దారితోచని సూత్రధారులు

10 Jan, 2015 23:23 IST|Sakshi

STAR - రిపోర్టర్
సాయిరామ్ శంకర్
 
సంక్రాంతి వేళ పల్లెవాకిట తిష్టవేసిన ధాన్యరాశులు పురవీధుల్లో వెతికినా కనిపించవు. కల్లాపి చల్లిన లోగిళ్లు, వాటిల్లో ముత్యాల ముగ్గులు, అందులో కొలువుదీరే గొబ్బిళ్లు సిటీలో ఎక్కడో గానీ కానరావు. పట్నంలో సంక్రాంతి శోభను వినువీధిలో గాలిపటాలు తెలిపితే..! రాజధాని వీధివీధిలో తెలియజేసేది డూడూ బసవన్నలను తోడ్కొని వచ్చే డుం డుం గంగిరెద్దు దాసరులే!!  అయ్యగారికి దండం పెట్టు అంటూ సిటీవాసులకు రోజంతా వంద వందనాలు అందించినా వారికి వంద రూపాయలైనా గిట్టుబాటు కావు. బసవడితో సమానంగా తకిట తందనాలాడినా.. వచ్చేది ఓ పాత పంచ మాత్రమే. చాలీచాలని సంపాదనతో దారితెన్నూ లేకుండా సాగుతున్న ఈ సూత్రధారులను సాక్షి సిటీప్లస్ తరఫున సాయిరామ్ శంకర్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు.
 
సాయిరామ్ శంకర్: బసవన్నలు ఇళ్లముందుకు వచ్చి తలాడిస్తేనే సంక్రాంతి పండుగ సందడి
మొదలవుతుంది. సాక్షి స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు నేను బసవన్నలుండే ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు?
ఎల్లయ్య: బాగనే ఉన్నం సార్. పండగకదా! ఈ నాలుగు రోజులు మంచిగనే ఉంటది.
శీను: సంక్రాంతి పండుగ కదా సార్. మా బసవన్నల రోజులు.
 
సాయిరామ్ శంకర్: ఏ ఊరు నుంచి వచ్చారు ఎల్లయ్య?
ఎల్లయ్య: మా అందరిదీ మెదక్ జిల్లా మద్దూరు సార్. పండగ రోజులల్ల సిటీకొస్తం.
 
సాయిరామ్ శంకర్: ఇక్కడ ఎన్నిరోజులుంటారు?
ఎంకయ్య: నెల రోజులుంటం.

సాయిరామ్ శంకర్: ఆ తర్వాత?
ఎంకయ్య: మళ్లీ మా ఊరికి పోతం.

సాయిరామ్ శంకర్: ఊళ్లో ఏం చేస్తుంటారు?
ఎల్లయ్య: ఏం చేస్తం సార్. ఇదే పని. బసవన్నను ఎంట బెట్టుకుని బిచ్చమెత్తుకుంటం.
 
సాయిరామ్ శంకర్: అలాగా, మీరు ఎలా చెబితే గంగిరెద్దులు అలా చేస్తుంటాయి. దండం పెట్టడం నుంచి ఆడటం వరకూ ట్రైనింగ్ మీరే ఇస్తారా..?
ఎంకయ్య: మేమేడిత్తం సార్. దాని కోసం గుంటూరుల, తిరుపతిల మాకు గురువులు ఉన్నరు వాళ్ల కాడికి పంపుతం. ఆళ్లే నేర్పిస్తరు.
 
సాయిరామ్ శంకర్: అవునా.. ఈ శిక్షణకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చవుతుంది?
 ఎంకయ్య: పదిహేను వేల వరకు కట్టాలి సార్. ఏడాది నేర్పిస్తరు.
 
సాయిరామ్ శంకర్: వన్ ఇయరా.. అన్నీ ఫర్‌ఫెక్ట్‌గా వచ్చేస్తాయా?
ఎల్లయ్య: అన్నీ ఒక తీరుంటాయా సార్. మన పిల్లగాళ్లను స్కూల్‌కు పంపిస్తున్నం. అందరికీ ఒక్క తీరుగ చదువొస్తదా? గిదీ అంతే.
 
సాయిరామ్ శంకర్: నిజమే! నీ బసవన్నపేరు ఏంటి ఎల్లయ్య?
ఎల్లయ్య: రాముడు.

సాయిరామ్ శంకర్: మరి లక్ష్మణుడు, ఆంజనేయుడు?
ఎంకయ్య: నా బసవన్న పేరు లక్ష్మణుడు.
సాయిలు: మావోడు ఆంజనేయుడు.
 
సాయిరామ్ శంకర్:
పేర్లు బాగున్నాయి. ఏదీ ఓసారి రాముడి పనితనం చూపించు?
ఎల్లయ్య: రాముడు.. రాముడు.. చూడు మనకాడికి ఎవరొచ్చిండ్రో.. సినిమాలా దొరొచ్చిండు. ఒక్కపారి అయ్యగారికి దణ్ణం పెట్టు.. దొర సంతోషపడ్తడు.
 
సాయిరామ్ శంకర్: వావ్.. భలేగా పెట్టిందే!
ఎల్లయ్య: మా రాముడు బతుకమ్మ ఆడినట్టు ఇంకెవ్వడు ఆడలేడు సార్.
 
