సామాజిక చిత్రం

1 Mar, 2015 00:20 IST|Sakshi
సామాజిక చిత్రం

గోద్రా రైలు దుర్ఘటన జరిగి పదమూడేళ్లు. కానీ నాటి గాయాలు నేటికీ మానలేదు. ఇలాంటి సంఘటనలకు మూలం మత విద్వేషాలు. ఈ క్రమంలో మతసామరస్యంపై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం ప్రారంభమైన ‘కమ్యూనల్ హార్మోనీ ఫిల్మ్ ఫెస్టివల్’.
 
విబ్జియార్ సహకారంతో విమోచన్, లామకాన్‌లు... గుజరాత్‌లోని గోద్రా అల్లర్లపై శుబ్రదీప్ చౌదరికి ట్రిబ్యూన్‌గా ఈ రెండు రోజుల ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ... మత విద్వేషాలకు కారణం కుల వ్యవస్థని, ఐదు వేల ఏళ్లుగా దళితులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. దేశంలో నిమ్నకులస్థులు, ఆదివాసీలపై చిత్రాలు తీయాలన్నారు. తొలిరోజు ‘గోద్రా తక్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ డాక్యుమెంటరీ చిత్రాలు ప్రదర్శించారు.
 
గోద్రా రైల్వే స్టేషన్‌లో రైలు ఆగడం... క్షణాల్లో చెలరేగిన మంటలు... ఆ చిచ్చుకు శవాలుగా మారిన అమాయకులు... దేశాన్ని అట్టుడికించిన ఈ సంఘటన వాస్తవ రూపాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తేవాలన్న ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఈ పరిశోధనాత్మక డాక్యుమెంటరీ రూపొందించారు శుబ్రదీప్. ఈయన బ్రెయిన్ హ్యామరేజ్‌తో మరణించారు.
 
ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్...
అయోధ్య రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాల క్రమంలో రేగిన చిచ్చు, అల్లర్లపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. ఆనంద్ పట్వర్దన్ తీసిన ఈ డాక్యుమెంటరీ... అప్పటి రాజకీయ, సామాజిక, కులమత విద్వేషాలను కళ్లకు కట్టింది. ఈ ఆందోళనల వల్ల అగ్రకులాల వారు, రాజకీయ నాయకులు తప్ప మిగిలిన వారంతా నష్టపోతారని ఓ రైతు ముందే చెప్పడం గమనిస్తే... ఇందులో కుట్ర ఉందని అర్థం చేసుకున్నట్టేనన్నది దర్శకుడి అభిప్రాయం.

మరిన్ని వార్తలు