ఒకరికొకరు

25 Oct, 2014 12:21 IST|Sakshi
ఒకరికొకరు

నా అప్రయత్న ప్రియసఖి.. చీకటి నిజాలు.. పగటి కలలు.. రేయి చంద్రుడు, సంధ్యా సూర్యుడు.. సరదావిహారాలు.. సైద్ధాంతిక పోరాటం అన్నిటికీ కావాలి నువ్వు. తోడునీడలు కావొద్దు.. కోయిల గోరింకలు కావొద్దు.. కలసి తిరిగే స్వతంత్ర  స్నేహితులమవుదాం.. తను జతకూడాలి అనుకున్న అమ్మాయితో అబ్బాయి మనసు చెప్పిన ఊసు ఇది! వాళ్ల సహజీవనానికి ఎనిమిదేళ్లు. ముందు అనుకున్నట్టుగానే వాళ్లిద్దరూ తోడునీడలుగా లేరు.. కోయిల, గోరింకలు అసలే కాలేదు! ఆమె అతని సృజన.. అతను ఆమె తేజమై.. ఎవరికివారు ఎంచుకున్న దారుల్లో కలసి నడుస్తున్నారు! మార్గనిర్దేశకాలుండవ్.. తడబడితే చేయూత ఉంటుంది ! ఆలుమగలులా కాకుండా స్వతంత్ర  స్నేహితులుగా ఉంటున్న ఆ జంటలో అతడు.. పదిరి రవితేజ, ఆమె.. గుమ్మళ్ల సృజన. వాళ్ల చెలిమే ఈ యూ అండ్ ఐ!
 - రవితేజ, సృజన
 
 ఈ ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరువేరు కాదు కొంచెం ఘనమైనవి కూడా. రవితేజ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు. సృజన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గుమ్మళ్ల బలరామయ్య కూతురు. ఈ భిన్నాలు వీళ్లలోనూ ఉన్నాయి. రవితేజ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకు. సృజన.. పుస్తకాల పురుగు. ఆ సంఘజీవికి.. ఈ ఇంట్రావర్టిస్ట్‌కి స్నేహం ఎలా కుదిరింది?.
 
 సెంట్రల్ యూనివర్సిటీలో..
 ‘నేను అప్పుడు పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. తేజ.. విజయవాడలో లా చదువుతున్నాడు. సమతా విద్యార్థి సమాఖ్య మీటింగ్స్ కోసం తరచుగా యూనివర్సిటీకి వచ్చేవాడు. నేను స్టూడెంట్ పాలిటిక్స్‌లో యాక్టివేం కాదు.. కానీ సంఘీభావం తెలపడానికి మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేదాన్ని. అలా అతను పరిచయం’ అని చెప్తుంది సృజన.
 
 ప్రణయం.. పరిణయం..
‘ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా.. నేనే చెప్పాను తనతో నువ్వంటే ఇష్టం అని’ సృజన అంటుంటే.. ‘అలా ఏం లేదు.. నాకూ అనిపించింది. నేను మొదటి నుంచి ఫంకి, చింకి, కెరీరిస్ట్ అమ్మాయిలకు చాలా దూరం. సృజన అందుకు భిన్నం. అందుకే చాలా నచ్చింది’ అన్నాడు రవితేజ. ‘కాబట్టే నేను ప్రపోజ్ చేసిన మూడు నెలలకు ఆలోచించుకుని ఓకే చెప్పాడు’ నవ్వుతూ సృజన. ‘ఒక రోజు ఈవెనింగ్ చెప్పాను.. నాతో కలసి ఉంటావా? మనిద్దరం కలసి ఉండగలం అని. విని పొద్దున్నే నువ్వన్నది నిజమేనా అని రీకన్‌ఫర్మ్ చేసుకుంది’ రవితేజ. ‘అలా నిర్ణయించుకున్న అయిదేళ్లకు పెళ్లయింది. పెళ్లనే ఫ్రేమ్‌లోకి వచ్చి మూడేళ్లయినా.. మా సహజీవనం మాత్రం ఎనిమిదేళ్ల నుంచి’ అని ప్రీషియస్ పోస్ట్‌ను జ్ఞాపకం చేసుకుంది సృజన.
 
