క్రియేటివ్ హగ్గర్స్

24 Sep, 2014 01:41 IST|Sakshi
క్రియేటివ్ హగ్గర్స్

బిజీ లైఫ్‌లో మనసుకు నచ్చిన విషయాలను పట్టించుకొనే తీరికే ఉండటం లేదు. కెరీర్ ప్రవాహంలో కొట్టుకుపోతూ అభిరుచి పక్కకు పోతోంది. ఫలితం మొనాటమీ ఆవహించి జీవనశైలిని బోరెత్తిస్తోంది. పాడటం, బొమ్మలు వేయడం, కళాఖండాలు సృష్టించడం.. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. కానీ దాన్ని ప్రదర్శించుకోవడానికే సరైన వేదిక కనిపించదు. అలాంటి వారినందరినీ ఓ ‘చెట్టు’ కిందకు తీసుకువచ్చి... వారిలోని క్రియేటివిటీని ప్రోత్సహిస్తోంది ‘ట్రీ హగ్గర్స్ క్లబ్’. ఎవరి ఉద్యోగాలు వారు చేస్తూనే.. వారిలోని టాలెంట్‌ను ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు.
 
కళాకారులు, కళాభిమానులు.. ఇలా అందరూ ఒకే చెట్టు కిందకు చేర్చే ప్రయత్నంలో నుంచి పుట్టుకొచ్చిందే ‘ట్రీ హగ్గర్స్ క్లబ్’. నెలలో ఒకరోజు లోకల్ మార్కెట్ నిర్వహిస్తోంది. కళ, సృజనకు సంబంధించిన ప్రదర్శన  ఇవ్వచ్చు. వీటి మీద ఆసక్తి ఉన్నవాళ్లయితే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు.
 
 చెట్లపై మక్కువ..
 చెట్లంటే మాకు చాలా ఇష్టం. కానీ సిటీ.. కాంక్రీట్ జంగిల్. దీని వల్ల మన మూలాలు కనుమరుగుతున్నాయి. అలా కనుమరుగవుతున్న మూలాలను తిరిగి తెలుసుకోవడమే ట్రీ హగ్గర్ ఆలోచన. ప్రకృతిపై దృష్టి పెట్టాలని, దాన్ని కాపాడుకోవాలని చెప్పడం కూడా మా లక్ష్యం. దానికి అనుబంధంగా క్రియేటివ్, ఆర్ట్స్ లాంటి ట్యాలెంట్ ఉన్నవారందరినీ ఒక ‘చెట్టు నీడ’లోకి తీసుకురావడమే ఈ క్లబ్ పేరులోని అర్థం. ఆర్టిస్టులు, మ్యుజీషియన్స్, కుకింగ్, ఆర్ట్, మ్యూజిక్ లవర్స్... ఇలా అందరూ ఒకే చోట తమ ప్రతిభను ప్రదర్శించుకోవచ్చు’ అంటారు క్లబ్ వ్యవస్థాపకురాలు సుప్రీత. ఈమె ఫ్రీలాన్స్ రైటర్, కార్పొరేట్ ట్రైనర్ కూడా. ‘క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేది నా కోరిక. దాని కోసం గూగుల్‌లో జాబ్ కూడా వదిలేసి వెంటనే ఈ క్లబ్ స్టార్ట్ చేశా.

నేను, నా పార్ట్‌నర్... మాలాంటి వారింకా ఎంతమంది ఉన్నారని వెతకడం మొదలు పెడితే చాలా మంది కనిపించారు. వారందరికీ సరైన ప్లాట్‌ఫాం కల్పించడమే మా లక్ష్యం. దీని ద్వారా ఎలాంటి క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌నైనా ప్రమోట్ చేస్తాం. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ వంటివేమీ ఉండవు. క్రియేటివ్ పీపుల్ చేసిన వస్తువులే ఉంటాయి. రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్.. ఇలా ఎకో సిస్టమ్ గురించి ఆలోచించేవాళ్లు, పర్యావరణాన్ని ప్రేమించేవాళ్లే ఈ క్లబ్‌లో ఉంటారు. చెట్లని నాటకపోయినా, వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఓపెన్ ఫర్ ఆల్ క్లబ్’ అంటూ చెప్పుకొచ్చారు సుప్రీత.
 
 ఏం చేస్తుంటారు..
 ఫ్లీ అఫైర్ ఈవెంట్ నిర్వహిస్తారు. ఇది ఒక రోజు మార్కెట్. ఎవరైనా వచ్చి వాళ్ల వర్క్‌ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. అమ్మవచ్చు. కమెడియన్, సింగర్, మ్యుజీషియన్, ఆర్టిస్ట్.. ఇలా ఎవరైనా సరే. ‘ఈ సారి బ్యాక్ టూ బార్టర్ పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేశాం. పాత వస్తువులు తెచ్చి అక్కడ వేరే వస్తువులను కొనుక్కోవచ్చు. షామియానా, ఇతర వస్తువుల రెంట్ కోసం కొంత చార్జ్ చేస్తాం. నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ హరీష్ పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీలో ఎక్స్‌పరిమెంటల్ వర్క్ చేస్తుంటా’ అని క్లబ్ మరో ఫౌండర్ హరీష్ చెప్పారు. సుప్రీతది హైదరాబాద్. హరీష్ స్వరాష్ట్రం కేరళ. ఇద్దరూ కలిసి ఓ మంచి కాజ్ కోసం ఈ క్లబ్ నెలకొల్పడం విశేషం.
 -  ఓ మధు

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా