పొంతనలేని నల్లధనం లెక్కలు!

29 Oct, 2014 19:29 IST|Sakshi
పొంతనలేని నల్లధనం లెక్కలు!

దేశం నుంచి తరలిపోయిన నల్లధనం లెక్కలకు పొంతన లేదు.  ఇంత వరకు ఎవరూ ఇంత సొమ్ము విదేశీ బ్యాంకులలో దాచుకున్నారని స్పష్టంగా చెప్పిన పాపాన పోలేదు. ఎవరి లెక్కలు వారివే.  ఏ రెండు లెక్కలూ ఒక్కలాగా ఉండటంలేదు. ఇంతకీ ఎంత డబ్బు భారతీయులు విదేశాలకు తరలించి ఉంటారు?  సుప్రీం కోర్టు చొరవతో ప్రస్తుతానికి 627  పేర్లు సమర్పించారు. ఈ అంశంలో దీనిని ఓ పెద్ద ముందడుగుగా భావించవచ్చు.   నల్లధనానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నో శ్వేత పత్రాలు,  నివేదికలు వెల్లడించింది. కాని  ఏ రెండు లెక్కలు ఒక్కటిగా లేవు. బీజేపీ అగ్రనేత,  ఎన్డీఏ హయాంలో  ఉప ప్రధానిగా పనిచేసిన లాల్‌కృష్ణ  లెక్కల ప్రకారం  విదేశాల్లో దాచుకున్న డబ్బు విలువ 28 లక్షల కోట్ల రూపాయలు. అంటే 466 బిలియన్‌ డాలర్లు.  2011లో ఆయన ఈ లెక్కలు వెల్లడించారు.  వాషింగ్టన్‌కు చెందిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ  సంస్థ అధ్యయనం ఆధారంగా తాను ఈ లెక్కలు చెప్పినట్టు అద్వానీ తెలిపారు. అంతే కాదు 782 మంది భారతీయులకు విదేశీ బ్యాంకు ఖాతాలున్నాయని అన్నారు.

2011లోనే నల్లధనం విలువ 500 బిలియన్‌ డాలర్లు నుంచి 1.4 ట్రిలియన్‌ డాలర్ల మేరకుంటుందని బీజేపీ అంచనా వేసింది. 2012లో భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన శ్వేత పత్రంలో  స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము విలువ 2.1 బిలియన్‌ డాలర్లు ఉంటుందని తెలిపింది.   466 బిలియన్‌ డాలర్లు ఎక్కడ,  2.1 బిలియన్‌ డాలర్లు ఎక్కడ?.  పొంతనేలేదు. స్విస్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ 2006 నివేదికలో  భారతీయులు  స్విస్‌ బ్యాంకుల్లో  దాచుకున్న సొమ్ము విలువ 1.46 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని తెలిపింది. అయితే ఈ నివేదికను స్విస్‌ ప్రభుత్వం కొట్టిపారేసింది. తాము అలాంటి నివేదికేదీ రూపొందించలేదని  స్విస్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ ఆ తర్వాత ప్రకటించింది.  

నల్లధనం వెలికితీసేందుకు  ఈ ఏడాది మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌  ఇంటిగ్రిటీ సంస్థ అభినందించింది. నల్లధనం భారత్‌కు పెద్ద సమస్యని అభివర్ణించింది.  అంతే కాదు 2002 నుంచి 2011 మధ్య కాలంలో 343.9 బిలియన్‌ డాలర్లు  భారత్‌ నుంచి తరలిపోయాయని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ సంస్థ అంచనా వేసింది.  అక్రమంగా డబ్బు తరలింపులో భారత్‌ది ఐదో స్థానమని తెలిపింది.  అదే సమయంలో జీడిపీ లెక్కల ప్రకారం అతి పేద పది దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తు చేసింది.
**

>
మరిన్ని వార్తలు