వైవాపై క్లీన్ కామెడీ

20 Jul, 2013 05:54 IST|Sakshi
వైవాపై క్లీన్ కామెడీ
 పరీక్షలు... బాబోయ్!
 వైవా... అమ్మబాబోయ్!!
 వైవా అంటే ఎందుకంత భయం? ఎందుకంటే... మాస్టార్లు పిల్లల మీద పట్టు బిగించే ఆఖరి అవకాశం... వైవా.
 అందుకే అంతవరకూ పులిలా ఉన్న పిల్లలు సైతం... వైవా అనగానే  పిల్లిలా మ్యావ్ అంటారు. ఇదిగో ఈ అంశం ఆధారంగానే విశాఖపట్టణానికి చెందిన సబరీష్ కాండ్రేగుల తీసిన షార్ట్ ఫిల్మే... ‘వైవా’.
 
 డెరైక్టర్స్ వాయిస్: వైజాగ్ గీతమ్ యూనివర్శిటీ నుంచి 2012లో బీటెక్ పూర్తి చేశాను. చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసి, ఆ ఉద్యోగం మానేసి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాను. నాకు తెలియకుండానే 13వ ఏట నుంచి నేను ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నాను. మొదట్లో కేవలం సరదాగా తీసేవాడిని. ఆ తరవాత అదే నా ప్రొఫెషన్‌గా మారింది. ప్రతివారిలోనూ ఒక నటుడు, ఒక సినిమాటోగ్రాఫర్, ఒక డెరైక్టర్ ఉంటారని నా నమ్మకం. ప్యాషన్ వర్సెన్ కెరీర్...  ఏది ప్రధానమని చాలా తర్జనభర్జన చేసిన తరవాత ప్యాషన్ వైపే మొగ్గాను. ఇక్కడే నేను గొంగళిపురుగు స్థాయి నుంచి సీతాకోకచిలుక స్థాయికి ఎదిగాను. అందులో నుంచి పుట్టినదే ఛీ2్ఛ. అంటే డౌన్ టు ఎర్త్. ప్యాషన్ విడిచి, సెక్యూర్డ్ కెరీర్ వైపు మళ్లడమంటే మనల్ని మనం మోసం చేసుకోవడమని నా అభిప్రాయం. ఈ చిత్రాన్ని కేవలం 5 గంటలలోనే చిత్రీకరించాను. ఇందుకు నా స్నేహితుడు హర్ష బాగా సహకరించాడు. ఈ వీడియో విడుదల చేయడానికి ముందు, విడుదల చేసిన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఫేస్‌బుక్‌లో మా పేజీ చూసి చిన్మయి (సినీనటి సమంతాకి డబ్బింగ్ ఇచ్చే ఆర్టిస్ట్) చాలా బాగుందని ట్విటర్‌లో షేర్ చేసింది. 
 
షార్ట్ స్టోరీ: ఇంజినీరింగు విద్యార్థులకు పరీక్షలన్నీ పూర్తయ్యి, ‘వైవా’ మిగులుతుంది. ైవె వాకి వచ్చిన లెక్చరర్ ఒక్కో విద్యార్థిని సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటాడు. ఒక్కో స్టూడెంట్ ఒక్కో మేనరిజమ్‌తో, సమాధానం తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తూ, చెబుతుంటారు. ఒకళ్లు దోసెలు వేసినట్టు చేతులు తిప్పుతుంటే, ఒకరు ‘ఓకే సార్! ఓకే సార్!’ అంటూ ఉంటాడు. మరొకడు పైకి కిందకు చూస్తాడు. ఇంకో విద్యార్థి తలను గుండ్రంగా తిప్పుతుంటాడు. వాళ్లకు వచ్చిన మార్కుల గురించి అడుగుతుంటే, వాళ్లని తిట్టి పంపుతుంటాడు లెక్చరర్. ఇంతలో ఒక లెక్చరర్ వచ్చి ‘వైవాకి పదండి’ అంటాడు. అయిపోయిందని విద్యార్థులు చెప్పగానే, ఆ లెక్చరర్ నవ్వుతూ, అంతవరకు వైవా చేసినది ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పడంతో విద్యార్థులంతా ఆశ్చర్యపోతారు.
 
 కామెంట్: ఇందులో కథ ఉందని చెప్పడానికి లేదు. అయితే విద్యార్థులు వైవా సమయంలో వాస్తవంగా ఏ విధంగా ప్రవర్తిస్తారనే విషయం చాలా బాగా చూపించాడు. నటులంతా  అద్భుతంగా నటించారు. క్వాలిటీ పరంగా చలనచిత్రానికి ఏ మాత్రం తీసిపోదు. ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ షార్ట్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని అప్‌లోడ్ చేసిన వారం రోజులకే 10 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. చిన్నవాడైనా ఎంతో అనుభవం ఉన్నవాడిలా ‘పరమార్థ హాస్యం’ పండించాడు ఈ యువకుడు. హాస్యం రచించేవారు ఈ యువకుడిని చూసి నేర్చుకుంటే బాగుంటుందన్నంత చక్కగా, ‘హాస్యం అపహాస్యం కాకుండా, అసభ్యతకు తావు లేకుండా’ తీసిన ఈ దర్శకుడిని అభినందించాల్సిందే. 
 
 - డా.వైజయంతి
 
మరిన్ని వార్తలు