రమణుల రంగస్థలం

22 Jan, 2015 23:10 IST|Sakshi
రమణుల రంగస్థలం

సరసిజ.. ఎ థియేటర్ ఫర్ విమెన్! తెలుగులో మొట్టమొదటి మహిళా రంగస్థలం.. 23న అభినయానికి సిద్ధం కానుంది! వ్యవస్థాపకులు.. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె పరిచయం.. ఈ ప్రయత్నం వెనక కారణమూ ఆమె మాటల్లో..
- సరస్వతి రమ

 
నాటకంపై ఉన్న ఇష్టమే సరసిజ ఏర్పాటుకు కారణం. ఒకప్పుడు రంగస్థలం చాలా ప్రభావంతమైన మాధ్యమం. అలాంటి నాటకం ఇప్పుడు ఆనవాలుగానే మిగిలింది. మునపటి వెలుగు రావాలంటే కొత్త తరాన్ని ఆకర్షించాలి. ఇది వరకు నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేసేవారు. సురభి వచ్చాక స్త్రీలూ రంగప్రవేశం చేశారు. కానీ, ఆ ముచ్చట ఇప్పుడు లేదు. సెంట్రల్  యూనివర్సిటీ వంటి చోట్ల థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ఉన్నారు. కానీ వాళ్ల ఫోకస్ అంతా హిందీ, ఇంగ్లిష్ నాటకాలపైనే. తెలుగు రంగస్థలంపై యువతుల అభినయం వికసించాలి. వాళ్లను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ఈ థియేటర్ ఫర్ విమెన్‌ను స్థాపించాను. నాటకంపై ఆసక్తి ఉన్నవాళ్లంతా ఆహ్వానితులే. సరసిజ.. అచ్చంగా మహిళల కోసం.. మహిళలచే.. మహిళలే భాగస్వాములుగా నడిచే థియేటర్!.
 
ఆసక్తి ఎలా కలిగింది..
మా నాన్నకు నాటకాలంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆయన అబ్బూరి రామకృష్ణారావుతో కలసి తెనాలిలో ‘నటాళి’ అనే నాటక సంస్థను పెట్టారు. నాన్నతో కలసి నాటకాలకు వెళ్లేదాన్ని. బాలానందంలో పాల్గొనేదాన్ని కూడా. 1974లో అనుకుంటా.. విజయనగర్ కాలనీలో లలితకళాసమితి వేస్తున్న నాటికలో స్త్రీ పాత్రలున్నాయి.. ఆసక్తి ఉన్న కళాకారులు కావాలనే ప్రకటన చూసి నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లింది. ఇద్దరం సెలక్టయ్యాం. అలా ‘ప్రేమానుబంధం’ అనే నాటికలో మొదటిసారి వేషం వేశా. ఆ టైమ్‌లోనే రాసిన ‘కళ్యాణి పెళ్లి’ ద్వారా నాటక రచన ప్రస్థానమూ మొదలైంది. 1996లో గంట నిడివి ఉన్న ‘జీవన సమరం’ రాశాను. అది రేడియోలో ప్రసారమైంది.

2000లో ఒక స్టేజ్ నాటకం రాసే అవకాశం వచ్చింది. ఓ రోజు ‘ఇన్వైటెడ్ ఆడియెన్స్ ప్రొగ్రెసివ్’ అనే సంస్థ వాళ్లు ‘ఓ కామెడీ ప్లే కావాలి రాస్తారా ?’అని అడిగారు. అప్పటి వరకూ సీరియస్ ప్లేలు రాస్తున్న నాకు ఇది ఓ రకంగా టాస్కే. పెళ్లి కుదరడం అనే అంశాన్ని తీసుకుని ఆ రాత్రికిరాత్రే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే ప్లే రాసి తెల్లారేసరికల్లా వాళ్లకు ఇచ్చేశాను. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆ నాటకానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ ప్లే రైట్స్ తీసుకుని తన కితకితలు సినిమాలో వాడారు.

