రాజుగారి చేప రుచులు

9 Sep, 2014 01:35 IST|Sakshi
రాజుగారి చేప రుచులు

అనగనగా ఓ రామరాజు. ఆయన చేపల వేటకైతే వెళ్లలేదు గానీ, చేపల వంటకాల్లో మాత్రం నలభీముల వారసుడే! ఆయన వండి వడ్డించే చేపలతో పాటు ఇతర వంటకాల రుచులకు ఎంతటెంతటి వారైనా దాసోహం కావాల్సిందే. రామరాజు వంటకాలను ఆరగించే వారిలో తొంభై శాతానికి పైగా వీఐపీలే ఉంటారంటే, ఆయన రేంజ్ ఏమిటో ఊహించవచ్చు.
 
 చేపలలోనే రాజా చేపగా ప్రసిద్ధి పొందిన పులస చేపతో వంటకాలు చేయడంలో రామరాజు నైపుణ్యం అనితరసాధ్యం. ఆయన వండే పులస వంటకాల గుబాళింపుల మాదిరిగానే ఆయన పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలకు విస్తరించాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, చిరంజీవి సహా పలువురు కేంద్ర నాయకులు, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, మోహన్‌బాబు వంటి వారు రామరాజుకు రెగ్యులర్ కస్టమర్లు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఇక్కడి స్టార్ హోటల్‌లో బసచేసినా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న రామరాజు వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ ఆరగిస్తారు. వీఐపీలే కాదు, నగరంలోని కొందరు రెస్టారెంట్ల యజమానులు సైతం రామరాజు వంటకాలను ప్రత్యేకంగా తెప్పించుకుని ఆరగించడం విశేషం.
 
 గోదావరి నుంచి..
 పశ్చిమగోదావరి భీమవరానికి చెందిన రామరాజు దాదాపు పాతికేళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఇరవెరైండేళ్లుగా తనకు నైపుణ్యంగల పాకకళనే ఉపాధిగా చేసుకున్నారు. ఇంట్లోనే ప్రత్యేకంగా వంటలు చేసి, ఆర్డర్లపై సరఫరా చేస్తుంటారు. తొలినాళ్లలో నగరంలోని బడా బడా పారిశ్రామికవేత్తలకు ఈ వంటకాలను సరఫరా చేశారు. వంటకాల రుచి అమోఘంగా ఉండటంతో అనతికాలంలోనే రామరాజు ప్రాచుర్యం పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే రాజకీయ నాయకులు, సెలిబ్రిటీలకు సైతం వంటకాలు సరఫరా చేయడం మొదలైంది. ప్రాచుర్యం పెరగడంతో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ రాసాగాయి. కొందరు సెలిబ్రిటీలు ఎక్కడ ఉన్నా రామరాజు వంటకాలను ఆర్డర్ చేయించుకుని తెప్పించుకుంటుంటారు.
 
రామరాజు వద్ద వారానికి రెండు మూడుసార్లయినా ఫిష్ పాంఫ్రెట్స్ తీసుకుంటుంటాను. మా ఆవిడకీ ఈ వంటకాలు చాలా ఇష్టం. నాలుగేళ్లుగా ఈ రుచులు ఆస్వాదిస్తున్నాను. రామరాజు వంట ఒకసారి అలవాటైతే వదులుకోవడం తేలికకాదు.
 -శ్రీను వైట్ల, సినీ దర్శకుడు
 

ఇవీ స్పెషాలిటీ వంటకాలు..
పులస చేప ఇగురు, పీతల వేపుడు, పప్పుచారు కోడిపలావు, నాటుకోడి-పీతలు-రొయ్యల మిక్స్‌డ్ పలావు వంటివి రామరాజు స్పెషాలిటీ వంటకాలు. వంటకాల్లో వెన్నపూస, గసగసాల ముద్ద, బజ్జీ మిర్చి, బెండకాయలు వంటివి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.
 
పదిహేనేళ్లుగా రామరాజు రుచులను ఆస్వాదిస్తూనే ఉన్నాను. నా ఆరోగ్యానికి రామరాజు వంటకాలు కూడా ఒక కారణమేననుకుంటాను. ఆరోగ్యకరంగా వంటకాలు వండటంలో రామరాజు సిద్ధహస్తుడు.
 - శ్రీనివాసరెడ్డి, సినీ దర్శకుడు
- శిరీష చల్లపల్లి

మరిన్ని వార్తలు