 కెరీర్..
 ‘పెళ్లికి ముందు మూడుసార్లు సివిల్స్ రాశాను.. రాలేదు. గ్రూప్‌వన్ రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కూడా. సివిల్స్‌కి ఇంకో చాయిస్ ఉంది కదా అని తేజ గుర్తు చేస్తే అప్పుడు మళ్లీ దాని మీద దృష్టి పెట్టాను. వచ్చింది. ఆ క్రెడిట్ తేజాదే’ అంటుంది ఇంతకన్నా భాగస్వామి సహకారం ఏముంటుంది అన్నట్టు. మరి తేజకు? ‘నేను హైకోర్ట్ అడ్వొకేట్‌ని. ఎన్‌కౌంటర్స్‌కి, సోంపేట ఫైరింగ్‌కు వ్యతిరేకంగా కేసులు టేకప్ చేశాను. నా ఈ చర్యల వల్ల సృజన మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. అయినా తను ఏనాడు క్వశ్చన్ చేయలేదు. అసలు ఆ ప్రెషర్స్ తాలూకు ప్రభావం ఏదీ నా మీద పడనీయదు’ గర్వంగా చెప్తాడు రవితేజ.
 
 కోపాల్ తాపాల్.. గొడవలు పోట్లాటలు..
 ‘పెద్దగా ఉండవ్. ఎప్పుడైనా నాకే కోపం వచ్చి అరుస్తాను కానీ తేజకు అస్సలు కోపం ఉండదు. నా కోపం కూడా తను తీసింది తీసిన చోట పెట్టనప్పుడే. అరుస్తాను.. అయినా ఏమీ అనడు’ అని సృజన అంటుంటే ‘ఏమీ అనను.. ఆ వస్తువు తీసుకెళ్లి తీసిన చోట పెట్టను’ అని నింపాదిగా ఆన్సర్ చేస్తాడు తేజ. ‘ఇక గొడవలు.. పోట్లాటలు లేనేలేవు. బేసిక్‌గా ఇద్దరం పీస్‌ఫుల్‌గా ఉండటానికే ఇష్టపడతాం. గొడవపడి మాటలు మానేసుకున్న సందర్భాలు లేవు ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంటుంది సృజన.
 
 కంప్లయింట్స్ అండ్ డిమాండ్స్
 ‘అస్సలు లేవు’ ఇద్దరూ చెప్తారు ఏక కంఠంతో. ‘తను నా ప్రిన్సిపుల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. నగలు, షాపింగ్‌లాంటివేమీ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయదు’ అంటాడు. ‘తను ఏం చెప్పినా, ఏం చేసినా ఓ క్లారిటీ ఉంటుంది. ఆలోచించి చెప్తాడు, చేస్తాడు. ఒకరిపట్ల ఒకరికి ఇలాంటి గౌరవం, నమ్మకం ఉంటాయి కాబట్టి కంప్లయింట్స్, డిమాండ్స్ ఉండవ్’ అని చెప్తుంది సృజన.
 
 కాంప్లిమెంట్స్.. ఇన్‌స్పిరేషన్..
 ‘నాలో నాకన్నా తేజానే ఎక్కువుంటాడు’ అని ఆమె తన ప్రేమకు కాంప్లిమెంట్ ఇస్తే, ‘ఐ లవ్ లివింగ్ విత్ హర్’ అని అతని మాట. ‘పెళ్లికి ముందు అమ్మానాన్న, ఇప్పుడు తేజ.. అమ్మానాన్న, కొడుకు, స్నేహితుడు ఎవ్రీథింగ్.. ఆయన సహచర్యం అందించిన గిఫ్ట్ ఇది’ భర్త ప్రభావం ఆమెను మురిపిస్తుంటే.. ‘సృజన వల్ల విషయాలను సిస్టమేటిక్‌గా ఎలా డీల్ చేయగలరో తెలుసుకున్నాను’ అని భార్య ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ను ఒప్పుకుంటాడు రవితేజ నిజాయితీగా.  
 
 ఈ అవగాహన.. అన్యోన్యత వెనుక..
 ‘వీ నెవర్ ఇన్‌సిస్ట్ ఆన్ లివింగ్ టుగెదర్ ఫిజికల్లీ, మనీ అండ్ సెక్స్.. ఈ రెండింటి కన్నా బలమైన బాండింగ్ ఒకటుండాలి’ అని ఆయన అంటే ‘u have been my love, my dad, my mom, my guru, my support system.. my god.. for all that u were n u were not, i am that blessed soul.. to have u around always.. i wish i could love half as much as u do and shall always be my endeavor.. thanks for being u.’ అంటూ సృజన నిర్వచిస్తుంది.
- సరస్వతి రమ

మరిన్ని వార్తలు