నో ఆర్గ్యుమెంట్స్.. ఓన్లీ ఈ మెయిల్స్

15 Nov, 2014 00:24 IST|Sakshi
నో ఆర్గ్యుమెంట్స్.. ఓన్లీ ఈ మెయిల్స్

Relationships last long not because they're destined to last long.. relationships last long because two brave people made a choice.. to keep it, fight for it and to work for it..
 
‘హోప్ ట్రస్ట్’ సంస్థాపకులు రాజేశ్వరి లూథర్, రాహుల్ లూథర్ అనుబంధం కూడా ఇలాంటిదే! ఇద్దరూ భిన్న ధ్రువాలు! ఆమె ఢిల్లీలో పుట్టిపెరిగిన దక్షిణ భారతీయురాలు.. అతను వైజాగ్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉత్తర భారతీయుడు! ఆమెది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం.. అతను ఐఏఎస్ ఆఫీసర్ నరేంద్ర లూథర్ కొడుకు! . 

రాహుల్ మొదట్లో ఆల్కహాలిక్. ఆ వ్యసనం విడాకులకు దారితీసింది. కానీ చిన్న ‘హోప్’ వారిద్దరినీ  మళ్లీ ఒక్కటి చేసింది.  ఏ వ్యసనం  తమ మధ్య మనస్పర్థలకు కారణమైందో.. అదే వ్యసనంపై ఆ దంపతులు ఫైట్ చేస్తున్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన ఎందరినో.. మామూలు మనుషులను చేస్తున్న  ఆ జంట జీవనయానం..
 
 ప్లస్.. మైనస్
‘రాహుల్ వెరీ గుడ్ లిజనర్. ఏ భార్యకైనా కావాల్సిందే వినే భర్తేకదా’ అంటుంది రాజేశ్వరి నవ్వుతూ. ‘నాలో లేని క్వాలిటీస్‌ను తను భర్తీ చేస్తుంది’ అంటూ అర్థాంగికి అసలైన నిర్వచనం ఇచ్చాడు రాహుల్. ‘ఏ భార్యాభర్తకైనా అల్టిమేట్ గోల్ పేరెంటింగ్. నాకైతే నా పిల్లలే లోకం. వాళ్లకు సంబంధించి కొన్ని విషయాల్లో నేను ఆయనలా, ఆయన నాలా ప్రవర్తిస్తాం. అప్పుడే ఫ్యామిలీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది’ అంటుంది రాజేశ్వరి.
 
రాజేశ్వరిది పారామెడికల్ బ్యాక్‌గ్రౌండ్.. రాహుల్ చదివిన సబ్జెక్ట్స్ ఫిలాసఫీ, సైకాలజీ అండ్ మాస్టర్స్ ఇన్ ఇంగ్లిష్ లిటరేచర్.  ‘రాజేశ్వరి నాకు ఢిల్లీలో పరిచయం. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. తనూ అదే హాస్పిటల్‌లో పని చేసేది. అప్పుడు చూశాను. నచ్చింది.. ఛేజ్ చేశాను’ అని తమ ప్రేమకథను మొదలుపెట్టాడు రాహుల్.
 
పెళ్లి ప్రపోజల్ తెచ్చిందెవరు..?
‘నేనే, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ముందు మా పేరెంట్స్‌కి చెప్పాను’ అని చెప్పాడు రాహుల్. ‘వాళ్ల నాన్నగారు మా ఇంటికొచ్చారు. నాకప్పుడు 21 ఏళ్లు. అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకున్నాను. కానీ మామయ్య ‘ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే త్వరగా చేసుకోండి. ఎందుకంటే మావాడికిప్పుడు 30 ఏళ్లు’ అని చెప్పారు’ అంది రాజేశ్వరి. ‘అదొక్కటే కాదు ‘మావాడు బాగా తాగుతాడు.. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయానికి రండి తర్వాత నేను బ్లేమ్ కాదల్చుకోలేదు’ అని నా బలహీనతనూ వాళ్లకు చెప్పాడు నాన్న’ అన్నాడు రాహుల్. రాజేశ్వరి తనకున్న అమెరికా ప్రయారిటీని, రాహుల్‌కున్న బలహీనతను పక్కనపెట్టి ఆయన మంచితనానికి ఓటేసి అతనికి భార్య అయింది.

బలహీనత జయించింది..
రాహుల్ బలహీనత వాళ్ల దాంపత్యాన్ని ఆరేళ్లే నిలబెట్టింది. అప్పటికే వాళ్లకు ఓ పాప. రాజేశ్వరి కూతురుతో ఢిల్లీ వెళ్లిపోయింది. ఆమె ఒంటరి పోరాటానికి రాహుల్ తల్లిదండ్రులు మద్దతిచ్చారు. అందుకే రాజేశ్వరి అంటుంది ‘నిజంగా మా ఇన్‌లాస్ వెరీ మోడల్ పేరెంట్స్. హండ్రెడ్ పర్సెంట్ నాకే సపోర్ట్ ఇచ్చారు’అని. ‘ఇప్పటికీ మా అమ్మ ఏ విషయం అయినా తనతో షేర్ చేసుకుంటుంది. నా కన్నా తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది’ అంటాడు రాహుల్.

