కళాత్మకం: గుండెలో కొలువైన గుస్సాడి...

14 Aug, 2013 00:27 IST|Sakshi
కళాత్మకం: గుండెలో కొలువైన గుస్సాడి...

అతను గిరిజనుడు కాదు, గిరిజన గ్రామానికి చెందినవాడు కాదు.   గురువు దగ్గర  నేర్చుకున్న గుస్సాడి నృత్యం కనుమరుగు కాకుండా ఉండేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రవి అనుకోకుండా నేర్చుకున్న గుస్సాడి నృత్యాన్ని  పలువురికి నేర్పిస్తూ, భావితరాలకు ఆ నృత్యంపై మక్కువ కలిగించేందుకు కృషి చేస్తున్నారు.
 
 ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తూనే, తన పాఠశాల విద్యార్థులతో పాటు, నృత్యంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.  ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం కర్ణమామిడి గ్రామానికి చెందిన జునగరి రవి గుస్సాడి నృత్యంలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ ఎన్నో అవార్డులు పొందారు.


 చిన్ననాటి నుండి పాశ్చాత్యనృత్యంపై రవికి ఆసక్తి ఎక్కువ. అయితే సౌత్‌జోన్ కాంపిటీషన్స్‌లో యూనివర్శిటీ తరపున ఆడే అవకాశం పొందేందుకు, తన గురువుగారు గిరి సలహా మేరకు గుస్సాడి నృత్యం చేసేందుకు సిద్ధమయ్యారు. అలా గుస్సాడిపై ఆసక్తి పెరిగింది. అది అభిమానంగా మారింది.
 
 గుస్సాడి నృత్యం, పులివేషధారణలతో పాటు రకరకాల జానపద నృత్యాలలో రాణిస్తున్న రవి ‘‘మనకు అద్భుతమైన జానపద కళలు ఉన్నాయి. ఈతరానికి వాటిని పరిచయం చేయాలనుకుంటున్నాను’’ అంటున్నారు.
 ఉత్సాహం ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి గుస్సాడి నేర్పించి ఆ నృత్యకళకు విస్తృతప్రచారం కలిగించడానికి తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తన  దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు రవి.
 
 2006లో హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో నిర్వహించిన జాతీయస్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని గుస్సాడి నృత్యంలో ప్రథమ స్థానం, పులివేషంలో తృతీయ స్థానం పొందారు. ట్రెడిషనల్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను బహుమతి పొందారు. గుస్సాడి నృత్యానికి చేసిన కృషికి గాను 2009లో ఒక స్వచ్ఛంద సంస్థ ‘గ్రామీణ కళాజ్యోతి అవార్డు’ను ఇచ్చింది.  


 ‘‘గుస్సాడి నృత్యం గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. దాని విశిష్టతను ఊరువాడా చాటాలి. ఈతరం పిల్లలు గుస్సాడి నృత్యం నేర్చుకునేలా చేయాలి అనేది నా లక్ష్యం’’ అంటున్నారు రవి.
 ఆయన లక్ష్యం త్వరగా సిద్ధించాలని ఆశిద్దాం.
 - బన్న ఉపేందర్, సాక్షి, మంచిర్యాల రూరల్

>
మరిన్ని వార్తలు