‘స్పిరిట్ ఆఫ్ డ్యాన్స్

2 Feb, 2015 23:30 IST|Sakshi

ప్రతీక్ష కాశీ.. తల్లినుంచి నాట్యకళను వారసత్వంగా అందిపుచ్చుకుంది. డ్యాన్స్ మీద పాషన్‌తో  సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేసింది. నాలుగు నృత్యరీతులను కలిపి ‘స్పిరిట్ ఇండియా’ పేరుతో మాదాపూర్‌లో ఓ నృత్య ప్రద ర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా సిటీప్లస్ ఆమెను పలకరించింది...
 ..:: కోన సుధాకర్‌రెడ్డి
 
అమ్మ వైజయంతి కాశీ.. కూచిపూడి నృత్యకారిణి. చిన్నప్పుడు అమ్మ డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లేదాన్ని. ఓసారి ఆమె ప్రదర్శన ఇస్తున్నప్పుడు... ఆడియన్స్‌లో ఉన్న నేను నేరుగా స్టేజిపైకి వెళ్లి వచ్చీరానీ డ్యాన్స్ చేశాను. ఒక్కటే చప్పట్లు. కేరింతలు. అలా నా డ్యాన్స్ జీవితం నాకు తెలియని వయస్సులోనే ప్రారంభమైంది. అయితే ఒక్క కూచిపూడికే పరిమితం కాకుండా ఒడిస్సీ, కథక్‌తోపాటు కర్ణాటక సంగీతం కూడా నేర్చకున్నాను. తల్లి, గురువు ఒక్కరే అయితే వాళ్లంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరూ ఉండరు. మా అమ్మ నన్ను బిడ్డలానే కాదు, శిష్యురాలిగా కూడా చూస్తుంది. నేను ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా పక్కన అమ్మ ఉండాల్సిందే. నృత్యం మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది. గురు-శిష్య పరంపర కోసం కర్ణాటకలో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘శాంబవీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ రెసిడెన్సియల్ స్కూల్’ ప్రారంభించాం. అమ్మ, నేను నడుపుతున్నాం.
 
స్పిరిట్ ఆఫ్ ఇండియా..

కూచిపూడి, మోహినీఆట్టం, యక్షగానం, కథక్... ఈ నాలుగు నృత్యాల కలయికే స్పిరిట్ ఆఫ్ ఇండియా. భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అంశాలను నృత్యరూపంగా తీసుకొచ్చాం. అందులో కూచిపూడిదే ప్రధాన పాత్ర . ఇందులో రిథమ్స్-మెలోడిస్ (సంగీతం) ముఖ్యమైన వి. ‘శ్రీమహా గణపతి మనసా స్మరామి’, ‘కళాంగ మర్దన’, ‘తివక్ర స్టోరీ’, ‘కేశవ ప్రతిగచ్ఛతీ’ అనే నాలుగు మహాఘట్టాలు ఇందులో ఉంటాయి. ఎవరైనా మనస్సు పెట్టి వీటిని తిలకిస్తే గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
 
కళ ఒక ఆయుధం...

సమాజాన్ని జాగృతం చేసే ఏకైక సాధనం కళ. నలుగురిలో ఉండవచ్చు. ఒకే క్షణంలో నాలుగొందల మందికి ‘ఆనందం’ పంచవచ్చు. అందుకే ఇటువైపు అడుగుపెట్టిన నేను వెనుతిరిగి చూడలేదు. ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే థియరిటికల్ ఎలిమెంట్స్‌పైనే మా నృత్యప్రదర్శనలు ఉంటాయి. నా ప్రజెంటేషన్‌లో ఓ క్రియేటివిటీ ఉండితీరుతుంది. నృత్యం ఓ మహోత్తరమైన విల్‌పవర్ ఇస్తుంది. హయగ్రీవుడు చదువునిస్తాడు. సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది. నటరాజు సువిశాల సమాజాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఒక సంప్రదాయ నృత్యం ద్వారా అబ్బుతాయి.
 
ఉత్సాహవంతమైన నగరం..

హైదరాబాద్ వెరీవెరీ యాక్టివ్ ప్లేస్. కళకు ఇక్కడ మంచి స్థానం ఉంది. రెండేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు వస్తున్నా. హైదరాబాద్‌లో ఈ మధ్య జరిగిన సిలికానాంధ్ర సమ్మేళనంలో రుద్రమదేవి పేరుతో నృత్య ప్రదర్శన చేశాను.
 
సినిమా చేస్తున్నా..

‘ఇంతందంగా ఉన్న మీరు క్లాసిక్ డ్యాన్స్ వైపు రావటం ఏంటీ?’ అని అందరూ అడుగుతారు. మనం ప్రేమించే దాంట్లో అఛీవ్‌మెంట్ ఉంటుంది. 2014 నవంబర్ 22న ఆదిత్యా విక్రమ్ బిర్లా ‘కళా కిరణ్ పురస్కార్’ అందుకొన్న సందర్భం జీవితంలో మరువలేను. తక్కువ కాలంలోనే వందలాది ప్రదర్శనలు ఇచ్చా. ఆరు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చా. చైనాకు యూత్ డెలిగేట్‌గా వెళ్లాను. నృత్య ప్రదర్శనలు చేస్తూనే, కన్నడలో టీవీ సీరియల్స్ చేస్తున్నా. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నా.

మరిన్ని వార్తలు