జాతీయ పక్షాల్లో ‘ప్రాంతీయ’ బెంగ

1 Apr, 2014 23:39 IST|Sakshi
జాతీయ పక్షాల్లో ‘ప్రాంతీయ’ బెంగ

విశ్లేషణ
 
 సరిగ్గా తొలి విడత ఎన్నికలకు వారం ముందు కాంగ్రెస్ ముందుకు తెచ్చిన సెక్యులర్ ఫ్రంట్ ప్రతిపాదనతో బీజేపీ ఉలిక్కిపడింది. ఆ ఉలికిపాటు కాంగ్రెస్‌లాగే బీజేపీ సైతం గెలుపు పట్ల ధీమాగా లేదని స్పష్టం చేస్తోంది. ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్స్ అనే వాస్తవాన్ని ఈ చర్య, ప్రతిచర్యలతో కాంగ్రెస్, బీజేపీలు అంగీకరించక తప్పలేదు.
 
 
 
 ‘గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకోడం’ అని వినడమేగానీ చూడలేదు. ఆ ముచ్చటను బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తీర్చారు. దేశ రక్షణను సైతం మరచి  కాంగ్రెస్ రక్షణలో మునిగిన రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఇలా ‘సెక్యులర్ ఫ్రంట్’ అన్నారో లేదో జైట్లీ భుజాలు తడుముకున్నారు. ‘థర్డ్ ఫ్రంట్ పీడ కల’అని కలవరించసాగారు. అంతకుముందే జాతీ య ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని ‘కాంగ్రెస్ ఓటమి ఒప్పుకోలు’  అని ఆదివారం రాత్రి  విందు భోజనంగా వడ్డించింది. కేరళ ఎన్నికల బరిలో ప్రత్యర్థులైన కమ్యూనిస్టులను తిట్టాల్సిన తిట ్లన్నీ తిట్టి మరీ ఆంటోనీ బయటకు తీసిన ‘సెక్యులర్ ఫ్రంట్’ను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సహజంగానే దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎంతగా తిట్టిపోస్తున్నా, థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నా... ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే ముప్పును నివారించడానికి వామపక్షాలు కాంగ్రెస్‌తో చేతులు కలపక తప్పదని ఆంటోనీ మాటల సారాంశం. కాంగ్రెస్ సహా బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి సెక్యులర్ ఫ్రంట్‌గా అధికారం నెరపవచ్చన్న ఎర.

 1996 కాదు 2014

 పోలింగ్‌కు సరిగ్గా వారం ముందు అంటే రాజకీయ పార్టీలు ఆత్మవంచనను కట్టిపెట్టాల్సిన సమయం. ఆంటోనీ అదే చేశారు. ఈ ఎన్నికల్లో తమది ఎదురీతేనని ముందే తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల తదుపరి ఆడాల్సిన ‘ఆట’కు ఎప్పుడో సిద్ధమైంది. సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్  నుంచి బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ వరకు ఎన్నికల తదుపరి థర్డ్ ఫ్రంట్ గురించి చర్చిస్తుండగా... దాన్ని వదిలి కాంగ్రెస్ ‘సెక్యులర్ ఫ్రంట్’ అనడం... కొత్త సీసాలో పాత సారాను అందించే ప్రయత్నమేనా? కాంగ్రెస్ ప్రస్తావించని థర్డ్‌ఫ్రంట్ ‘పీడకల’ను గురించి కలవరిస్తూ జైట్లీ ఆ పార్టీ 1996ను పునరావృతం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. 1996 ఎన్నికలకు ముందే  ‘నేషనల్ ఫ్రంట్’ ఉంది. ఎన్నికల తర్వాత అది వామపక్ష ఫ్రంట్‌తో కలసి ‘యునెటైడ్ ఫ్రంట్’గా మారింది. కాంగ్రెస్ దానికి బయటి నుంచి మద్దతునిచ్చి ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సైతం నిలవలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించింది.

