రైడ్ ఫర్ రైట్

6 Dec, 2014 23:02 IST|Sakshi
రైడ్ ఫర్ రైట్

ఏటా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు.. పదహారు రోజులను ‘16 Days of Activism against Gender Violence' ప్రచార దినాలుగా జరుపుతారు. అందుకే ప్రపంచ దేశాలకు ఈ 16 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. ‘ఆరెంజ్’ (నారింజ) కలర్‌ను ఈపచారానికి చిహ్నంగా కూడా స్థిరపరిచారు. మిగిలిన దేశాల్లో చాన్నాళ్ల కిందటే ఇది మొదలైనా మన దేశం ఈ ఏడాదే దీనికి నాంది పలికింది. హైదరాబాదూ అందులో భాగస్వామ్యం పంచుకుంది. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ కూడా వాదా ఫౌండేషన్, వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థలతో కలిసి ‘రైడ్ ఫర్ రైట్’ అనే పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టింది.
- సరస్వతి రమ
 
రైడ్ ఫర్ రైట్ అంటే.. జెండర్ ఈక్వాలిటీని చాటడమే! అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకూ అవకాశం కల్పించాలనేది రైడ్ ఫర్ రైట్ ఉద్దేశం. అందుకే మహిళా డ్రైవర్ తన ఆటోలో వాదా, వాయిస్ ఫర్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్స్‌ను కూర్చోబెట్టుకొని ప్రచారానికి వెళ్తోంది. ఆటోపై జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన పోస్టర్స్, బ్యానర్లూ ఉన్నాయి. జంటనగరాల్లోని కాలేజ్‌లు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లి యువత దగ్గర స్త్రీ, పురుష సమానత్వంపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఈ వాలంటీర్స్.

ఆటోలో ప్రయాణిస్తూ పక్కనే వెళ్తున్న పాదచారులనూ జెండర్ ఈక్వాలిటీ, మహిళల మీద హింసలేని స్థలాల గురించి, మహిళా సాధికారత సాధించిన రంగాల గురించి అడుగుతున్నారు.  వీడియో కెమెరాలతో వాటిని రికార్డ్ చేస్తున్నారు. పదో తారీఖు వరకు వీలైనన్ని ప్రదేశాలను చుట్టి తీసుకున్న వీడియో ఫుటేజ్‌ను కూర్పు చేస్తారు. త ర్వాత దాన్ని అమెరికన్ కాన్సులేట్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద చర్చకు పెట్టనుంది. ‘మహిళలపై హింస అనేది ఇప్పుడు ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు.

ఇది ప్రపంచ సమస్య. అందుకే దీని పరిష్కారానికీ ప్రపంచమంతా నడుంకట్టాలి. ఆ దిశగా మొదలైందే 16  డేస్ ఆఫ్ యాక్టివిజమ్ అగెనైస్ట్ జెండర్ బేస్డ్ వయోలెన్స్. అందులో భాగంగానే మేము ఈ ‘రైడ్ ఫర్ రైట్’ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశాం. దీనివల్ల మహిళల మీద జరుగుతున్న హింస, వివక్ష గురించి హైదరాబాద్ యూత్ ఎలా ఆలోచిస్తోందో తెలిసే అవకాశం కలుగుతోంది. ఈ సమస్యకు వాళ్ల దృష్టిలో కారణాలు, పరిష్కారాలకు వాళ్లిచ్చే సూచనలు, అభిప్రాయాలూ తెలుస్తున్నాయి. ఈ 16 రోజుల ప్రచారం ప్రపంచంలోని ప్రతి ఒక్కరు జెండర్ ఈక్వాలిటీ కోసం మనమేం చేయగలమనే ఆలోచనను రేకెత్తిస్తోంది’ అని వివరించారు అమెరికన్ కాన్సులేట్ స్పోక్స్‌పర్సన్ ఏప్రిల్ వెల్స్.
 
కొసమెరుపు..

అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో స్త్రీల మీద హింస, వివక్ష ఎక్కువ అంటారు. అణచివేత పోరాటాన్ని నేర్పుతుంది. పోరాటం విజయాన్ని తథ్యం చేస్తుంది. ఇందుకు నిదర్శనం మన దేశమే. మిగిలిన రంగాల సంగతలా ఉంచి వైమానిక రంగాన్ని తీసుకుంటే మన దగ్గర పదకొండు శాతం మంది మహిళా పైల ట్లు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. అక్కడ ఉంది మూడు శాతమే!.
 
అసలు హింస అనే పదమే వినిపించొద్దు..
ఈ రోజు ఇలా క్యాంపెయిన్ చేస్తున్నామంటే దానర్థం ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అనేగా. నా దృష్టిలో జెండర్ ఈక్వాలిటీ కోసం ఇలాంటి క్యాంపైన్‌లు లేని రోజు రావాలి. అంటే ఈ సమస్య అనేది లేకుండా పోవాలి. ఏడాదికొకసారి జరిగే ఈ పదహారు రోజులతో అంతా తుడిచిపెట్టుకుపోదు. అయితే దీన్నో ప్రారంభంగా భావించి ఈ స్పూర్తిని ఏడాదంతా ఏదో ఒకరకంగా కొనసాగించాలి.

యూత్ చాలామంది ఈక్వాలిటీ ఉండాలని ఆలోచించడం శుభపరిణామం. పాతికేళ్లలోపు కుర్రాళ్లంతా ఈక్వాలిటీకి ఓటేస్తున్నారు. నలభై, యాభైల్లో ఉన్న మగవాళ్లు ఆడవాళ్లు, మగవాళ్లు వేరనే అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. భవిష్యత్ అంతా యువతదే కాబట్టి భయపడాల్సిన పనిలేదు.     - సురేష్‌రాజు, వాదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
 
రైడ్ ఫర్ రైట్ డ్రైవర్
నారాయణమ్మ.. నిజాంపేట ప్రాంతంలో పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నారు. రోడ్ సేఫ్టీ మీద పనిచేసే వాదా ఫౌండేషన్ సహకారంతో మరో నలుగురు స్త్రీలకూ ఆటో నడపడంలో శిక్షణనిచ్చారు ఆమె. రోజూ ఉదయం 11 గంటల వరకు ఆటో నడిపి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైడ్ ఫర్ రైట్ క్యాంపెయిన్‌కి వెళ్తున్నారు. ‘ఆరెంజ్ కలర్ టీషర్ట్, ఆరెంజ్ కలర్ బ్యానర్స్‌తో ఆటోలో వెళ్తుంటే చాలామంది కుతూహలంగా చూస్తున్నారు. ఆ కుతూహలాన్ని రేకెత్తించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. చాలామంది ఆటో దగ్గరకి వచ్చి ‘ఏంటి లా వెళ్తున్నారు’ అని అడుగుతున్నారు. అప్పుడు విషయాన్ని చెప్తున్నాం. మహిళలపై హింస ఆగాలి, అందరూ సమానంగా ఉండాలి. మగవాళ్ల పని, ఆడవాళ్ల పని అని వేరుగా ఉండొద్దు అని స్పష్టంగా చెప్తున్నారు కూడా. వాళ్ల అభిప్రాయాలు వింటుంటే సంతోషంగా ఉంది’ అని మాట పంచుకుంది నారాయణమ్మ.
 
మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి.

కొంతమంది యువకులు ‘ఆడవాళ్లు అన్ని పనులూ చేయలేరు. వాళ్ల పరిమితులను దృష్టిలో పెట్టుకొని మెదిలితేనే బాగుంటుందన్న ఒపీనియన్‌ను వ్యక్తపరచారు. ఆశ్చర్యం వేసింది. అలాంటి వాళ్ల ఆలోచనల్లో మార్పు తేవడానికి ఇలాంటి క్యాంపెయిన్‌ల అవసరం చాలా ఉంది అనిపించింది. అమ్మాయిలకూ ఆత్మవిశ్వాసం కావాలి అని తెలుస్తోంది కొంతమంది అమ్మాయిల మాటలు వింటుంటే..
- శరణ్య, వాయిస్ ఫర్ గర్ల్స్

మరిన్ని వార్తలు