కామెడీ ట్రెండ్ సెట్టర్స్ ...

15 Sep, 2014 00:25 IST|Sakshi
కామెడీ ట్రెండ్ సెట్టర్స్ ...

వారు కూర్చోరు, ప్రేక్షకుల్ని తిన్నగా కూర్చోనివ్వరు. స్టాండప్ అని ఎవరో ఆదేశించినట్టు నిలుచునే ఉంటారు. పంచ్‌లు పేలుస్తూ పకపకలు, జోకులతో నవ్వులు కురిపిస్తారు. వాళ్ల పేరే స్టాండప్ కమెడియన్స్. పని ఒత్తిడికి చెక్ చెప్పే ‘రెమెడి’యన్స్. నవ్వు నాలుగు కాలాలు ‘నిలిచే’ ఉంటుందంటూ.. ఇప్పుడు సిటీలో సరికొత్త హాస్య విందుకు తెరతీస్తున్న కామెడీ ట్రెండ్ సెట్టర్స్ వీరు.
..:: ఎస్.సత్యబాబు
 
టీవీ ప్రోగ్రామ్స్ చూసేవారికి బాగా పరిచయమున్న అంశమే ఇది. ముఖ్యంగా హిందీ చానల్స్ చూసేవారికైతే కొట్టిన పిండి. ఆడియన్స్‌తో ప్రత్యక్షంగా సంభాషిస్తూ వేదిక మీద లేదా ఆడియన్స్ మధ్యలో నిలబడి నవ్వించే పద్ధతినే స్టాండప్ కామెడీగా, అలాంటి కామెడీని పండించేవారిని కామిక్‌లుగా పిలుస్తారు. కథలు అల్లడం, జోక్స్ గుప్పించడం, సింగిల్  లైన్ పంచ్‌లు విసరడం, మేజిక్ ట్రిక్స్ ప్లే చేయడం.. ఒకటనేమిటి ? ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఈ కామిక్స్ చేయనిదంటూ ఉండదు. ఇప్పుడు సిటీలో కాఫీ షాప్ నుంచి కార్పొరేట్ ఆఫీసుల దాకా, గ్యాలరీల నుంచి క్యాంపస్‌ల దాకా కాదేదీ కామెడీకి అనర్హం అంటూ వారు సందడి సృష్టిస్తున్నారు.
 
వార్ టు హుషార్..
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికులు విరామ సమయంలో పంచుకున్న వినోదమే ఈ హాస్య వల్లరికి మూలం. యుద్ధం నుంచి వచ్చాక కూడా బ్రిటన్‌లోని మ్యూజిక్ హాల్స్‌లో వీరు ఈ స్టాండప్ కామెడీని పండించారని, అలా అలా అది ప్రపంచవ్యాప్తం అయిందని అంటారు. ఏమైతేనేం.. ఇప్పుడు ఈ తరహా స్టాండప్ కామిక్‌లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్ జిమ్‌క్యారీ సైతం తన కెరీర్‌ను స్టాండప్ కామెడీతోనే స్టార్ట్ చేశాడు. కెనడాకు చెందిన రస్సెల్ పీటర్స్ వంటివారు ఈ తరహా కామెడీ షోస్‌తో బాగా పాపులర్ అయ్యారు. మన  ఇండియాలో వీర్‌దాస్, నితిన్ గుప్తా వంటివారు బాగా ఫేమస్ కాగా దాదాపు 50 మంది ప్రొఫెషనల్ కమెడియన్‌లుగా ఉన్నారు. నగరంలో పుంజుకుంటున్న ఈ సోలో ‘షో’ను హాబీగా  15 మంది, ఫుల్‌టైమ్ కెరీర్‌గా మలచుకున్నవారు అరడజను మంది వరకూ ఉన్నారు.
 
క్లాప్.. స్టార్టప్..
సిటీలో ఈ స్టాండప్ కామెడీ షోస్‌కి క్లాప్ కొట్టింది రాజశేఖర్. గతంలో ప్రైవేట్ ఉద్యోగి. ఓ పబ్లిక్ స్పీకింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన ఆయన.. అదే ఆత్మవిశ్వాసంతో కామెడీ షోలకు శ్రీకారం చుట్టారు. ‘అప్పట్లో మేం పేరుపేరునా పిలిచినా మా షోలకు 10 మంది రావడం గగనమయ్యేది. ఇప్పుడు టిక్కెట్లు కొనుక్కుని మరీ వస్తున్నారు’ అంటూ స్టాండప్ కామెడీకి పెరుగుతున్న ఆదరణను వివరించారు రాజశేఖర్.
 
