కూచిపూడి నాకు బాగా ఇష్టమైన నృత్యం : నేహ

4 Jul, 2013 04:40 IST|Sakshi
కూచిపూడి నాకు బాగా ఇష్టమైన నృత్యం : నేహ
అమెరికాలో పుట్టి పెరిగిన నేహ కిదంబికి  భారతీయనృత్యకళలంటే ఎంతో అభిమానం. కూచిపూడి ఆమెకు బాగా ఇష్టమైన నృత్యం. నేహ తల్లి జ్యోతి లక్కరాజుకు నృత్యకారిణిగా మంచి పేరుంది. ఆమె కొరియోగ్రాఫర్ కూడా. ‘నాట్యాలయ’ కూచిపూడి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ (యుఎస్‌ఎ)కు జ్యోతి డెరైక్టర్. అయిదు సంవత్సరాల వయసు నుంచి అమ్మ  దగ్గర కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం ప్రారంభించింది నేహ. కాలిఫోర్నియాలోని రకరకాల ప్రాంతాలలో సోలో, గ్రూప్ ప్రదర్శనలు ఇచ్చింది. పోటీలలో బహుమతులు గెలుచుకుంది.
 
 ‘‘కూచిపూడి ఆంధ్రుల ఆత్మీయకళ కదా! అందుకే  కూచిపూడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాను’’ అంటున్న  నేహ ఇటీవల రవీంద్రభారతిలో ‘కూచిపూడి నృత్యాంజలి’ పేరుతో ఇచ్చిన నృత్యప్రదర్శనకు మంచి స్పందన లభించింది.
 
 నృత్యసాధన గురించి అడిగిన ప్రశ్నకు నేహ ఇలా జవాబు చెప్పింది: ‘‘కాలిఫోర్నియాలో నృత్యాలయ డ్యాన్స్ స్కూల్‌కు శని, ఆదివారాలు తప్పనిసరిగా వెళతాను. కూచిపూడికి సంబంధించి ఆడియో రికార్డింగ్‌లు స్కూల్ నుంచి తెచ్చుకొని మా అమ్మ జ్యోతికి ఇస్తాను. ఆమె భావార్థం, రసోత్పత్తి గురించి వివరిస్తుంది. నేను చేసే నృత్యంలో తప్పులను గుర్తించి మెళకువలు చెబుతుంది. వాటి గురించి శ్రద్ధగా వింటాను.’’
 
 నాట్యాలయ డ్యాన్స్ స్కూల్ సమర్పించిన నృత్యప్రదర్శనలలో నేహ కీలకపాత్ర పోషించింది. ఉమా మురళీకృష్ణలాంటి ప్రసిద్ధ కళాకారులతో కలిసి నృత్యప్రదర్శన ఇచ్చింది. కూచిపూడి నృత్యంలోనే కాకుండా వయొలిన్ వాయించడంలోనూ చక్కని ప్రతిభ ప్రదర్శిస్తోంది నేహ. 
 
 ‘‘నృత్యం అనేది నాలో భాగం అయిపోయింది’’ అంటున్న నేహ జీవితాంతం నృత్యానికి చేరువలో ఉండాలనుకుంటోంది. అమ్మ అడుగుజాడలలో నడవాలనుకుంటోంది.
 కుపర్‌టినో (కాలిఫోర్నియా) లోని మోంటావిస్టా స్కూలులో చదువుతున్న నేహ భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటుంది.
 
 ‘‘చదువు పూర్తయ్యే లోపల ఒక మంచి కోరియోగ్రాఫర్‌ను అవుతాను. వైద్యవిద్య చదివి డాక్టర్‌గా  ప్రజలకు సేవచేస్తాను’’ అంటున్న నేహ కోరిక ఫలించాలని కోరుకుందాం.
 
 - కోన సుధాకర్‌రెడ్డి
 
మరిన్ని వార్తలు