తసదుఖ్ఖమూ... పేగుశోకమూ వద్దు!

7 Feb, 2015 00:37 IST|Sakshi
తసదుఖ్ఖమూ... పేగుశోకమూ వద్దు!

మన హైదరాబాద్ రోడ్ల మీద నేను బైక్ నడుపుతున్నప్పుడు, నా పక్క నుంచి అత్యంత వేగంతో కుర్రాళ్లు రయ్ రయ్ మంటూ మోటారుసైకిళ్ల మీద దూసుకుపోతుంటారు. వాళ్లనలా చూస్తుంటే ఓ పక్క చూడ ముచ్చటగానూ ఉంటుంది, మరో పక్క గుండె గుబగుబలాడుతుంటుంది. ఆ బైకుల స్పీడుకు యువత హుషారెత్తిపోతుంది. ఆ బండ్ల జోరు మోతతో రోడ్డు హోరొత్తిపోతుంది. పక్కన వెళ్లేవాళ్లు ఠారెత్తిపోతారు. ఓ హుషార్పైన వాడు బండిని ఏటవాలుగా అటూఇటూ గబగబా ఒంచుతూ... కట్స్ కొడుతూ పోతుంటే ఆ కట్స్ ఏ తల్లి పేగును కట్ చేస్తాయోనంటూ ‘ఏ తల్లిబిడ్డో... హమ్మనా బిడ్డో, పదిలం కొడుకో, జర భద్రం కొడుకో...’ అంటుంది దారినపోయే ఓ అమ్మ.
 
చిన్నతనంలో చిన్నారి కొడుకు చేసే అల్లరికీ, విన్యాసాలకు గిరికీలు కొట్టే కన్నతండ్రి పేగులు పడ్డ మెలికల్లా తన వాహనంతో గిరికీల మీద గిరికీలు కొట్టిస్తుంటాడా కుర్రాడు. కానీ... మనం హైదరాబాద్ యూత్ కదా... కాస్త సాలార్‌జంగ్‌నూ... వాళ్ల నాన్ననూ ఓసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదేమో అనిపిస్తుంటుంది నాకు. మీకు గుర్తులేకపోతే నేను గుర్తు చేస్తా వినండి.

సాలార్‌జంగ్ అంటే ఇప్పుడు మ్యూజియమ్‌లోని వస్తువులను సమీకరించిన మూడో సాలార్‌జంగ్ గారి తాతగారైన మొదటి సాలార్‌జంగ్ అన్నమాట. ఆయన పేరు మీర్ తురాబ్ అలీఖాన్. వాళ్ల నాన్న కూడా నవాబుగారి పేషీలో ప్రధానమంత్రే. చిన్నప్పుడు తురాబ్ అలీఖాన్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్లనాన్న మొక్కుకుంటాడు. ఆ మొక్కు పేరు ‘తసద్దుఖ్’. ‘తురాబ్ అలీ ప్రాణం పోయేలాగుంది కదా.

దేవుడా ఏ ప్రాణమైతేనేం నీకు కావాల్సింది ఒక ప్రాణం. నేనన్నీ చూసి, అనుభవించిన వాణ్ణి. కాబట్టి చిన్నారి తురాబ్ ప్రాణాన్ని వదిలేసి నా ప్రాణాన్ని తీసుకో’ అని అర్థించడమే ఆ మొక్కు. తసద్దుఖ్ఖు మొక్కు ఫలించిందో ఏమోగానీ... తురాబ్ అలీ బతికాడు. వాళ్ల నాన్న మరణించాడు. ఆ తర్వాత సదరు తురాబ్ అలీ ఖాన్‌గారు... సాలార్‌జంగ్-1 పేరుతో ఏ మంత్రీ నిర్వహించలేనంత ఘనంగా, అది కూడా అత్యంత సమర్థంగా మూడు పదుల ఏళ్ల పాటు కార్యనిర్వాహకత్వం చేశాడు.

తురాబ్ పొరబాటున అప్పుడే చనిపోయి ఉంటే ఈ కీర్తి దక్కి ఉండేది కాదు కదా. ఏమో ఏ యువకుడిలో ఏ తురాబున్నాడో? ఏ నవాబున్నాడో?! బండ్ల మీద రివ్వురివ్వున దూసుకుపోయే యువకులకు ఓ తండ్రి చేసే విజ్ఞప్తి ఇది. మీరు మీ వాహనాన్ని దూకిస్తున్నప్పుడు, జర్కిస్తున్నప్పుడూ మీ తండ్రి కూడా మొదటి సాలార్‌జంగ్‌లాగే ‘తసద్దుఖ్ఖు’ మొక్కు మొక్కుతూ ఉంటాడేమో. తమకు దుఃఖం కలిగించవద్దని కోరుతూ ఉంటారేమో!

తమ బిడ్డలకు ఆ పరిస్థితి వస్తుందని తెలియక అజహరుద్దీన్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ లాంటి వారు ఆ మొక్కులు మొక్కలేదేమో! కానీ తెలిసుంటే మొక్కి ఉండేవారేమో! వాళ్లంటే సెలిబ్రిటీలు కాబట్టి విషయం వాళ్ల కొడుకుల యాక్సిడెంట్ల సంగతి మనకు తెలిసింది. మనకు తెలియనివాళ్లు ఎందరు గిరికీల మెలికల్లో చిక్కుబడి... వాళ్ల తండ్రి మొక్కుబడి తీర్చుకోవాల్సి వస్తుందో! అందుకే మీ తండ్రికి తసదుఖ్ఖమూ వద్దు... మీ తల్లికి పుత్రశోకమూ వద్దు. ఇది నా మాట కాదు... సాక్షాత్తూ మొదటి సాలార్‌జంగ్ తండ్రి మొక్కిన మొక్కు వెనక ఉన్న మానవీయ మౌనవాక్కు!
 
-యాసీన్

మరిన్ని వార్తలు