మనిషిని అందంగా తీర్చిదిద్దే.. స్టైలిస్ట్

10 Aug, 2014 00:03 IST|Sakshi
మనిషిని అందంగా తీర్చిదిద్దే.. స్టైలిస్ట్

వెండితెరపై సినిమా తారలను, టీవీలో, వ్యాపార ప్రకటనల్లో మోడళ్లను చూస్తే.. వారు అంత అందంగా ఎలా తయారయ్యారా? అనిపిస్తుంది. కానీ, వారిని అలా రూపొందించేది స్టైలిస్ట్‌లే. ఎలాంటివారినైనా చక్కగా తీర్చిదిద్ది, కంటికి ఇంపుగా మార్చే నైపుణ్యం వీరి సొంతం. తల వెంట్రుకల నుంచి కాలి గోర్ల దాకా, ధరించే దుస్తులు, ఆభరణాలు.. ప్రతిదీ ఎలా ఉండాలో స్టైలిస్ట్‌ల మదిలో రూపుదిద్దుకుంటుంది. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి క్లయింట్‌ను అందంగా మార్చే స్టైలిస్ట్‌లకు దేశవిదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది.  
 
 అసలుసిసలు గ్లామర్ ఫీల్డ్
 ఆధునిక యుగంలో కార్పొరేట్ కల్చర్ విస్తరిస్తుండడంతో నలుగురిలో ప్రత్యేకంగా, ఆకట్టుకొనేలా కనిపించాలనే భావన అందరిలోనూ మొదలైంది. సినీ, టీవీ నటులు, యాంకర్లు, మోడళ్లు, పేజ్ 3 ప్రముఖులు అందంగా కనిపించేందుకు స్టైలిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారు. కొందరు సొంత స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నారు. దీంతో వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. ఇది అసలుసిసలైన గ్లామర్ ఫీల్డ్ కావడంతో యువత దీనిపై అమితాసక్తి చూపుతోంది. భారత్‌లో స్టైలిస్ట్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి.
 
 ఫ్యాషన్ పబ్లికేషన్స్, మ్యాగజైన్లు, డిజైన్ సంస్థలు, రిటైల్ బ్రాండ్లు, టీవీ ఛానళ్లు, సినిమాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, అడ్వర్‌టైజింగ్ అండ్ మార్కెటింగ్ తదితర రంగాల్లో వీరికి ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఇందులో ఫ్యాషన్, మేగజైన్, కమర్షియల్, సెలబ్రిటీ స్టైలిస్ట్ అనే విభాగాలుంటాయి. పార్ట్‌టైమ్‌గా, ఫుల్‌టైమ్‌గా పనిచేసుకోవచ్చు. టీవీ ఛానళ్లు, ప్రకటనల ఏజెన్సీలు పూర్తిస్థాయి స్టైలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. వివాహం వంటి శుభకార్యాల్లోనూ వీరికి మంచి అవకాశాలు, ఆదాయం లభిస్తున్నాయి.
 
 కావాల్సిన స్కిల్స్: స్టైలిస్ట్‌లకు సాధారణంగా మేక్ అప్ ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు, డిజైనర్లు, హెయిర్ స్టైలిస్ట్‌లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తన ఆలోచనలను వారికి వివరించి, పనిచేయించాలి. స్టైలిస్ట్‌కు బృందాన్ని ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ తప్పనిసరి.  కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ఈ రంగంలో ప్రపంచస్థాయిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను పసిగట్టే నేర్పు అవసరం. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకెళ్లాలి. ఫ్యాషన్ రంగంలో ఒత్తిళ్లు, సవాళ్లు అధికంగా ఉంటాయి. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. పనివేళలతో నిమిత్తం లేకుండా రాత్రి పగలు ఎప్పుడైనా పనిచేయగలగాలి.
 
 అర్హతలు: మనదేశంలో పలు సంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీలో భాగంగా స్టైలిస్ట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో వీటిలో చేరొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సీనియర్ స్టైలిస్ట్ వద్ద కొంతకాలం పనిచేయడం మంచిది. దీనివల్ల క్షేత్రస్థాయి అనుభవంతోపాటు మార్కెట్ అవసరాలపై అవగాహన పెరుగుతుంది.
 
 వేతనాలు: ప్రారంభంలో సీనియర్ స్టైలిస్ట్ వద్ద సహాయకులుగా పనిచేస్తే నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుంది. తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా కెరీర్ ప్రారంభించి నెలకు రు.25 వేలకు పైగానే పొందొచ్చు. టీవీ ఛానళ్లు, మేగజైన్లలో సీనియర్లకు గంటల చొప్పున లక్షల్లో ఆదాయం ఉంటుంది.  
 
 స్టైలిస్ట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

 ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
 వెబ్‌సైట్: www.nift.ac.in
 ఏ పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్-ఢిల్లీ
 వెబ్‌సైట్: pearlacademy.com
 ఏ లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్
 వెబ్‌సైట్: www.arts.ac.uk/fashion
 
 అవకాశాలకు కొదవ లేదు  
 ‘‘మారుతున్న జనరేషన్ టేస్ట్‌కు తగినట్లుగా ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది. అందరూ కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిచోటా స్టైలిష్ లుక్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. కేవలం వ్యక్తిగతంగా కాకుండా స్టోర్స్, షాప్స్ అన్నిచోట్లా సరికొత్తగా మార్కెట్‌ను ఆక ట్టుకునేలా డిజైన్ చేయటం స్టైలిష్‌లో భాగమే. ప్రస్తుతం స్టైలిస్ట్‌లకు అవకాశాలకు కొదవ లేదని నమ్మకంగా చెప్పొచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీలో ఏడాది కోర్సుకు దాదాపు రూ.70 వేలు ఖర్చవుతుంది. కోర్సు పూర్తయిన తర్వాత ప్రారంభంలోనే రూ.15 వేల వేల వేతననం లభిస్తుంది. ఈ లెక్కన కోర్సు పూర్తిచేసేందుకు పెట్టిన పెట్టుబడిని ఐదారు నెలల్లో సంపాదించవచ్చు’’     
 -అజితారెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్,
 హామ్స్‌టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్

మరిన్ని వార్తలు