పగలగొట్టాల్సింది మూఢత్వాని

1 Apr, 2014 23:59 IST|Sakshi
పగలగొట్టాల్సింది మూఢత్వాని

 ఒక రోజు ప్రొద్దున కర్ణాటక అమ్మాయిలు కొందరు ఆలయానికి వచ్చారు. అంతా ఎం.బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. నేనప్పుడు మైకులో భక్తులనుద్దేశించి మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడాలంటూ ఒకమ్మాయి సౌజ్ఞ చేసింది.

 ‘‘ ఏమి మాట్లాడాలి?’’ అని అడిగాను. ‘‘మీకు కన్నడ భాష వచ్చా స్వామీ!’’ అని అడిగారు. ‘‘దయచేసి ఆంగ్లభాషలో మాట్లాడండి’’ అని చెప్పాను. ‘‘స్వామీజీ! మేము కొబ్బరికాయ స్వామి ముందు పగుల కొట్టాము. కానీ, ఆ కాయ చెడిపోయి ఉన్నది...’’ అంటూ ఆగింది. ‘‘ఏమీ జరగదు. ధైర్యంగా వెళ్లండి. చింతించవద్దు’’ అన్నాను.
 
ఆ అమ్మాయిలు ధైర్యంగా వెళ్లిపోయారు. కానీ, అర్థగంటలోనే తిరిగి వచ్చారు. ‘‘స్వామీ! మీరు చెప్పినది మేము నమ్మలేదు. వేరొక కొబ్బరికాయ కొనుక్కొచ్చి దేవుని ముందు పగులకొట్టాము. కానీ, ఈసారి కూడా చెడిపోయినదే  వచ్చింది. మా స్నేహితురాలు ఇంకొక కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టింది. అదీ చెడిపోయింది. మా అందరికీ దిగులుగా ఉంది. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి?’’ అని అడిగింది, భయపడుతూ... అప్పుడు గానీ నేను సమస్య లోతు అర్థం చేసుకోలేకపోయాను.  గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

 త దహం భ క్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ॥

 అని భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరి స్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడు. ఆ అమ్మాయిలకు ఇలా చెప్పి, ఇక వారు హాయిగా ఇళ్లకు వెళ్లవచ్చని నచ్చ చెప్పాను. క్యాంపస్ సెలక్షన్‌లో వాళ్లకే మొదలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఆశీర్వదించి పంపించాను.

 భక్తులు వారి సందేహాలతో బూటకపు వ్యక్తుల దగ్గరకు వెళుతున్నారని, ఆ వ్యక్తులు అనవసర భయాలను రేపి డబ్బు చేసుకుంటున్నారని చెప్పాను. కొబ్బరికాయ చెడిపోయిందంటే దోషమనీ, దానికి పరిహారానికి ఇంత ఖర్చు చెయ్యాలంటూ డబ్బు లాగుతున్నారని చెప్పాను. ఇక్కడ నేను జ్యోతిష్కులని కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని కానీ తప్పుబట్టడం లేదు. ఆ శాస్త్రాన్ని ఉపయోగించి, ప్రజల్లో భయాన్ని రేకెత్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకొక భక్తుడు ఇలా అడిగాడు, ‘‘కొబ్బరికాయలో పువ్వు వస్తే?! దేనికి సంకేతం స్వామీ!’’ అని,

 ‘‘అతి ముఖ్యమైన సంఘటన నీ జీవితంలో తొందరలో జరగబోతున్నదని సంకేతం’’ అని చెప్పాను. వారు సంతోషంగా వెళ్లిపోయారు.ఇది వింటున్న ఒక అమ్మమ్మ తన అనుభవాన్ని ఇలా పంచుకున్నది. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం, ఇలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వారం లోపే మేము ఫ్లాట్ కొనుక్కున్నాము. మంచి, చెడు అంటూ ఏమీ లేదు స్వామీ. ఏ పరిస్థితిలోనైనా, ఆ భగవంతుడు మనతో ఉంటే ఏ ఇబ్బంది మనల్ని ఏమీ బాధించదు.’’ కాబట్టి, ఆ భగవంతుని పరిపూర్ణంగా నమ్మండి. జాతకాలను గానీ, జ్యోతిష్యులను కాదు.
 
 సౌందర్ రాజన్
 (చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు)

 

మరిన్ని వార్తలు