రూ. 100 కోట్ల 'మహా' సీరియల్!

16 Sep, 2013 16:33 IST|Sakshi
రూ. 100 కోట్ల 'మహా' సీరియల్!

బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ నేటి (సెప్టెంబర్ 16) రాత్రి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారతీయులు ఇతిహాసం మహాభారతం ఇప్పుడు ఆధునికత హంగులతో మరోసారి చిన్నితెరపై ప్రేక్షకులను అలరించనుంది. దూరదర్శన్లో రెండు దశాబ్దాల పాటు ప్రసారమయి, వీక్షకుల మన్నలందుకున్న మహాభారత్ సీరియల్ ఇప్పుడు స్టార్ ప్లస్లో సరికొత్తగా రానుంది. స్టార్ ఇండియా రూ. 100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. స్వస్తిక్ పతాకంపై సిద్ధార్థ కుమార్ తివారి దీన్ని నిర్మించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటల నుంచి అరగంటపాటు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. 128 ఎపిసోడ్లు  ప్రసారం చేయనున్నారు.

మనదేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన సీరియల్గా 'మహాభారత్' నిలిచింది. దీని నిర్మాణానికి రూ. వంద కోట్లు ఖర్చు చేయగా, మార్కెటింగ్ కోసం మరో రూ. 20 కోట్లు కేటాయించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సీరియల్ నిర్మించామని స్టార్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మదహుక్ వెల్లడించారు. యువ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాలన్న ఉద్దేశంతో గ్రాఫిక్స్ అధిక వ్యయం చేసినట్టు వివరించారు. నేటి యువత అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచామని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మానవ ప్రవర్తనకు సంబంధించిన వాస్తవాలను దీని ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు.

భారీ వ్యయంతో తెరకెక్కిన మహాభారత్ సీరియల్ను ప్రమోట్ చేసేందుకు స్టార్ ఇండియా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 నగరాల్లోని షాపింగ్స్ మాల్స్లో మహాభారత్ సీరియల్ మ్యూజియంలు పెట్టింది. సీరియల్లో వివిధ పాత్రధారులు వినియోగించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. అలాగే చిన్న పట్టణాలకు సంచార మ్యూజియంల ద్వారా ఈ సీరియల్ విశేషాలు చేరవేయనున్నారు. మహాభారత్ సీరియల్ పాత్రధారులు దేశవ్యాప్తంగా కాలేజీ క్యాంపస్లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

మరోవైపు సీరియల్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనలకు 10 సెకండ్లకు రూ. 2 లక్షల ధర నిర్ణయించారు. సీరియల్ ప్రారంభమైన తర్వాత ప్రకటనల రేట్లు మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ఢిల్లీకి పూజా శర్మ ద్రౌపదిగా పాత్రతో బుల్లి తెరకు పరిచయమవుతోంది. కృష్ణుడిగా సౌరభ్ జైన్, అర్జునుడుగా షహీర్ షేక్ నటించారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఆధునిక మహాభారత్ మెగా సీరియల్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు