సీన్ షితారే..

7 Mar, 2015 23:32 IST|Sakshi
సీన్ షితారే..

‘నేను ఈల వేస్తే గోలుకొండ అదిరి పడతది’ అంటూ సిటీలో ఏ బ స్‌స్టాప్‌లోనో.. వీధి మలుపు దగ్గరో.. అమ్మాయిలను ఆటపట్టించారా.. తస్మాత్ జాగ్రత్త! ఆడపిల్లలను ఫాలో అవ్వడం.. దారి కాచి బీటు వేయడం ఇక కుదరని పని. కాలేజీ గేట్ ముందు.. బస్‌స్టాప్‌లలో.. రద్దీ ప్రాంతాల్లో.. మఫ్టీల్లో మహిళా పోలీసులు ఉంటారు.‘ఫిగర్ కత్తిలా ఉంది’ అని కామెంట్ చేశారా.. సీన్ షితారే. ఈ ఆకతాయి పనులను చూసి ఎవరైనా ‘షీ టీమ్’కు రింగిస్తే చాలు.. మీ తాట తీస్తుంది!
 భువనేశ్వరి
 

 షీ టీమ్.. ప్రస్తుతం నగరంలో యువతులకు రక్ష క కవచం. గతేడాది అక్టోబర్ 24న ఈ మహిళాదళం పరిచయమైంది. అమ్మాయిలపై పెరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ టీమ్ ఆపరేషన్లు ఆకతాయి యువకుల్లో దడ పుట్టిస్తున్నాయి. అబ్బాయిల నడవడిలో మార్పు తెచ్చేందుకు వీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ఇది సింగిల్ టీమ్ కాదు. వంద బృందాలున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు పోలీసులు. అందులో ఒక మహిళా పోలీస్ తప్పనిసరిగా ఉంటారు. దాదాపు 500 మంది పోలీసులు మఫ్టీలో మనల్ని ఒక కంట కనిపెడుతుంటారన్నమాట.
 
 పరుగో పరుగు...
 గత నాలుగు నెలల్లో ‘షీ టీమ్’లు 135 మంది ఈవ్‌టీజర్లను అరెస్ట్ చేశాయి. వీరిలో కాలేజీ కుర్రాళ్లు.. ఉద్యోగస్తులు.. మేజర్లు.. మైనర్లు.. అందరూ ఉన్నారు. ఈవ్‌టీజింగ్ జరుగుతున్న స్పాట్ వీళ్లకు ఎలా తెలుస్తుందంటారా..? కాలేజీ గోడలపైన, బస్‌స్టాప్ పరిసరాలల్లో ‘ఒక్క ఫోన్ కాల్ చాలు ఆకతాయి నోటికి తాళం వేయడానికి, చేతికి సంకెళ్లు వేయడానికి’ అంటూ కనిపించే ‘షీ టీమ్’ ప్రకటనే దీనికి కారణం. ఇదే అమ్మాయిలకు భరోసా కల్పించింది.
 
 ఈ పనిలో యమ బిజీగా ఉన్న మన అడిషనల్ సీపీ క్రైమ్ స్వాతి లక్రాని పలకరిస్తే.. ‘‘షీ టీమ్’ పేరు చెబితే ఈవ్‌టీజర్లు పారిపోతున్నారు. ఈ విషయంలో అవగాహన తేవడంలో మా టీమ్ విజయం సాధించిందని గర్వంగా చెప్పగలను. అయితే మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే సోషల్ నెట్‌వర్క్ సాయం కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారామె.
 
 ఫేస్‌‘బుక్’ సాయంతో...
 ఈవ్‌టీజింగ్ కేసుల్లో అరెస్టయిన వారిలో చాలావరకూ మైనర్లే ఉంటున్నారు. వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ‘షీ టీమ్’ వినూత్నమైన పనిష్మెంట్లు ఇస్తోంది. ‘అమ్మాయిలను ఏడిపిస్తూ పట్టుబడిన మైనర్లను కొట్టలేం. అందుకే వారిని వెరైటీగా పనిష్ చేస్తున్నాం. వారి వారి ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో రోజుకు కొన్ని వందలసార్లు.. యాంటీ ఈవ్‌టీజింగ్ కొటేషన్లు అప్‌లోడ్ చేయిస్తున్నాం. వాళ్లు పోస్ట్ చేస్తున్నారా లేదా అని మా వాళ్లు ఫాలోఅప్ చేస్తారు.
 
 
  మైనర్ నేరస్తులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు వారానికి, పదిరోజులకి ఇన్నిసార్లని వారి దగ్గర అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాం’ అని చెప్పారు స్వాతి లక్రా. ‘షీ టీమ్’ దృష్టిలో పడనంత వరకే ఈవ్‌టీజర్ల ఆటలు. ఆ తర్వాత సీనంతా చాలా సీరియస్‌గా ఉంటుంది. వారు మారడంతో పాటు వారిలాంటివారిని మార్చే పనిచేయకపోతే ‘షీ టీమ్’ బెత్తం రుచి చూపిస్తుంది.
 
 వంద డయల్ చేస్తే...
 ‘అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా సరే మీ దృష్టికి వచ్చిన సంఘటనల గురించి ‘100’ నెంబర్‌కి ఫోన్ చేసి చెబితే చాలు. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన అవసరం ఉంటే వీలైనంత త్వరగా మా టీమ్ అక్కడికి చేరుకుంటుంది. నగరంలో ముఖ్యమైన సెంటర్లలో మా టీమ్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం’ అని  తెలిపారు స్వాతి లక్రా. మహిళా రక్షణ కోసం విడుదల చేసిన hawk eye మొబైల్ అప్లికేషన్,  sheteamhyderabad అనే ఫేస్‌బుక్ అకౌంట్, hydsheteam@gmail.com ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా కూడా ‘షీ టీమ్’ ఈవ్‌టీజర్లను వేటాడుతోంది. మైనర్లను మార్చడం, మేజర్లను శిక్షించడంతో సరిపెట్టుకోవడం లేదు. అమ్మాయిలకు కూడా కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో ధైర్యం నింపుతోంది.
 
 మేమున్నాం...
 రెండు నెలలుగా కొందరు అబ్బాయిలు షీ టీమ్‌ని కలిసి వారి ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళుతున్నారు. విషయం ఏంటంటే.. వారుంటున్న ప్రదేశాల్లో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా షీటీమ్ తర ఫున తాము ముందుకొచ్చి సాయపడతామని చెబుతున్నారు. ‘మహిళల రక్షణ కేవలం పోలీసులది మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిది. అందరి బాధ్యత అని తెలిసిన రోజున మాతో పని ఉండదు’ అని అంటున్నారు స్వాతి లక్రా. అలాగే అమ్మాయిని ఏడిపిస్తే మజా వస్తుందనుకునేవారికి మన ‘షీ టీమ్’ చేతిలో సీన్ సితారే అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి.  
 

మరిన్ని వార్తలు