ఉర్దూ ప్యాలెస్

19 Feb, 2015 00:25 IST|Sakshi
ఉర్దూ ప్యాలెస్

పంజాబీ సాహిత్యం నుంచి ఉర్దూ భాష ఆవిర్భవించిందని సాహితీకారుల అభిప్రాయం. దిల్లీలో అధికంగా మాట్లాడే ఖడీబోలీ - హిందీ భాషల నుంచి ఉర్దూ వ్యాప్తి చెందిందని మరికొందరి వాదన. ఉర్దూ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, దక్షిణాది ప్రాంతాల్లో వాడుక భాషలైన ఉర్దూ-తెలుగు-హిందీ సాహిత్యాలపై తగిన తులనాత్మక పరిశోధనలకోసం ‘ఉర్దూ ప్యాలెస్’(ఐవాన్-ఇ-ఉర్దూ)ను డాక్టర్ సయ్యద్ ఖాద్రీజోర్ స్థాపించారు. పంజగుట్టలో నిమ్స్ ఆస్పత్రికి ఎదురుగా ఈ ప్యాలెస్ ఉంది.

హైదరాబాద్‌ను పాలించిన మహ్మద్ కులీ కుతుబ్‌షాను ప్రముఖ కవి పండితుడుగా ఉర్దూ భాషాభిమానులు కీర్తిస్తారు. 16వ శతాబ్దంలో ఉర్దూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాడుక భాషగా పరిఢవిల్లింది. ఉర్దూ రచయితలను ప్రోత్సహించడానికి, ఉర్దూ సాహిత్యంపై పరిశోధనలు, దక్కను ప్రాంత చర్రిత, సాహిత్య-సంస్కృతులను చాటి చెప్పేందుకు ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని మొయినుద్దీన్ ఖాద్రీజోర్ 1920లోప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు ఇదారా-ఇ-అదబియాత్-ఇ-ఉర్దూ(ఉర్దూ సాహిత్య సంస్థ), ఐవాన్-ఇ-ఉర్దూ(ఉర్దూ ప్యాలెస్) లను 1931 జనవరి 25న నెలకొల్పారు. 1955లో సంస్థ రజతోత్సవాల సందర్బంగా శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఖాద్రీజోర్ భార్య తన తరపున పంజగుట్టలోని వెయ్యి గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఈ భవన సముదాయానికి ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం కూడా అందజేశారు.
 
మూడువైపుల క్రైస్తవ చర్చి మాదిరి అరవై అడుగుల ఎత్తై టవర్‌లు కనబడతాయి. ఎల్లోరా గుహల మాదిరిగా 12 అడుగుల ఎత్తులో ప్రవేశ ద్వారం, ఆ ద్వారం పైభాగాన తామర పూలను పోలిన లతాకృతుల చెక్కడాలు చక్కగా కనిపిస్తాయి. కర్ణాటక-బహమనీ, స్పానిష్-మూరిష్ ఆర్కిటెక్చర్ కూడా భవననిర్మాణంలో కనిపిస్తుంది. ఆకర్షణీయమైన ఉర్దూ ప్యాలెస్‌లోని లోపలిభాగంలో చక్కని ఆడిటోరియం ఉంది. లైబ్రరీ, మ్యూజియం, రీసెర్చ్ స్కాలర్స్ కోసం రిఫరెన్స్ గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో 40వేలకు పైగా గ్రంథాలున్నాయి. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, పంజాబీలో చాలా అరుదుగా దొరికే చారిత్రక ఆధార రాతప్రతులు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఆరు సంపుటాలలో గ్రంథస్థం చేశారు. వీటిలో 16వ శతాబ్దం నాటి నవాబుల ఫర్మానాలు, నాటి ప్రముఖుల చేవ్రాలుతో ఉన్న లేఖలు, ఆనాటి చారిత్రక చిత్రాలు, భాషాసాహిత్యపరమైన మ్యాపులు, చార్టులు, రాతిశిలా ఫలకాలు, ఫొటో ఆల్బమ్స్... ఇలా అమూల్యమైన సమాచారం ఉంది. ఈ సంస్థ 1938 నుంచి ‘సబ్రాస్’ అనే మాసపత్రికను ప్రచురిస్తోంది.
 
ప్రతిఏటా మహ్మద్ కులీకుతుబ్ షాహీల రాజ్యస్థాపక దినోత్సవాన్ని ఉర్దూప్యాలెస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్థాపనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ సయ్యద్ జోర్ ఉస్మానియా, కశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ ఆచార్యులుగా పనిచేశారు. ఈయన అనేక గ్రంథాలు రాశారు. దక్కను ప్రాంత చరిత్ర, సంస్కృతులపై జోర్ చేసిన రచనలు నేటికీ ఉపయోగపడుతున్నాయి. 80 సంవత్సరాల చరిత్రను తమలో దాచుకున్న ఈ గ్రంథాలయంలోని పుస్తకాలను కంప్యూటరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కాలపు గుర్తులు చెదిరిపోకుండా తగిన మరమ్మతులు చేపట్టి సంస్థను ఆధునీకరించాల్సిన అవసరమూ ఉంది. కవులు, రచయితలు, రీసెర్చ్ స్కాలర్స్, చరిత్ర-భాషా సంస్కృతి అభిమానులు, ఉర్దూ విద్యార్థులతో ఇవన్-ఇ-ఉర్దూ భవనం నిత్యం బిజీగా ఉండే ఉర్దూ ప్యాలెస్‌ను ఒక్కసారైనా సందర్శించాలి.
 
ఔత్సాహికుల కోసం...

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’ ద్వారా డీటీపీ కమ్ గ్రాఫిక్ డిజైన్స్, కాలిగ్రఫీల్లో పరీక్షలు ఏడాదిలో రెండు దఫాలు నిర్వహిస్తున్నారు. డిప్లొమా ఇన్ మల్టీ లింగ్వల్స్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఉర్దూ నేర్చుకోవాలనే తృష్ణ ఉన్నవారికోసం ప్రత్యేక పరీక్షలు ప్రతిఏటా రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు ప్రతి ఏటా 40 నుంచి 50 వేల మంది హాజరవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏడో తరగతితో సమానమైన ఉర్దూ మహిన్, మెట్రిక్యులేషన్‌తో సమానమైన ఉర్దూ అలిమ్, ఇంటర్మీడియట్ స్థాయి ఉన్న ఉర్దూ ఫజిల్ పరీక్షలను కండక్ట్ చేస్తున్నారు. ముస్లిం యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

మరిన్ని వార్తలు