చదువుల సీజన్‌లో పుస్తకాల అడ్డా..

19 Jun, 2015 01:28 IST|Sakshi
చదువుల సీజన్‌లో పుస్తకాల అడ్డా..

కేజీ టు పీజీ.. కేరాఫ్ కోఠి సెకండ్‌హ్యాండ్ పుస్తకాలకు ప్రత్యేక సెల్లార్
సుల్తాన్‌బజార్:
విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే విద్యార్థులకు పుస్తకాల కోసం ఒకటే టెన్షన్. ఏ షాప్‌కు వెళ్లినా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. మరికొన్ని ఉండవు. ఎక్కడికెళ్లినా ఇదే సమస్య ఎదురవుతుంది. సమయానికి పుస్తకాలు దొరక్క తల్ల్లిదండ్రులు సైతం హైరానా పడతారు.

కానీ ఏ పుస్తకం కావాలన్నా.. అందరూ చూపించే దారి కేరాఫ్ ‘కోఠి’. కేజీ నుంచి పీజీ వరకు.. ఏ పుస్తకం కావాలన్నా ఆ ప్రాంతం పేరే చెబుతారు. ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు పైతరగతులకు కావాల్సిన పుస్తకాల అన్వేషణ మొదలైంది. కొత్త టెక్ట్స్, నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీ కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠిలోని పుస్తకాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. కోఠి, సుల్తాన్‌బజార్, ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్న పుస్తకాల దుకాణాల్లో దొరకని స్టేషనరీ అంటూ ఉండదు.
 
పోటీ పరీక్షల పుస్తకాలు సైతం..
కోఠిలోని పుస్తకాల దుకాణాలలో కేజీ నుంచి పీజీ వరకు టెక్ట్స్ పుస్తకాలు లభ్యమవుతాయి. అంతేగాక ఎంసెట్, లాసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్, ఏఐఈఈఈ.. ఇతర అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వేసవి తర్వాత వర్షకాలంలో ఇక్కడ ‘పుస్తకాల సీజన్’గా పిలుస్తూ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తూ వ్యాపారులు విద్యార్థులను, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
 
కిలోల్లో నోటు పుస్తకాలు..
చిత్తు కాగితాలు కిలోలుగా అమ్మే ఈ రోజుల్లో నోటు పుస్తకాలు సైతం కిలోల్లో కొనవచ్చంటే అశ్చర్యపోతారు. కానీ కోఠిలో ఏ షాప్‌కు వెళ్లినా నోటు పుస్తకాలను కిలో లెక్కన అమ్ముతారు. చాలామందికి ఇది తెలియకపోయినా ఇక్కడ సీజనల్ వ్యాపారంలో భాగంగా వ్యాపారులు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక్క నోటు పుస్తకం కనీస ధర రూ.30 ఉంటే.. ఈ మొత్తానికి మూడు పుస్తకాలు సొంతం చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులు ‘కిలో’ పుస్తకాలంటే ఆస్తకి చూపుతున్నారు.
 
సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా..
అందరూ కొత్త టెక్ట్స్ పుస్తకాలు కొనలేరు.. ఇలాంటి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను సగం ధరలో కూడా ఇక్కడ దొరుకుతాయి. పేరుకు సెకండ్ హ్యాండే గాని.. చాలావరకు కొత్త పుస్తకాలే ఉంటాయి. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా కిందనున్న సెల్లార్‌లో ఇలాంటి దుకాణాలే ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ ఇతర కోర్సుల పుస్తకాలు సగం ధరలో విక్రయిస్తున్నారు. రూ. 1200 ఉన్న పుస్తకం ఇక్కడ కేవలం రూ.400కు పొందవచ్చు.

మరిన్ని వార్తలు