లెఫ్ట్ విలీనంతోనే ఫ్రంట్‌కు మనుగడ

8 Apr, 2014 01:49 IST|Sakshi
లెఫ్ట్ విలీనంతోనే ఫ్రంట్‌కు మనుగడ

విశ్లేషణ
 
అసలు లోపం ఎక్కడుంది? పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్న తరువాత కూడా, ఉభయులూ విలీనం కావడానికి ఎలాంటి విభేదాలు  అడ్డు వస్తున్నాయి? ఇది ప్రజలకూ మేధావులకే కాదు, ఉభయ పార్టీల కార్యకర్తలకు సయితం అంతుపట్టదు.
 
 ‘పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు మనం ఒక సత్యాన్ని వెల్లడించాలి. మీది సాయుధమై ఉన్న రాజ్యశక్తి. దానిని మీరు కష్టజీవులైన శ్రామిక వర్గం మీద ఎక్కుపెట్టారు. కానీ, మేం మాత్రం మీకు వ్యతిరేకంగా సాధ్యమైన చోటల్లా శాంతియుత పద్ధతులతోనే పోరాడుతాం. అవసరమైనప్పుడు మేమూ సాయుధులమై పోరాడక తప్పదు.’
 
 ఈ మాటలు అన్నదెవరో, అవి అందిస్తున్న సందేశం ఏమిటో ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన భారత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకీ, దానితో పాటే ఎదుగుతూ వచ్చిన  ఇతర పక్షాలకూ (సోషలిస్టులు, ఫార్వార్డ్ బ్లాక్ వంటివి)తెలియనిది కాదు. ఇంటర్నేషనల్ వర్కింగ్‌మెన్స్ అసోసియేషన్ (1864) ప్రారంభ సభతో పాటు, ప్రపంచ వామపక్ష రాజకీయ ప్రతినిధులకు పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేసినప్పుడు  కారల్‌మార్క్స్ అన్నమాటలివి.

 స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా భారతదేశంలో  పెట్టుబడిదారీ-భూస్వామ్య వర్గ పాలనా వ్యవస్థ కొనసాగింది. దేశ ప్రజల ఉమ్మడి సంపదనూ, వనరులనూ యథేచ్ఛగా దోచుకునేందుకు ధనిక వర్గానికీ, దేశ విదేశ కార్పొరేట్ సంస్థలకూ ద్వారాలు తెరిచి పెడుతోంది. కానీ భారత ప్రజాతంత్ర విప్లవ దశనూ, దిశనూ స్పష్టం చేయడంలో కమ్యూనిస్టులు సహా వామపక్షాలు నేటికీ విఫలమవుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ అవశేషాలను నిర్మూలించగలిగే వ్యూహ రచన చేయడంలోనూ అలాంటి వైఫల్యం కనిపిస్తుంది. ఈ వాతావరణం వల్లనే ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య శక్తులను  నిర్దిష్ట ప్రణాళిక ప్రాతిపదికగా సమీకరించి తృతీయ ఐక్య సంఘటనను (థర్డ్ ఫ్రంట్) అందించలేకపోయారు.

