ప్రకృతి దేవోభవ

5 Jun, 2015 01:09 IST|Sakshi
ప్రకృతి దేవోభవ

- పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల కృషి  
- సెయింట్ జోసెఫ్స్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు
- పాఠశాల వేదికగా పనిచేస్తున్న ఎకోక్లబ్

పర్యావరణం దెబ్బతింటే బాధితులుగా మారేది భావితరాలే. అందుకే.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అంశంలో అత్యవసరంగా అవగాహన పెంచాల్సింది విద్యార్థుల్లోనే. ఈ విషయంలో ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి నగరంలోని పాఠశాలల్లో ఏర్పాటవుతున్న ‘ఎకో క్లబ్స్’. వీటిలో కొన్ని స్పష్టమైన విధానాలతో ముందడుగేస్తున్నాయి. ఇతర పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.                              - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
‘మా స్కూల్‌లో 30 మంది విద్యార్థులు ఎకో క్లబ్‌లో వలంటీర్లుగా ఉన్నార’ని చెప్పారు కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్‌స్కూల్ టీచర్ రమ. ప్రస్తుతం తమ స్కూల్‌లోని ఎకోక్లబ్‌కు కో ఆర్డినేటర్‌గా ఉన్నారామె. పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహించే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వెల్త్ అవుటాఫ్ వేస్ట్’ (వావ్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ కాంపిటీషన్‌లో 2014-15కు గాను పాఠశాలలోని ఎకో క్లబ్ విజేతగా నిలిచింది. ఈ పాఠశాల విద్యార్థులు 9,545 కిలోల పేపర్ వేస్ట్‌ను సేకరించి ‘వావ్’కి అందించడం ద్వారా గెలుపు దక్కించుకున్నారు. ఇదే ఏడాది మరో ఎన్‌జీఓ ‘టెరి’ నిర్వహించిన టెట్రాప్యాక్‌ల కలెక్షన్ పోటీలోనూ వీరు గెలుపొందారు. ఇంతే కాకుండా కొంతకాలంగా విభిన్న రకాల యాక్టివిటీస్ ద్వారా తమ ఎకో క్లబ్ విద్యార్థుల్లో చైతన్యం పెంచుతోందని వివరించారు రమ.
 
పర్యావరణ స్పృహే ధ్యేయంగా..
స్కూల్‌లో 2005లో ఎకోక్లబ్ ఏర్పాటైంది. అదే ఏడాది నుంచి స్కూల్లో మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఫలితంగా అప్పటి వరకూ పచ్చని ఆకుకు సైతం నోచుకోని పాఠశాల ప్రాంగణంలో ఇప్పుడు వందలాది చెట్లు పెరిగాయి. ‘నాటిన 500 మొక్కల్లో ఎన్నో ఏపుగా పెరిగాయి. క్రోటన్స్ నుంచి పూల మొక్కల వరకూ మా స్కూల్ మొత్తం గ్రీనరీయే. త్వరలో ఆర్గానిక్ గార్డెనింగ్‌ను స్కూల్ టైపై ఏర్పాటు చేయనున్నాం’ అంటూ ఉత్సాహంగా చెప్పారు రమ. ఈ స్కూల్‌లోని ఎకోక్లబ్ ప్రసిద్ధ ఎన్‌జీఓ ‘టెరి’ నుంచి గత ఐదేళ్లుగా టెట్రాప్యాక్‌ల కలెక్షన్ పోటీలో గెలుపొందుతూ ఎన్విరాన్మెంట్ అంశాల్లో బెస్ట్ స్కూల్‌గా నిలుస్తోంది.

పర్యావరణం అంశంలో అందుకున్న నగదు బహుమతులను సైతం వీరి క్లబ్ పాఠశాలలో ట్రీ ప్లాంటేషన్‌కు అవసరమైన ఖర్చులుగా వినియోగించడం విశేషం. ‘ఎనర్జీ సేవింగ్’ అంశంపై పీయూష్ గోయల్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌కు మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక స్కూల్ మాదే’నని వివరించారు ఆమె. హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో ఆర్గానిక్ రంగులు, టపాసులు.. వినియోగంపై తమ విద్యార్థులు రకరకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని, ప్లాస్టిక్ వినియోగాన్ని వద్దనే సందేశంతో పెయింటింగ్, వ్యాసరచన పోటీలతో పాటు తరచుగా ర్యాలీలు నిర్వహిస్తారని చెప్పారు.

మనిషిని ప్రకృతి పుట్టిస్తే.. అభివృద్ధి పేరిట ఆ ప్రకృతినే నాశనం చేస్తున్నాడు మనిషి. ఆ ఫలితం ఇప్పటికే రకరకాల వైపరీత్యాల రూపంలో మనకు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యుక్త వయసులోనే ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను తెలియజెప్పే ఎకోక్లబ్స్ అన్ని స్కూల్స్‌లో ఇంతే యాక్టివ్‌గా మారితే.. పచ్చని భవితకు ఆసరాగా మారితే.. అంతకన్నా కావాల్సిందేముంది?

మరిన్ని వార్తలు