సీపీఎమ్ అగ్రనేత, బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును ఏకగ్రీవంగా యునెటైడ్ ఫ్రంట్ ప్రధానిగా  నిర్ణయించినా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కారత్ ‘చారిత్రక తప్పిదం’ చేసి మోకాలడ్డారు. కాంగ్రెస్ యథేచ్ఛగా యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంతో ఆటలాడే  అవకాశాన్ని కల్పించారు. అదే అదను కాంగ్రెస్‌గా వరుసగా దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ల ప్రభుత్వాలను నిలిపి, కూలదోసి 1998 మధ్యంతర ఎన్నికలకు పరుగులు తీసింది. ఏం బావుకుంది? 1998లో ఒక్క సీటు ఎక్కువ సంపాదించి (140 + 1), కిక్కురుమనకుండా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూచోవాల్సి వచ్చింది. బీజేపీ 21 సీట్లు పెంచుకోగా (161 + 21 = 182). ఎన్‌డీఏగా బీజేపీ కూటమి 254 స్థానాలతో పూర్తి కాలం సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలిగింది. ఆ చేదు అనుభవం తర్వాత కూడా కాంగ్రెస్ మళ్లీ అదే ఆట ఆడాలనుకుంటోందా? అవుననే అనుకున్నా, దాన్ని చూసి జైట్లీ పీడకలంటూ ఎందుకు బెదిరిపోతున్నట్టు? అదీ కూడా నాడు యునెటైడ్ ఫ్రంట్‌కు వెన్నెముకగా నిలిచిన వామపక్షాలు నేడు దయనీయమైన స్థితిలో ఉండగా ఎందుకీ భుజాల తడుములాట?

 బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకటే పీడకల

తిరిగి అధికారంలోకి రానున్నామంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆర్భాటమంతా మేకపోతు గాంభీర్యమేనని అందరికీ తెలిసిందే. కాకపోతే జైట్లీ పీడకల బీజేపీ ప్రదర్శిస్తున్న గెలుపు ధీమా గుట్టును బయటపెట్టింది. ఆ పార్టీ అదే పనిగా ఊదరగొడుతున్నట్టుగా మోడీ గాలి దేశాన్ని చుట్టేయడం లేదు. బీజేపీకి ఒంటరిగా కాదుగదా, ఎన్‌డీఏకు కూడా 1998లోలాగా ఓటర్లు 254 సీట్లను కట్టబెట్టేయబోవడం లేదు. ఆ విషయం బాగా వారికే తెలుసు. కాబట్టే యూపీఏ అవినీతిని ప్రధాన అస్త్రం చేసుకున్న ఆ పార్టీ కర్ణాటకలో బీఎస్ యడ్యూరప్పకు తిరిగి పార్టీ తీర్థం ఇచ్చింది. ‘చీపురు దెబ్బ’కన్నా జంకక బళ్లారి, కడగ్, కొప్పల్, చిత్రదుర్గ జిల్లాల్లో ఆ పార్టీ తలరాతను మార్చేయగల శ్రీరాములును (బీఎస్‌ఆర్ కాంగ్రెస్) అక్కున చేర్చుకుంది.  బెంగళూరు పబ్ కీచక పర్వం ఫేమ్, శ్రీరామ్‌సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ హిందూ ఓట్లను చీల్చి అసలుకే ఎసరు పెడతారన్న భయంతోనే కర్ణాటక బీజేపీ అతనికి పార్టీ తీర్థం ఇచ్చింది. సుపరిపాలన, అభివృద్ధి నినాదాలతో దేశవ్యాప్తంగా పట్టణ ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఖంగుతినిపించిన కేజ్రీవాల్ తలనొప్పి కొంత ఉపశమించినా, ‘ఆప్’ సంధించే అవినీతి అస్త్రాలు పంటి కింది పోటులా పరిణమించాయి. ఈ స్థితిలో జాతీయ నాయకత్వం ముతాలిక్‌ను ‘త్యాగం’ చేయక తప్పదని కర్ణాటక బీజేపీకి నచ్చజెప్పుకోక తప్పింది కాదు. దాన్ని బీజేపీ యువ నాయకత్వం జాతీయ నాయకత్వంపై సాధించిన విజయంగా అభివర్ణించడం మన మీడియా సృజనాత్మక కాల్పనికతా శక్తికి నిదర్శనం. ముతాలిక్ ప్రహసనం తర్వాత కూడా ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలున్న సబీర్ ఆలీని పార్టీలో చేర్చుకుని, సాగనంపాల్సిన దుస్థితిని ఆ పార్టీ ఏరికోరి తెచ్చుకోవాల్సి వచ్చిందంటే ఊరికే రాలేదు. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వం వల్ల బీజేపీ మెరుగుపడిందే తప్ప, 1996 నాటి స్థితి నుంచి ఎంతో దూరం ముందుకు సాగింది లేదు. ఇక ఎన్‌డీఏ పరిస్థితి 1998కు చాలా దూరంలో ఉంది. నాడు ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, బీజేడీ నేత నవీన్‌పట్నాయక్‌లు నేడు ఎన్‌డీఏలో లేరు. వారేగాక సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం, బహుజన  సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఎవరికి వారే ఎన్నికల తర్వాత రెండు ప్రధాన కూటముల్లో ఎవరికీ మెజారిటీ రాని స్థితినే అంచనా వేస్తున్నారు.