 చిందరవందరైన కల

 1960ల వరకు ఆంధ్రప్రదేశ్‌లోనూ, దేశ వ్యాప్తంగానూ కమ్యూనిస్టు పార్టీ  ఐక్యంగా, పటిష్టంగా పని చేసింది. రాజకీయంగా, సాంస్కృతికంగా అనూ హ్య శక్తిగా అవతరించింది. తరువాత రెండుగా, ఆపై ‘కణ విభజన’ మాది రిగా పది పన్నెండు ముక్కలుగా విడిపోయింది. ఇదే ఆ వైఫల్యానికి ప్రధాన కారణం. అంతేకాదు, గడచిన 55 ఏళ్లలో  కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని కూడా (త్రిపుర ఇందుకు మినహాయింపు) వాటిని కమ్యూనిస్టు పార్టీ  సంఘటితం చేసుకోలేకపోయింది. దీనికి తోడు క్రమంగా ధనికవర్గ కుహనా ‘ప్రజాస్వామ్య’ చట్రంలో బందీ అయిపోవడం వల్ల, పూర్వపు శ్రామిక వర్గ పార్టీ మిలిటెన్సీ లక్షణం కూడా సడలిపోయింది. పేద ప్రజల భూ సమస్య పరిష్కారంలోనూ, విద్యా ఉపాధిలోనూ కుహనా వ్యవస్థ అనుమతించిన మేరకే ఎన్నో ఆదర్శవంతమైన సంస్కరణలకు  అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు నాంది పలకడం దీని ఫలితమే. ఈక్రమంలోనే కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పదవులలోకి వచ్చిన కమ్యూనిస్టు-మార్క్సిస్టు పార్టీలు విధానాల పరంగా, ప్రవర్తన పరంగా ఆ వ్యవస్థ చట్రం నుంచి బయటపడలేకపోయాయి. దీనితోనే, ఎంత వామపక్ష ‘బ్రాండ్’ ఇమేజీ ఉన్నప్పటికీ  వీటి పట్ల ప్రజలలో, శ్రేణులలో ఉన్న పలుకుబడి మసకబారక తప్పలేదు. చివరికి కమ్యూనిస్టేతర వామపక్ష ప్రజాతంత్ర శక్తుల మధ్య పరస్పర విమర్శలు, అసహనం చోటు చేసుకున్నాయి.
 
ఉమ్మడి పార్టీ చీలికలో భాగంగా మావోయిస్టు పార్టీ దూసుకొచ్చింది. మిగిలిన ఏకోదరులకు భిన్నంగా మిలిటెన్సీ మార్గంలో సాగిపోతోంది. రాజ్యశక్తితో తలపడుతూ, తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ వెళ్లగలిగే శక్తిగా రూపొందింది. విధానాలూ, విభేదాల పేరిట చీలకలూ పేలికలూ అయిపోయిన ఈ ముక్కలన్నీ ఏకం కావడానికి ఎన్నాళ్లు, నిజానికి ఎన్నేళ్లు పడుతుందో వాటికే తెలియని స్థితి. ఈ విభిన్న శాఖల మధ్యనే ‘కోవర్టులు’ పేరిట గొంతులు కోసుకుంటున్న దుస్థితి.

 ఈ గందరగోళం మధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పేరిట నిర్వహిస్తున్న కుహనా ఎన్నికలలో రాజకీయ పార్టీల పొత్తులు కూడా ప్రహసనప్రాయంగా మారిపోయాయి.  బహుళజాతి సంస్థలకూ, బడా గుత్తవర్గాలకూ దాసోహమనడంలో పోటీ పడుతున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నట్టు ఇతర పక్షాలు వీటిలో ఒకదానితో అంటకాగడానికి ఉబలాటపడుతున్నాయి. ఈ సమయంలో, కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం, బడుగులూ మైనారిటీల రక్షణ కోసం  కాంగ్రెసేతర, బీజేపీయేతర తృతీయ ఫ్రంట్‌ను నిర్మించడం అనివార్య బాధ్యతగా వామపక్షాలు భావించాలి.
 విలీనమై తీరాలి