ఇప్పటికీ చాలా వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. మా అమ్మాయి రాజేశ్వరి సహా ఇంకా చాలామంది ఈ నాటకాన్ని అమెరికాలాంటి దేశాల్లో ప్రదర్శించారు. ‘ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు’ అనే విశాలాంధ్ర వారి సంకలనంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి, విశ్వనాథ సత్యనారాయణలాంటి ప్రముఖుల సరసన నాకూ స్థానం కల్పించారు. ఈ గౌరవాన్ని మించిన పురస్కారం నాకు లేదు, ఉండదు కూడా.
 
అసలు రచనకు స్ఫూర్తి?
మా నాన్న   జర్నలిస్ట్, రైటర్ కూడా. ఇంటి నిండా పుస్తకాలుండేవి. అమ్మ (అనసూయ)కూ పఠానాసక్తి ఎక్కువే. అదే అలవాటు నాకూ వచ్చింది. దీంతో రాయాలనే ఆసక్తి కలిగింది. అదే మాట నాన్నతో చెబితే.. ‘ముందు చందమామ కథలు రాయమ’న్నారు. రెండుమూడు రాశాను. అంతబాగా లేవు. రేడియో అన్నయ్య రావూరి భరద్వాజ గారు నాన్నకు చాలా క్లోజ్. ‘ఆయన దగ్గరకు వెళ్లు.. పిల్లల కోసం కథలు ఎలా రాయాలో నేర్పిస్తారు’ అని సలహా ఇచ్చారు నాన్న. రావూరి గారిని కలిస్తే.. ‘యువవాణి’లో నాచేత ఓ స్కిట్ రాయించారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన రోజులవి. దాన్ని కాన్సెప్ట్‌గా తీసుకుని ‘చందమామ’ అని రాశాను. అందరూ మెచ్చుకున్నారు. అప్పటి నుంచి రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకున్నాను.
 
రేడియోతో ఆగక..
పెళ్లాయ్యాక రెండుమూడేళ్లు గ్యాప్ వచ్చినా రచన ఆగిపోలేదు. ఇదంతా ఎనభైల విషయం. అప్పుడు ‘యువవాణి’లో స్త్రీల కార్యక్రమాలను తురగ జానకీరాణి గారు చూసేవారు. నా మొదటి రేడియో కథ ‘వర్ధమాన రచయిత్రి’. ఆవిడకది చాలా నచ్చింది. ‘రేడియోతో ఆగకుండా.. పత్రికలకూ నీ రచనలు పంపు’ అని చాలా ఎంకరేజ్ చేశారు. అలా పత్రికలకూ పంపడం మొదలుపెట్టాను. మయూరి అనే మ్యాగజైన్‌లో ‘కలలుకన్న రాధ’ అనే కథ మొదటిసారిగా అచ్చయింది. తర్వాత ఆంధ్రభూమి, ప్రజాశక్తి మొదలు ఎన్నో పత్రికలు, విపుల లాంటి మాసపత్రికలకూ కథలు పంపుతూ వచ్చాను. ఇప్పటి వరకు పంపిన ఏ కథా అచ్చుకాకుండా తిరిగి రాలేదు. ‘తోటమాలి’ బాగా పేరు తెచ్చిన కథ. ‘అపూర్వ’నా తొలి కథా సంకలనం. అపురూప, అలనాటి చెలిమి ఒక కల, ఒప్పందం లాంటి సంకలనాలు, సంపుటాలు వెలువడ్డాయి. నవలలూ రాశాను. అన్నిటిలో మహిళా సమస్యలే ఇతివృత్తాలు.
 
సరసిజ ఆశయం..
‘ఈ విమెన్ థియేటర్ ద్వారా స్త్రీ గళాన్ని వినిపిస్తాం. మన దగ్గర ఇంకా నిరక్షరాస్యత ఉంది. మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. వీటి నిర్మూలనకు ఈ థియేటర్‌ను వేదిక చేయాలనుకుంటున్నాం. బతికే కళను పరిచయం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో దీన్ని ఓ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చే ఆలోచనా ఉంది. వి.ధనలక్ష్మి ఉపాధ్యక్షురాలిగా, సాయి మాధురి కార్యదర్శిగా, జె.భానుమతి కోశాధికారిగా సాగబోతున్న మా విమెన్ థియేటర్‌కి, దాని లక్ష్యసాధనకు ఇతర రచయిత్రులూ సహకరిస్తారని ఆశిస్తున్నా’నని వివరించారు విజయలక్ష్మి.

మరిన్ని వార్తలు