సాయిరామ్ శంకర్: అవునా.. గుడ్. మీరు పాడే పాటలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు ?
అంకయ్య: నేర్చుకునేదేం లేదు సార్. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఆ పాటలు.
 
సాయిరామ్ శంకర్: మరి బసవన్నల ద్వారా ఆదాయం, వాటిపై అయ్యే ఖర్చు గురించి చెప్పండి?
సాయిలు: పండుగలప్పుడు బాగానే ఉంటది. మామూలు దినాలల్ల తిండికి కూడా తిప్పలే. మా కడుపు కాలుతున్నా.. బసవన్న పొట్ట మాత్రం మాడ్చలేం సార్. ఇంట్ల అందరూ పస్తు పడుకున్నా.. మా దేవుడికి బువ్వ పెట్టని రోజుండదు. పొద్దుగాళ్ల పిండి పెడ్తం. గడ్డి మామూలే. నెలకు వెయ్యి నుంచి పదిహేనొందల రూపాయలు అయితయి.
 
సాయిరామ్ శంకర్: మీ ఆడవాళ్ల గురించి చెప్పలేదు. ఏమ్మా.. మాట్లాడండి.
దుర్గమ్మ: ఏముంది సార్. మగోళ్లు బసవన్నను ఎంటబెట్టుకుని పోతే.. ఊర్లళ్ల ఉన్నప్పుడు పొలం పనికి పోతం. ఈడికొచ్చినప్పుడు అడుక్కోనికి పోతం.
 
సాయిరామ్ శంకర్: మీలో ఆడపిల్లలకు చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తారట నిజమేనా?
సాయమ్మ: ఒకప్పుడు చేసేటోళ్లు సార్. ఆడపిల్ల పుట్టిన 21 దినాలకే.. పెళ్లి ముచ్చట తెద్దురు. ఇప్పుడు అందరం పిల్లల్ని చదివించుకుంటున్నాం.
ఎల్లయ్య: మేమంటే నాలుగు మాటలు పడి బతికినం సార్. మా పిల్లలకు ఇసొంటి బతుకొద్దు. అందుకే ఎంత కష్టమైనా పిల్లల్ని చదివిస్తున్నం.

సాయిరామ్ శంకర్: మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఆవులతో కనిపిస్తున్నారు?
అంకయ్య: అందరి పరిస్థితి ఒక్కతీరుగ ఉంటదా సార్!
 
సాయిరామ్ శంకర్:   మీ ఊరిలో కనీసం ఇళ్లయినా ఉన్నాయా?
భాషా: ఒక్కరికి కూడా సొంతిల్లు లేదు సార్. ఇక్కడ ఎట్లనైతే గుడిసెళ్లో ఉంటున్నమో.. ఊళ్లో కూడా అంతే.
 
సాయిరామ్ శంకర్: పట్నం బసవన్నకు పల్లెటూరు బసవన్నకు తేడా ఏంటి ?
శీను: పల్లెల్లో బసవన్నంటే దేవుడి లెక్క సార్. ఇంటిల్లిపాది వచ్చి దండం పెడ్తరు. ధాన్యం పెడ్తరు. వాడికి పంచ కప్పి, మాకు పైసలు ఇచ్చేటోళ్లు. పట్నంల ఆ మర్యాద లేద్సార్. అయితే పది రూపాయలు పడేస్తున్నరు. లేదంటే వెళ్లండి అనేస్తరు.
 
సాయిరామ్ శంకర్: అంతేలే సిటీవాసులు సాటి మనుషుల మీదే అభిమానం చూపడం లేదు. అది సరే, ఏది నాలుగు పాటలు పాడి బసవన్నలతో నాట్యం చేయించండి.
ఎల్లయ్య: రాముడు...లక్ష్మణా... ఆంజనేయులు రండ్రి బతుకమ్మ ఆడండి.... అంటూ పాటందుకున్నారు. బసవన్నలు కొమ్ములూపుతూ అడుగులు వేస్తూ నాట్యం చేశాయి.
 
సాయిరామ్ శంకర్: థ్యాంక్యూ. మీకు, మీ బసవన్నలకు హ్యాపీ సంక్రాంతి. బై..
 
సాయిరామ్ శంకర్: వీటికీ మీకూ అనుబంధం ఎక్కువనుకుంటా..!
ఎల్లయ్య: చానా సార్. బిడ్డలెక్కనే.. ఒక్కోసారి అవే మా యజమానుల్లా కనిపిస్తయి. వాటికేమైనా దెబ్బ తగిలినా, పాణం బాగోకపోయినా ఇంట్ల ఎవ్వరం బువ్వ ముట్టం. బసవన్న కాలం చేస్తే.. ఈడికెళ్లి ట్రాక్టరో, డీసీఎంనో మాట్లాడుకుని ఊరికి తీస్కవోయి బొందపెట్టి బంధువులందరికీ భోజనాలు పెట్టుకుంటం.
శీను: గవ్వన్ని ఎందుకంటే..  అవికూడా మాలో ఒక్కటే. బసవన్న పలికినట్టు మా బిడ్డ కూడా పలకడు సార్.
 
సాయిరామ్ శంకర్: బిడ్డకంటే గొడ్డు నయం అంటే ఇదే కాబోలు (నవ్వుతూ...). గ్రేట్... మీ
అనుబంధం వింటుంటే కడుపు నిండిపోతుంది.
 
 ప్రజెంటేషన్: భువనేశ్వరి

 ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు