గులాబి.. బతుకునిచ్చిన భాగ్యనగరం

5 Aug, 2014 04:04 IST|Sakshi
గులాబి.. బతుకునిచ్చిన భాగ్యనగరం

సంగీతం నేర్చిన కోయిల గొంతెత్తితే ఎలా ఉంటుంది.. అంతే అందంగా ఉంటుంది సునీత పాట. ఏ వేళలో విన్నా.. ఆమె గానం అమృతం కురిపిస్తుంది. ఆమెను.. ఆశల వారధిగా ఆహ్వానించిన హైదరాబాద్, ఆశయాల సాధన దిశగా ముందుకు నడిపింది. సప్తస్వరాలకు వేదికగా నిలిచి కీర్తిని ఎల్లలు దాటించింది. అందుకే హైదరాబాద్  అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఎప్పుడు చూసినా ఈ నగరం తనకు అప్పుడే అరవిరిసిన గులాబీలా కనిపిస్తుందంటున్నారు సునీత. నగరంతో తన అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.

సిటీ నాకు గుర్తింపునిచ్చింది. సింగర్‌గా ఎదిగేలా చేసింది. యాంకర్‌గా నిలబడే వీలు కల్పించింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడేలా చేసింది. అందుకే హైదరాబాద్ నాకు ఇష్టం. కాకపోతే గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే కుటుంబ సహకారం తప్పకుండా ఉండాలి. ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ భాగస్వాములవ్వడం చాలా అనందంగా అన్పిస్తుంది.
 
నిండుగా చీర.. సిగలో పూలు.. పాదాలకు పసుపు.. చేతికి తోరణం.. శ్రావణ గౌరికి పూజ చేస్తున్న ప్రతిసారీ అమ్మ నన్ను ఎంత మురిపెంగా చూస్తుందో..! ‘ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత సంప్రదాయంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలే’ అనే ఆ మాటలు మనసును హత్తుకుంటాయి. ఫాస్ట్ కల్చర్‌లో మా ఊరు గుర్తొస్తుంది. నగరంతో బంధమూ పెరుగుతుంది.
 
సంగీత భారతి
‘ఒక్కసారైనా రవీంద్రభారతిలో ప్రోగ్రాం ఇవ్వాలి’ సిటీకి రాకముందు అది నా లక్ష్యం. అమ్మ సంగీతం టీచర్. నాన్న బిజినెస్‌మెన్. నా మీద అమ్మ ప్రభావం ఎక్కువ. నాక్కూడా సంగీతం అంటే ప్రాణం. దానికి తగ్గట్టే మంచి స్వరం ఉందని అమ్మ బాగా ప్రోత్సహించేది. ఆకాశవాణి కార్యక్రమాలు, పాటల పోటీల్లో వెళ్లేందుకు అమ్మ సాయం చేసేది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో.. అనుకున్నట్టే రవీంద్రభారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, నా కల నెరవేర్చుకున్నాను.
 
అతిథిగా వచ్చాను..
నాకు పాటంటే ప్రాణం. ఆ పాటే నాకు సిటీకి ముడివేసింది. ఇంటర్ వరకూ గుంటూరులోనే చదువుకున్నాను. చుట్టం చూపుగా తార్నాకలోని మావయ్య ఇంటికి వచ్చాను. అనుకోకుండా ఓ చానల్‌లో పాట పాడే అవకాశం వచ్చింది. తర్వాత ఒకదాని వెంట మరొకటి. కొన్ని రోజుల్లోనే చిక్కడపల్లిలో అద్దెంటికి మారాను. సింగర్‌గా స్థిరపడే ధైర్యం రావడంతో అమ్మా, నాన్న కూడా ఇక్కడే షిఫ్ట్ అయ్యారు. చాలా కాలం చిక్కడపల్లిలోనే ఉన్నాం. తర్వాత యూసుఫ్‌గూడకు, అక్కడి నుంచి మాదాపూర్‌కు మారాం. ఇప్పుడు ల్యాంకో హిల్స్‌లో ఉంటున్నాం.
 
చిక్కడపల్లి చౌరస్తా భలే..
చిక్కడపల్లి చౌరస్తా అంటే భలే ఇష్టం. రోజూ సాయంత్రం చౌరస్తాకు వెళ్లి కూరగాయలు తెచ్చేదాన్ని. అక్కడ విరజాజులు, మల్లెలు రాశులుగా పోసి అమ్మేవాళ్లు. అవి చూస్తుంటే మనసు పులకించేది. అక్కడందరూ మధ్యతరగతి వాళ్లే. మనసు విప్పి మాట్లాడేవాళ్లే..! ఆ పక్కనే ఉన్న త్యాగరాయ గానసభలో జరిగే ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్లేదాన్ని.
 
ఆ టైంలో సిటీ చూడాలి
మొదటిసారి గులాబీ సినిమాకు పాట పాడే చాన్స్ వచ్చింది. రామానాయుడు స్టూడియోలో రికార్డింగ్. ఆటో అతను ఆ కొండల మీదకు ఎవరొస్తారు అంటూ చాలా దూరంలో దించేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాను. ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోలేను. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ నా మొదటి పాట. ఇది పాడిన తర్వాత సిటీ మీద ఆసక్తి మరీ పెరిగింది. అర్ధరాత్రి ఒక్కసారి చార్మినార్ ఎక్కి సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుని వెళ్లాను. కానీ పోలీసులు ఆ చాన్స్ ఇవ్వలేదు. నిశిరాత్రిలో సిటీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో.. ఒక్కసారైనా చూడాలి.
 
ముగ్గు తొక్కితే అంతే
మాదాపూర్ అంటే బాగా ఇష్టం. సంక్రాంతి పండుగొస్తే రోడ్డుపై మొత్తం ముగ్గులు పరిచే సి పట్నానికి పల్లెను పార్శిల్ చేసేవాళ్లం. అందులో నేనే ఫస్ట్. అపార్ట్‌మెంట్‌లోకి ఏ కారును అనుమతించే వాళ్లం కాదు. ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లం. కొందరి కారు తాళాలు లాక్కునే వాళ్లం. అందమైన ముగ్గులు, మా సందడి చూసి సర్దుకుపోయేవారు.
 
 ఆ భావం తప్పు
సునీత రిజర్వుడ్‌గా ఉంటుంది. కాస్త గర్వం ఎక్కువ? అప్పుడప్పుడు విన్పించే కామెంట్స్ ఇవి. ఇందులో నిజం లేదు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. అందుకే సోషల్‌గా మూవ్ అవ్వడం అంటే ఏంటో పూర్తిగా తెలిసుండకపోవచ్చు. అవకాశాల కోసం పరిధులు దాటడం తెలియకపోవచ్చు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఏదైనా ప్రాప్తం ఉంటేనే దక్కుతుందని నమ్ముతాను. కాకపోతే మనసు విప్పి మాట్లాడే వాళ్లతో నేనెప్పుడు నిష్కల్మషంగానే మాట్లాడతాను. ఇదే నాకు సిటీ నేర్పిన సోషలిజం.
 - వనం దుర్గాప్రసాద్

మరిన్ని వార్తలు