 ఈ బాధ్యత కోసం మొదటి మెట్టుగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విలీనమై తీరాలి. ఇదొక చారిత్రక కర్తవ్యమని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గుర్తించాలి. ఇవి పట్టుదలకు పోయి సమీక్షకూ, ఆత్మవిమర్శకూ దూరమవుతున్నాయి. అసలు లోపం ఎక్కడుంది? పార్లమెంటరీ వ్యవస్థను ఎంచుకున్న తరువాత కూడా, ఉభయులూ విలీనం కావడానికి ఎలాంటి విభేదాలు అడ్డు వస్తున్నాయి? ఇది ప్రజలకూ మేధావులకే కాదు, ఉభయ పార్టీల కార్యకర్తలకు సయితం అంతుపట్టదు. ఆ విభేదాలు రాజకీయ సంబంధమైనవా? వ్యక్తుల స్థాయిలో నాయకత్వాల మధ్య తగాదాలా? మళ్లీ ఏకైక పార్టీగా జాతీయస్థాయిలో అవతరిస్తే ప్రస్తుతం ఉన్న నాయకత్వాలూ, స్థిరపడిన పదవులూ కోల్పోవలసి వస్తుందన్న బెంగా? వీటిలో ఏది ప్రబలమైన కారణమో ఉభయ పక్షాలూ నిజాయితీతో క్యాడర్‌కూ, శ్రేయోభిలాషులకూ, సానుభూతిపరులకూ, ప్రజా బాహుళ్యానికీ విశదీకరించవలసిన సమయం వచ్చింది. సోవియెట్ విప్లవ రథసారథి, సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నిర్మాత లెనిన్ సహితం అంతిమ విప్లవానికి ముందు ‘డ్యూమా’ (రష్యన్ పార్లమెంట్)ను దోపిడీ వర్గాలనూ, విధానాలనూ ఎండగట్టడానికి వినియోగిచుకుంటూనే అవసరమైతే అంతిమ పోరాటానికి పార్టీ ‘అజ్ఞాత క్యాడర్’ను (సెమీలీగల్) కూడా నిర్మించుకున్నాడు. నేడు ఇండియాలో కూడా బూటకపు ప్రజాస్వామ్యానికీ పెట్టుబడి వ్యవస్థకూ ప్రత్యక్ష, పరోక్ష ప్రాతినిధ్య పక్షాలుగా నిలిచిన కాంగ్రెస్, బీజేపీ రెక్కలు కత్తిరించాలన్నా, ఈ రెండింటితో నిమిత్తం లేని సెక్యులర్ శక్తిగా మూడవ కూటమి అవతరించి నిలదొక్కుకోవాలన్నా సీపీఐ-సీపీఎం తక్షణం విలీనమై, దూసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో దురదృష్టకరమైన పరిణామం ఏమిటంటే- రేపటి సాధారణ ఎన్నికల పూర్వరంగంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం పడుతున్న పాట్లు. ఆ పార్టీలు ప్రజాభిమానానికి దూరంగా ఉన్నాయని చెప్పడానికి ఇది చాలు. పైగా, పదవి కోసం తెలుగు జాతిని చీల్చడానికి ఉద్యమించిన దొరల పార్టీకీ, కాంగ్రెస్‌కీ  మధ్య సీట్ల సర్దుబాటు కోసం మధ్యవర్తిత్వం వహించడానికి ఒక వామపక్షం గజ్జె కట్టడం హాస్యాస్పదం! వేరొక వామపక్షము అదే ‘దొరల’ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధమయింది.
 
విభజన మూలం అక్కడే

 ఉభయ కమ్యూనిస్టు పార్టీల దిగజారుడు రాజకీయ వ్యూహాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పునాదులు పడినాయని గుర్తించాలి. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట లక్ష్యం - తెలంగాణలో దొరల, భూస్వాముల పెత్తనాన్నీ, నిజాం నిరంకుశ పాలననూ ఏకకాలంలో అంతమొందించి తెలంగాణ ప్రజలకు శాశ్వత విమోచన కల్గించడం. యావత్తు తెలుగు జాతిని ఒకే భాషా రాష్ట్రంలో సమీకరించి, స్థిరపరచటం కూడా. ఇప్పుడు ఈ లక్ష్యానికి చేజేతులా తూట్లు పొడిచే అవకాశాలను ఇతరేతర శక్తులకు కల్పించి పెట్టింది ఉభయ కమ్యూనిస్టుల అనైక్యతేనని విస్మరించరాదు. ఈ రెండు పక్షాల పూర్వపు చైతన్యం చెక్కు చెదరకుండా ఉండి ఉంటే, వేర్పాటుశక్తులు విభజనకు సాహసించేవీ కాదు! ఇది ఉభయ కమ్యూనిస్టు పక్షాలకు పరీక్షా సమయం, సమీక్షించుకునే సమయం! కమ్యూనిస్టు లెప్పుడూ తమకు అనుకూల సమయాల్లో తప్పుటడుగులు వేస్తారు. తమకు ప్రతికూల సమయంలో, నిర్ణయాలు చేసినప్పుడు తప్పులు చేస్తారన్న నానుడిని వారు రూపుమాపుకునే శుభఘడియ కోసం వేచిచూద్దాం.
 
 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)
 

మరిన్ని వార్తలు