. దైనందిన జీవితంలో ప్రతి సన్నివేశం స్వామి సేవలు, ఉత్సవాల్లో కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. అందుకే ఆయన భక్తుల దగ్గరకు తరలివచ్చే భగవంతునిగా వాసికెక్కాడు. ఈ యాత్ర సౌభ్రాతృత్వానికి ప్రతీక. ప్రియసఖి మహాలక్ష్మిని విడిచి తోబుట్టువు సుభద్రతో ఆయన యాత్ర చేయడం ప్రధాన విశేషం. కుల-మత- వర్గ-వర్ణ వివక్ష లేకుండా అందరూ సమానమేనన్న భావంతో స్వామి సేవలో లీనమైపోవడం ఈ యాత్రలోని విశేషం. యాత్రకు పదిహేను రోజుల ముందు అనారోగ్యంతో చీకటి మందిరంలో గోప్యసేవలతో స్వామి ముచ్చటలకు దూరమైన మహాలక్ష్మిని వీడి, ఆరోగ్యం కోలుకున్న వెంటనే సోదరితో స్వామి యాత్రకు బయలుదేరడం లక్ష్మీదేవిని ఉక్రోషానికి గురి చేస్తుంది. 

 
భార్యాభర్తల అనుబంధానికి అద్దంపట్టే అపురూప ఘట్టాల్ని యాత్రలో తిలకిస్తే మేను పులకరించిపోతుంది. సోదరీసోదరులతో శ్రీజగన్నాథుడు యాత్రలో గుండిచా మందిరానికి వెళ్లడంతో శ్రీలక్ష్మి కొలువుదీరిన శ్రీమందిరం బోసి పోతుంది. స్వామి చేరువలో లేకుండా నాలుగు రోజులు గడిపిన శ్రీలక్ష్మి అయిదో రోజున స్వామి రాక విషయాల్ని తెలుసుకునే ప్రయత్నంలో గుండిచా మందిరానికి బయల్దేరుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవం ‘హెరా పంచమి’. ప్రియసఖి వస్తుందనే విషయాన్ని పసిగట్టిన జగన్నాథుడు గుండిచా మందిరంలో ప్రత్యేకంగా ముస్తాబవుతాడు. ప్రత్యేక సేవకులు స్వామికి సుమారు ఏడు గంటలపాటు చేసే ఈ అలంకారసేవను ‘బొనొకొ లగి’ అంటారు. 
 
ఇదంతా హెరా పంచమి ముందు రోజు సంధ్య వేళలో పూర్తవుతుంది. ముస్తాబై నిరీక్షించిన స్వామి, ముంగిట వరకు చేరిన మహాలక్ష్మికి ప్రత్యక్ష దర్శనం కల్పించకుండా నిరుత్సాహపరుస్తాడు. విరహంతో తల్లడిల్లిపోతున్న లక్ష్మీదేవి మరింత వేదనతో గుండిచా మందిరం నక్కొచొణా ద్వారం నుంచి బయటకు వచ్చేస్తుంది. భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి పూర్తి అధికారాలు, హక్కులు ఉంటాయి. తనలో నిండిపోయిన కోపంతో (మురిపెం) నక్కొచొణా ద్వారం ఎదురుగా ఉన్న జగన్నాథుని ‘నందిఘోష్’ రథం విరగగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకింత విరిగితే గాని ఆమె వెనుదిరగదు. స్వామి దర్శనం కోసం ఎంతో హుందాగా బయల్దేరిన శ్రీమహాలక్ష్మికి స్వామి దర్శనం ప్రాప్తించదు. ఒకవైపు నిరుత్సాహం, మరోవైపు అవమానం మధ్య వెళ్లిన దారిలో రాకుండా వేరే మార్గంలో శ్రీమహాలక్ష్మి శ్రీమందిరానికి తిరిగి రావడంతో హెరా పంచమి ఉత్సవానికి తెరపడుతుంది.  
 
 హెరా పంచమి ఉత్సవం
 
 శ్రీజగన్నాథుని రథయాత్ర ప్రధాన ఘట్టాల్లో ముచ్చట గొలిపే ఉత్సవం ఇది. శ్రీమందిరం నుంచి శ్రీమహాలక్ష్మి గుండిచా మందిరానికి వెళ్లి రావడం ఉత్సవ సారాంశం. విరహం కాపురంలో ఎంతటి కలహం సృష్టిస్తుందో హెరా పంచమి ఉత్సవం ప్రతిబింబిస్తుంది. యాత్ర అయిదో రోజున ఈ ఉత్సవాన్ని రాత్రి పూట (సంధ్య వేళ) నిర్వహిస్తారు. స్వామి దర్శనం కోసం మహాలక్ష్మి పల్లకిలో బయల్దేరుతుంది. భార్యాభర్తల నడుమ కొనసాగే నిత్య కలహాలు, బుజ్జగింపుల ఇతివృత్తంతో సరదా పాటలు, మంగళహారతులతో మహాలక్ష్మిని దారిపొడవునా మహిళలు ఆరాధిస్తారు. గుండిచా మందిరం సింహద్వారం గుండా మహాలక్ష్మి స్వామి కోసం గుండిచా మందిరంలోకి ప్రవేశిస్తుంది. అరుణస్తంభం దారిలో దేవి రాక కోసం నిరీక్షిస్తున్నట్లు స్వామి దగ్గర నుంచి ఆజ్ఞామాల శ్రీమహాలక్ష్మికి చేరడంతో మురిసిపోతుంది. స్వామి కొలువుదీరిన అడపా మండపం ముఖద్వారం వరకు అంతా సజావుగా సాగుతుంది. 
 
స్వామిని తనివితీరా చూసుకుంటాననే ఊహల్లో తేలియాడిన మహాలక్ష్మి ఖంగు తింటుంది. నిత్యసేవల్లో స్వామి తలమునకలై దర్శనం కావాలంటే నిరీక్షించాల్సిందేనని సంకేతాలు పంపిస్తాడు. పురుషులు ఆటపట్టిస్తే స్త్రీలు అలగడం తరచు తారసపడే విషయమే. అదే ఇక్కడ చోటుచేసుకుంటుంది. స్వామి దర్శనం కోసం నిరీక్షించే ప్రసక్తే లేదని మహాలక్ష్మి గుండిచా పెరటి ద్వారం నక్కొచొణా నుంచి వెనుదిరుగుతుంది. ఆమె హృదయం శాంతించదు. విరహంతో కట్టలు తెంచుకున్న కోపంతో నందిఘోష్ రథంలో ఒక ముక్క విరగగొట్టడంతో మహాలక్ష్మి కోపం కొంతమేరకు తగ్గుతుంది. స్వామిని దర్శించుకోలేని మహాలక్ష్మి ప్రజల మధ్య నుంచి శ్రీమందిరానికి వెళ్లేందుకు మొగమాట పడుతుంది. మారుదారిలో (హెరాగహిరి సాహి) చల్లగా శ్రీమందిరానికి వెళ్లిపోతుంది. 
 
 - ఎస్వీ రమణమూర్తి, సాక్షి, భువనేశ్వర్

మరిన్ని వార్తలు