ఆద్యంతం.. నవ్వించే పంతం..
‘రిటైర్ అవుతున్నానని నాన్నగారు విచారంగా ఉంటే అమ్మ  ఆనందంగా ఉంది. ఏమ్మా నాన్న ఇక ఇంటిపట్టునే ఉంటారనా నీ ఆనందం? అని అడిగిన కొడుక్కి.. వంట బాధ తప్పుతుందనంటూ సమాధానం ఇచ్చింది’ ఓ అధికారి పదవి విరమణ సభలో స్టాండప్ కామెడీ పేల్చిన బుల్లి టపాసు ఇది. ఇలాంటి మతాబులెన్నో ఉంటాయి. ‘చాలా వరకూ రోజువారీ జీవితంలో అనుభవాలనే అంశాలుగా ఎంచుకుంటాం. అవయితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతార’ని అంటారు రాజశేఖర్. సినిమాలో హాస్యనటులకు ఉన్నట్టు కంటెంట్, ప్రిపరేషన్స్, కట్స్, టేక్స్ వంటివేమీ ఉండవు.
 
అరగంట, గంటపాటు జరిగే షోలో ఫస్ట్ సెకన్ నుంచే నవ్వించాల్సి ఉంటుంది. కంటిన్యూగా జోక్స్ పేలుస్తుండాలి. ఒక జోక్ తుస్సుమందనుకో ప్రెజర్ పెరుగుతుంది. వరుసగా రెండు మూడు జోకులు తేలిపోయాయంటే దాన్ని అధిగమించి ప్రేక్షకుల్ని తిరిగి లాఫింగ్ లైన్‌లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఆడిటోరియాల్లో నవ్వించడం కన్నా కార్పొరేట్ కార్యాలయాల్లో నవ్వించడం కష్టం అంటారు రాజశేఖర్. ఎందుకంటే అక్కడంతా డ్యూటీ ఎట్మాస్పియర్ ఉంటుంది. మేనేజర్ నవ్వితేనే నవ్వుతారు. లేకపోతే ఇదీ జోకేనా అన్నట్టు చూస్తారు’ అని చెప్పారాయన నవ్వుతూ.
 
కెరీర్.. సూపర్..
గంటకు రూ.25వేల దగ్గర్నుంచి  నుంచి రూ.5 లక్షల దాకా చెల్లిస్తూ ప్రస్తుతం పలు సంస్థలు, హోటల్స్ ఎక్కడెక్కడి నుంచో స్టాండప్ కమెడియన్స్‌ని హైదరాబాద్ తీసుకొచ్చి షో ఇప్పిస్తున్నాయి ‘నేనీ కెరీర్ ఎంచుకున్నప్పుడు అందరూ విచిత్రంగా చూశారు. అయితే ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మన సిటీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నైలో కూడా షోస్ ఇస్తున్నాను. ఈ ప్రొఫెషన్‌లోకి మరింతగా యూత్‌ని ఆకర్షించడానికి ఫన్సీ సైడ్ అప్ సంస్థను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా గ్రూప్‌లో ఐదుగురున్నారు.
 
టీసీఎస్‌లో జాబ్ చేస్తున్న రోహిత్‌స్వైన్, నేషనల్ లెవల్‌లో పబ్లిక్ స్పీకింగ్ చాంపియన్ అవినాష్ అగర్వాల్, డెలాయిట్ ఉద్యోగి ఉమేష్ సోమాని, సాయికిరణ్‌లతో గ్రూప్‌గా, ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం’ అంటూ వివరించారు రాజశేఖర్. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైనార్ట్స్‌లో నెలకొక భారీ షో, మాదాపూర్‌లో రెడ్ పాయింట్ కెఫేలో ప్రతి గురువారం ‘స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్’ షో నిర్వహిస్తున్నారు. ‘ప్రతి గురువారం కామెడీ చేయడానికి కొత్త వారికి చాన్సిస్తున్నాం. వీక్లీ షోస్ టిక్కెట్ ద్వారా, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లామకాన్ వంటి చోట్ల చేసే షోస్‌కి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాం’అని రాజశేఖర్ చెప్పారు.

మరిన్ని వార్తలు