ఈ బంధం మళ్లీ ఎలా ముడివేసుకుంది?
‘విడాకుల జీవితాన్నీ కొన్నేళ్లు అనుభవించాం. ఆ టైమ్‌లో నేను అల్కహాల్ తీసుకునే అలవాటును మానే ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. రాజేశ్వరిని, పాపను చాలా మిస్ అయ్యాను. ఆ క్షణాలను మళ్లీ పొందాలనుకున్నాను’ రాహుల్. ‘గతం మళ్లీ రిపీట్ కాదనే నమ్మకంతో మళ్లీ కలిశాం..’  భర్త మాటను పూర్తిచేసింది రాజేశ్వరి.

‘హోప్’తో రీయూనియన్..
‘మా రీయూనియన్ ‘హోప్ ట్రస్ట్’అనే రిహాబిలిటేషన్ సెంటర్‌తో స్టార్ట్ అయింది. అప్పటిదాకా మా ఇద్దరి జీవితాలు, ఉద్యోగాలూ వేరు. ఈ రీహాబిలిటేషన్ పెట్టాలనే ఐడియా రాహుల్‌ది. మా ఇద్దరికీ సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా మేమిద్దరం కలిసి ఈ పనిచేయడం చాలా కష్టమే అయింది. ఇద్దరం ఈగో ఫీలయ్యేవాళ్లం. ఒకరి మాట ఇంకొకరు ఎందుకు వినాలని అనుకునేవారం. మళ్లీ మొదటి పొరపాటే జరుగుతుందేమోనని ఇద్దరం భయపడ్డాం. అప్పటికే బాబు కూడా పుట్టాడు. కుటుంబం ముఖ్యం అనుకున్నాం’ అని రాజేశ్వరి ఆనాటి సంకల్పాన్ని గుర్తు చేసుకుంది.

ఒక సందర్భంలో ఈ పనిని రాహుల్‌కే వదిలి తాను చక్కగా ఇంటిని చూసుకుంటాననే ప్రశాంత నిర్ణయానికి వచ్చేసింది రాజేశ్వరి. భార్య శక్తి, సామర్థ్యాలు తెలిసున్న రాహుల్ రిహాబిలిటేషన్‌ను ఆమె సహాయం లేకుండా నిర్వహించలేననుకున్నాడు. ఆమెను కన్విన్స్ చేశాడు.  మధ్యేమార్గం అనుసరించాలని భావించింది ఆ జంట. ‘ఎవరు ఏ విషయంలో స్ట్రాంగ్‌గా ఉంటారో బాగా ఆలోచించాను. మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో రాజేశ్వరి చాలా స్ట్రాంగ్. మార్కెటింగ్, ఆర్గనైజింగ్‌లో నేను స్ట్రాంగ్. అలా ఇద్దరం ఎవరి ఫీల్డ్స్‌ని వాళ్లం డివైడ్ చేసుకొని అందులో జోక్యం చేసుకోవద్దని డిసైడ్
 చేసుకున్నాం’ వివరించాడు రాహుల్.
 
నో ఆర్గ్యుమెంట్స్.. ఓన్లీ ఈ మెయిల్స్
‘ఇప్పటికీ పోట్లాడుకుంటాం. కానీ ఈగో హర్ట్ అయ్యేంత కాదు. ఏ విషయంలోనైనా కోపమొచ్చినా.. బాధనిపించినా వెంటనే రాహుల్‌కి ఈ మెయిల్స్ పెట్టేస్తా’ అంటుంది రాజేశ్వరి. ‘అందుకే నిరంతరం నా మెయిల్‌బాక్స్ చెక్ చేసుకుంటూ ఉంటా’ అంటాడు నవ్వుతూ రాహుల్. రిప్లయ్ ఉంటుందా అని అడిగితే ‘ఆ విషయంలో ఆయన చాలా స్లో. అయితే ఈవెనింగ్ ఇంటికొచ్చేటప్పుడు మాత్రం ఆయనలో చేంజ్ కనిపిస్తుంది. అది చాలు కదా నాకు’ రాజేశ్వరి. ‘ఇద్దరం ఒకరి స్పేస్‌ని ఒకరం గౌరవించుకుంటాం. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తే.. ఓ మూడు రోజులు ఏ టూర్‌కో వెళ్లిపోతా. తనూ అంతే. తన ఫ్రెండ్స్‌తో గడుపుతుంది. తనకు డాన్స్, సంగీతం అంటే ఇష్టం. నాకు నాటకాలంటే ఇష్టం. ఒకరికిష్టమైన పనిని ఇంకొకరు చేయాలని పట్టుబట్టం’ అంటాడు రాహుల్.

ముక్తాయింపు
కొన్నాళ్ల కిందట.. రాజేశ్వరిని వాళ్లమ్మాయి అడిగిందట.. ‘నువ్వూనాన్న పోట్లాడుకోవట్లేదు బోర్ కొడుతుంది. నువ్వు నాన్నలా మారిపోయావ్.. నాన్న నీలా మారిపోయాడు’ అందిట. అనుబంధానికి ఇంతకుమించిన అర్థమేముంటుంది..! సహచర్యానికి ఇంతకుమించిన పరమార్థం ఏముంటుంది..!
 
..:: సరస్వతి రమ
ఫొటోలు: సృజన్

మరిన్ని వార్తలు