బంధాన్ని బలపరిచే మూడు ప్రశ్నలు

9 Nov, 2018 11:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మీరెప్పుడైనా రిలేషన్‌షిప్‌లో చెప్పకూడని విషయం చెప్పి చిక్కుల్లో పడ్డారా ? ఎందుకు ఈ విషయం చెప్పానా అని తర్వాత బాధపడ్డారా ? ఏయే విషయాలు ఎప్పుడెప్పుడు చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారా ? అయితే ఈ సమస్యకు 'మూడు ప్రశ్నల ట్రిక్‌' చ​క్కగా ఉపయోగపడుతుందని, బంధాలను బలపరచడంలో ఇది కీలక పాత్ర పోషి​స్తుందని నిపుణులు అంటున్నారు. 

ఈ ట్రిక్‌ను పరిచయం చేసింది ఎవరు ?
ప్రముఖ నటుడు, రచయిత క్రెయిగ్‌ ఫెర్గూసన్‌ ఈ 'మూడు ప్రశ్నల ట్రిక్‌' ను ప్రపంచానికి పరిచయం చేశారు. భాగస్వామితో మాట్లాడే సమయంలో ఈ మూడు ప్రశ్నలను మనసులో స్మరించుకోవడం ద్వారా అనవసరంగా తలెత్తే మనస్పర్థల నుంచి దూరంగా ఉండవచ్చన్నది ఆయన ఆలోచన. ఈ ట్రిక్‌ను పాటించడం వల్ల మీ ఆత్మీయులతో అర్థవంతమైన సంభాషణ జరపవచ్చని ఆయన అన్నారు. అటువంటి మృదు సంభాషణలు బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఆయన స్పష్టం చేశారు. 

మొదటి ప్రశ్న...
ఈ విషయం చెప్పడం అవసరమా ?
అన్న ప్రశ్నను మనసులో వేసుకోవాలి. చాలా సార్లు అసలు సంబంధం లేని విషయాలను చెప్పి మీ ఆత్మీయులను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఆ క్షణంలో అది చాలా సాధారణమైనదిగా కనిపించినప్పటికీ, తర్వాత అది మనస్పర్థలకు దారితీసి ఉండవచ్చు. కాబట్టి ఈసారి మీ ఆత్మీయులతో మాట్లాడేటపుడు ఈ ప్రశ్నను మదిలో వేసుకోండి.

రెండవ ప్రశ్న...
ఇది నేనే చెప్పాలా ? ఆ విషయాన్ని మీరే కాక ఇతరులూ చేప్పే అవకాశం ఉన్నపుడు మీరు తప్పుకోవడమే మంచిది. నేను తప్ప ఇంకెవరూ చెప్పే అంశం కాదు అన్న సందర్భంలోనే నోరు విప్పండి. మీరే చెప్పాల్సి వస్తే, అవతలి వారి దృష్టికోణం నుంచి కూడా పరిశీలించి చెప్పాలి. లోకంలోని ప్రతీ విషయాన్ని మీరే చెప్పాలన్న నియమమేదీ లేదు. 

చివరి ప్రశ్న...
ఇది నేను ఇప్పుడే చెప్పాలా ? ప్రతీ దానికీ సరైన సమయమంటూ ఒకటి ఉంటుంది. ఓపికతో ఎదురుచూసి సరైన సమయంలో ఆ విషయాన్ని తెలియజేయాలి. ఉదాహరణకు ఏదైనా మనస్ఫర్థతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సమయంలోనే పాత సమస్యలను గుర్తు చేస్తే బంధం మరింత ప్రమాదంలో పడుతుంది. 

ఇదంత ఈజీ కాదు..
చూడడానికి ఇది ఈజీగానే కనిపిస్తున్నప్పటికీ, ఆచరించేటపుడు కొంచెం ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. తరచుగా ఉపయోగించడం ద్వారా ఈ ట్రిక్‌పై పట్టు సాధించవచ్చని ఫెర్గూసన్‌ అంటున్నారు. ముఖ్యమైన విషయాలు చర్చించే సమయంలో దీనిని ఉపయోగిస్తే మనస్పర్థలు తగ్గి బంధం బలపడుతుందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు