గాడ్సే గుడి

8 Jan, 2015 01:52 IST|Sakshi
గొల్లపూడి మారుతీరావు

 జీవన కాలమ్
 గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది.
 శిక్ష అమలయింది. సమాజమంతా సమర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు.
 మరి కుష్బూ గుడినీ సమాజమంతా సమర్థించదు కదా!
 అఖిల భారత హిందూ పరి షత్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూ ర్‌లో జాతిపిత హంతకుడు గాడ్సే స్మృతికి ఒక దేవాలయా న్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించా రు. గాడ్సే మేనకోడలు హిమా నీ సావర్కర్ దాచిపెట్టిన గాడ్సే చితాభస్మాన్ని పుణే నుం చి తీసుకువచ్చి ఈ ఆలయం లో భద్రపరుస్తారని ఉన్నావ్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సాక్షి మహరాజ్ ప్రకటించారు.
 జాతిని నడిపించే నాయకుడిని ‘దేవుడి’ని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామ కరణం చేశారు.
 ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్‌పూర్‌లో గాంధీ జీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది. తిరునల్వేలిలో నమితా అనే నటీమణికి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను ‘తెలంగాణ దేవత’గా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ తెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయ కుడు దేవుడు.
 అయితే రాజీవ్‌గాంధీ మారణహోమానికి కారణమ యిన శివరాసన్‌ని మహా త్యాగమూర్తి అని తమిళ నాడులో ఊరేగింపులు జరిపారు. ఇందిరాగాంధీని కాల్చి చంపిన బియంత్‌సింగ్, సత్వంత్‌సింగ్‌లను అమృత్ సర్‌లో అఖల్‌తఖ్త్ (సిక్కుమత ప్రధాన పీఠం) అమర వీరులుగా గుర్తించి, అక్టోబర్ 31న అంటే, బియంత్ సింగ్‌ను ఉరి తీసిన రోజును స్మారకదినంగా పండుగ చేస్తోంది.
 ఒక మతం అంగీకరించి, హత్యని ఆత్మత్యాగంగా గుర్తించిన సందర్భమది. ఒక ప్రధాని మారణహోమాన్ని ఒక వర్గం నెత్తిన పెట్టుకుని కుట్రదారుడిని వీరుని చేసిన సందర్భం శివరాసన్ అనే హంతకుడికి నివాళి. గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమ ర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమా జమంతా సమర్థించదు కదా! వీరు మైనారిటీ దేవుళ్లు. మొదటిరకం దేవుళ్లు వ్యవస్థ మీద తిరుగుబాటు దేవుళ్లు.
 ఒక ఉదాహరణ.
 గురువుగారు సిగరెట్లు కాల్చడం నేరం అని బోధించారు. మీకు గురువుగారి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా ప్రకటించాలి? గబగబా నాలుగు సిగరెట్లు కాల్చి, సిగరెట్లు కాల్చానని గురువుగారి ముందు బోర విరిచారు. ఇప్పుడేం చేస్తారు? పర్యవసానం కాదు, కేవలం ఆ చర్యే తన ‘తిరుగుబాటు’కి ఉపశమనం. ఈ నెగిటివ్ గుడుల లక్ష్యం అదే.
 మాయావతి, కుష్బూ, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్‌ల గుడులు కూడా ఒక వికారమే. శివరాసన్, బియంత్‌సింగ్, గాడ్సేల గుడులు వికారానికి ఆవలిగట్టు.
 కొందరికి దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచనల పర్య వసానం. మరికొందరికి తమ ఆలోచనలకు అద్దం పట్టని వ్యవస్థని నిర్మూలించినందుకు దేవుడు. ఏ దేవుడు మీకిష్టం?
 విశ్వాసానికి ఏది అంగీకరించడానికి యోగ్యమైన కొలమానం? నలుగురి నమ్మకాన్ని ఆకాశంలో నిలిపిన మెజారిటీ విలువా? పదిమంది కోపానికి కారణమయిన ఒక మైనారిటీ భావించే అన్యాయమా?
 శిష్ట సమాజానికి ఒక నియతి ఉంది. నలుగురితో చావు- అది అవాంఛనీయమైనా- అది పెళ్లి. ఒక్కడితో చావు- అది అతనికి సహేతుకమైనా- ప్రమాదకరమైన చావు. ఈ కొలబద్దతో చూస్తే గాంధీని చంపిన గాడ్సే నేరాన్ని‘పొరపాటు’ అని సరిపెట్టుకుని గుడి కట్టే సాక్షి మహరాజుల చర్య భయంకరమైన, ప్రమాదకరమైన అవినీతి. నీకు నచ్చకపోతే వేంకటేశ్వరస్వామికి దండం పెట్టకు. రజనీకాంత్‌కి గుళ్లో హారతి ఇవ్వకు. ఇబ్బంది లేదు. కాని సమాజం- అది నీకు సబబుగా కనిపించక పోయినా- తిరస్కరించిన హంతకుడిని ‘దేవుడి’ని చేసే హక్కు నీకులేదు. ఇది బియంత్‌సింగ్‌కీ వర్తిస్తుంది. శివ రాసన్‌కీ వర్తిస్తుంది. గాడ్సేకీ వర్తిస్తుంది. మా మిత్రుడి మాటల్లో ఇది న్యూరో- సోషియో డిజార్డర్. గుడి సంగతి తర్వాత- ముందు ఈ గుడి నిర్మాతలకి వైద్య సహాయం కావాలి.

మరిన్ని వార్తలు