మరో ప్రధాని పోటీదారు బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్‌కుమార్ బీజేపీని వీడి ఆయనకు  ఆయనే జాతీయ రాజకీయాల నుంచి ప్రస్తుతానికి తెరమరుగయ్యారు. రంగంలో ఉన్నవారంతా ఎవరికివారేఅవకాశం వస్తే ప్రధాని గద్దెనెక్కే అవకాశం కోసం వేచి చూస్తున్నవారే. అందుకే ‘వలసల’ కోసం బీజేపీ అంగలార్చడం, కాంగ్రెస్ సెక్యులర్ ఫ్రంట్ జపం. అవి రెండూ ప్రధాన జాతీయ పార్టీలను వేధిస్తున్న ఒకే పీడ కలకు అద్దం పడతాయి. ఇంతవరకు ప్రధాన జాతీయ పక్షాలకు తోకలుగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలు రేపటి ఎన్నికల తదుపరి కింగ్‌మేకర్స్‌గా మారనున్నాయనే చేదు వాస్తవమే అది.
 
సెక్యులర్ ఫ్రంట్ పాచిక పారేనా?

ఇంతకూ కాంగ్రెస్ మాట్లాడుతున్న సెక్యులర్ ఫ్రంట్‌కు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు చెబుతున్న థర్డ్‌ఫ్రంట్‌కు తేడా ఏమైనా ఉందా? 1996కు భిన్నంగా కాంగ్రెస్ బీజేపీయేతర ఫ్రంట్‌లో భాగస్వామినవుతానని సూచిస్తోంది. ఒడ్డున కూచోవడం గాక, ప్రభుత్వంలో చేరి ప్రధాని పదవిని ఇతరులకు అప్పగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఆ అంశమే బీజేపీకి కలవరాన్ని కలిగిస్తోంది. కాంగ్రెస్‌లాగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించడానికి అది ప్రధాని పదవిని ‘త్యాగం’ చేయగల స్థితిలో లేదు. కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రాంతీయ నేతలందరిలోనూ తహతహను రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.

కాకపోతే ఒక్కరికే అవకాశం ఉండటమే కాంగ్రెస్ దురదృష్టం. ఇంతటి ‘బ్రహ్మాస్త్రాన్ని’ పొదిలో ఉంచుకొని ప్రయోగించడానికి కాంగ్రెస్ ఎందుకు ఇంత ఆలస్యం చేసినట్టు? కాంగ్రెస్ పాచిక ఎంత వరకు పారుతుందో లేదోగానీ దాన్ని ప్రయోగించడానికి ఇంతకు మించిన మంచి ముహూర్తం మరొకటి ఉండదు. ముందే సెక్యులర్ ఫ్రంట్ ప్రతిపాదనను తెచ్చి... ప్రధాని పదవి కోసం గోడ మీద వేచి చూస్తున్న నేతలు ఎటో ఒక వైపు దూకేలా చేయడం కంటే ఎన్నికల తర్వాతికి ఆ కుమ్ములాటను వాయిదా వేయటం కాంగ్రెస్‌కు లాభం. బీజేపీకి నష్టం. ఎన్నికలకు ముందు బెట్టు చేస్తున్న వామపక్షాలు ఎన్నికల తదుపరి బీజేపీ బూచి భూతద్దంలో కనిపిస్తుంటే ఏ ములాయంసింగో చొరవచేసి సెక్యులర్ ఫ్రంట్‌కు ఒప్పించకపోరని కాంగ్రెస్ ధీమా. ఎన్నికల ఫలితాలు నిజంగానే కాంగ్రెస్ ఊహిస్తున్న పరిస్థితిని సృష్టిస్తే కాంగ్రెస్ సెక్యులర్ ఫ్రంట్ ఆటకు తెరలేస్తుందనే అనుకోవాలి.
 
 పిళ్లా వెంకటేశ్వరరావు
 

>
మరిన్ని వార్తలు