హ్యామ్ టామ్

27 Nov, 2014 23:03 IST|Sakshi
హ్యామ్ టామ్

సెల్‌ఫోన్లు... ల్యాండ్ లైన్లు పనిచేయని చోట కూడా రింగ్‌మంటుంది  అమెచ్యూర్ రేడియో. ఈ సాధనంతోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు సిటీ కుర్రాడు టామ్ కె.జోస్. రెండేళ్ల క్రితం ఎనిమిది నెలల్లో... వంద దేశాల్లోని వారితో మాట్లాడటమే ఆ రికార్డు. ప్రపంచంలోనే ఇలా మాట్లాడిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు టామ్. ఇతడి హ్యామ్ రేడియో ఐడీ నంబర్ ‘వీయూ3టీఎంవో’. ఇటీవల విలయం సృష్టించిన హుదూద్ తుపాన్ సమయంలో విశాఖలోని  కంట్రోల్ స్టేషన్ నుంచి హ్యామ్ రేడియోతో సేవలందించిన టామ్‌తో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు.
 
నాన్న జోష్ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో అసిస్టెంట్ డెరైక్టర్. అమ్మ లిసీ టెక్నికల్ అసిస్టెంట్. మాది కేరళ. నా చిన్నప్పుడే సిటీకి వచ్చాం. అమ్మానాన్నలతో పాటు తాతయ్య కూడా అమెచ్యూర్ రేడియోలు వాడుతుండటంతో నాకు కూడా ఆసక్తి పెరిగింది. ఆ ఉత్సాహంతోనే హ్యామ్ రేడియో లెసైన్స్ తెచ్చుకున్నా. అంతేకాదు... ఇప్పటివరకు 150 దేశాలకు పైగా వ్యక్తులతో మాట్లాడాను. హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియోలోని పరికరాల సాయంతో మాట్లాడుతున్నా. చదువుకు ఇబ్బంది కలగకుండా మాట్లాడుతూ ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి, వాతావరణం వివరాలు సేకరించా. పదేపదే ఈ సంకేతాలు అందాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.
 
అదే మొదటిసారి...

12 ఏళ్ల వయసులో హ్యామ్ ఆపరేటర్‌గా లెసైన్స్ వచ్చింది. అప్పుడే ఇలా ఇతర దేశాల వారితో మాట్లాడా. ప్రస్తుతం ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ తొలి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నా. విశాఖలో హుదూద్ తుపాను అనగానే బయలుదేరా. చాలా వరకు పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో కొన్ని స్టేషన్లలో హ్యామ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. విశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని కంట్రోల్ స్టేషన్ నుంచి సేవలందించా. ఇలా సామాజిక సేవలో భాగస్వామినవడం ఎంతో గర్వంగా ఉంది. నేను తీసుకున్న లెసైన్సు ఈ తరహాలో ప్రజల అవసరాలకు ఉపయోగపడటం సంతోషాన్నిస్తోంది.
 
ఇదీ సంగతి...

అభిరుచి, ఆసక్తి కొద్దీ హ్యామ్ రేడియోను వాడేవారంతా కలసి ‘అమెరికన్ రేడియో లీగ్’ సంస్థగా ఏర్పడ్డారు. వీళ్లు ఏటా ‘డైమండ్ డీఎక్స్‌సీసీ చాలెంజ్’ సర్టిఫికెట్ పేరుతో పోటీ నిర్వహిస్తారు. అమెచ్యూర్ కావాలనుకున్నవాళ్లు ఏడాది కాలంలో వంద దేశాలలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఇతర అమెచ్యూర్‌లతో మాట్లాడాలి. అలా టామ్ 2012లో 8 నెలల్లోనే ఇది పూర్తి చేశాడు. ఈ రేడియో వాడాలంటే... ఆ దేశ ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందాలి. అందుకు మనవాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి  లెసైన్సు తెచ్చుకున్నాడు.

- వాంకె శ్రీనివాస్
 

మరిన్ని వార్తలు