రూపాయి వర్సెస్ డాలర్!

28 Jun, 2013 04:10 IST|Sakshi
రూపాయి వర్సెస్ డాలర్!

దేశంలో అన్ని వర్గాలనూ రూపాయి పతనం బెంబేలెత్తిస్తోంది. ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి క్షీణత సామాన్యుడిపై ఇది పెను ప్రభావం చూపుతోంది. రూపాయి పతనం కారణంగా ధరలు పెరిగే వస్తువుల జాబితాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌తోపాటు  పెయింట్స్, వాహనాలు, పురుగు మందులు, కాఫీ, చాకొలెట్లు, ప్లాటినం, బొగ్గు, ఐరన్, సోలార్ సెల్స్, సోలార్ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, స్టెంట్లు, ఇతర వైద్య పరికరాలు, బొమ్మలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ప్రింటింగ్ రంగులు ఉన్నాయి. బ్రాండెడ్ ఆభరణాలు, దుస్తులు, వాచీలు, కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్సులు, బూట్లు, యాక్సెసరీస్. విదేశీ మద్యం, పానీయాలు, సిగార్లు, సౌందర్య సాధనాలు రేట్లూ పెరుగుతాయి.

మేలో ఒక్క డాలర్ కోసం సుమారు 53 రూపాయలు ఇవ్వగా.. ప్రస్తుతం అదే డాలర్ కోసం 60 రూపాయలు పైగా ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఏటా 450 బిలియన్ డాలర్ల పైచిలుకు ఉండే భారత దిగుమతుల బిల్లూ మరింత పెరిగిపోతోంది. వంట నూనె మొదలు ప్రతి వస్తువూ ధర నింగినంటుతోంది. అసోచాం ఇటీవల  నిర్వహించిన సర్వే ప్రకారం గత నెలరోజుల్లో మధ్య తరగతి, కింది స్థాయి వర్గాల వారి ఖర్చుల బిల్లు 15-20 శాతం పెరిగిపోయాయి. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్స్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తుల తయారీ సంస్థలు అత్యధికంగా ముడివస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. లెనొవొ, హెచ్‌పీ, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌వంటి కంప్యూటర్ సంబంధిత ఉత్పత్తుల కంపెనీలు, మొబైల్  కంపెనీలు మొబైళ్ల ధరలను 5-10 శాతం వరకూ పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.  మరోవైపు, వివిధ కారణాల రీత్యా కార్ల కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి.

రూపాయి దెబ్బకు విదేశీ ప్రయాణాల వ్యయం కూడా పెరిగిపోతోంది. ఎయిర్‌టికెట్లకు, హోటల్స్ అద్దెకి, షాపింగ్‌కి మరింత వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు నెల రోజుల క్రితం దాకా 250 డాలర్ల అద్దె ఉన్న హోటల్ రూమ్‌కి రూపాయి మారకంలో రూ. 13,250 కడితే సరిపోయేదనుకుంటే.. ఇప్పుడు.. రూ. 15,000 కట్టాల్సి వస్తుంది. అంటే కేవలం రూపాయి పడిపోయినందు వల్ల ఏకంగా రూ. 1,750 తేడా వచ్చేస్తోంది.
 
రూపాయి పడటం వల్ల ప్రవాస భారతీయులకు మాత్రం కొంత ఊరట లభించనుంది. డాలర్లలో ఆదాయం ఆర్జిస్తూ ఇక్కడి  తమ కుటుంబాల వారికి పంపే ప్రవాస భారతీయులకు మరిన్ని ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అలాగే, ఎన్నారై డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడమూ వారికి ప్రయోజనం కల్పించనుంది. స్టాక్‌మార్కెట్ల లాభాల ఊతంతో గురువారం రూపాయి మారకం గణనీయంగా పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 53 పైసలు బలపడి 60.19 వద్ద ముగిసింది. రూపాయి ఈ స్థాయిలో బలపడటం పక్షం రోజుల్లో ఇదే మొదటిసారి. మార్చ్‌తో ముగిసిన త్రైమాసికంలో కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) ఊహించిన దానికన్నా తక్కువగానే ఉండటంతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కూడా రూపాయి రికవరీకి దోహదపడింది. ఫారెక్స్ మార్కెట్లో 60.45 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ త ర్వాత 60.63 స్థాయి కనిష్టానికి తగ్గినా... క్యూ4 క్యాడ్ గణాంకాల వెల్లడితో రూపాయి ర్యాలీ చేసింది. ఒక దశలో 60.10కి కూడా ఎగిసి చివరికి 0.87 శాతం లాభంతో 60.19 వద్ద ముగిసింది. జూన్ 12 (60 పైసలు) నాటి ర్యాలీ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. నెలాఖరు సమయంలో డాలర్లకు డిమాండ్ ఎగియడంతో బుధవారం రూపాయి రికార్డు స్థాయిలో 106 పైసల మేర (1.78%) క్షీణించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు