ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలు

30 Jun, 2013 02:54 IST|Sakshi
ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలు
ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ స్వాభావికంగా జరిగేవే! ఇందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రాకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఎండకు ఎక్స్‌పోజ్ అవుతూ ఆడేలా ప్రోత్సహించాలి. 
 
 మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా (ఫ్లెక్సిబుల్‌గా) ఉంటాయి. ఎదిగే కొద్దీ బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. ఇందుకోసం ఆహారం నుంచి క్యాల్షియమ్‌ను, సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ని గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే క్రమంలో జరుగుతూ పోతుంది. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్ మినరల్ డెన్సిటీ (బీఎమ్‌డీ) అంటారు. మనిషికి  22 ఏళ్లు వచ్చే నాటికి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. దీన్నే పీక్ బోన్ మాస్ అంటారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ప్రోగ్రెసివ్ బోన్ లాస్ అని వ్యవహరిస్తారు. దీన్ని త్వరగా కోల్పోతే ఎముకలు పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఇలా ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పోయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన  తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 
 యౌవనదశే కీలకం... 
 
 యౌవన ప్రవేశకాలంలో క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, విటమిన్ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం అవసరం. ఎందుకంటే అప్పుడు సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. 
 
 సాంద్రత తగ్గడానికి దోహదపడే రిస్క్ ఫ్యాక్టర్లు  
 
 ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికితోడు మన ప్రాంతీయత, మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్ వంటివి ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేస్తాయి.
 
 సాంద్రతను తక్కువ చేసే రుగ్మతలు 
 
 ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. 
 
 ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు? 
 
  65 ఏళ్లు దాటిన మహిళలు, 70 ఏళ్లు దాటినపురుషులు ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. అలాగే, గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు  తక్కువ బరువు ఉన్నవారు  తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినవారు  వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్‌నార్మాలిటీస్ ఉన్నవారు  గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్‌ను  తీసుకుంటున్నవారు  హైపర్ థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నవారు  తినడానికి సంబంధించిన రుగ్మతలున్నవారు... విటమిన్ ‘డి’ లోపం ఉన్నవారు 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే డాక్టర్ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 
 
 ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..? 
 
 నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్-రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దీనితో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి. 
 
 దీనివల్ల శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహారపదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు అనంతర కాలంలో, ఆ మాటకొస్తే వృద్ధాప్యంలోనూ బాగా బలంగా ఉంటారు. 
 
 - నిర్వహణ: యాసీన్
మరిన్ని వార్తలు