కలలో మాట.. బంగారం వేట!

21 Oct, 2013 13:17 IST|Sakshi
కలలో మాట.. బంగారం వేట!

నమ్మే పిచ్చోళ్లు ఉంటే.. నాపరాయిని చూపించి వజ్రం అన్నాడట వెనకటికొకడు. ఉత్తరప్రదేశ్ బంగారు వేట వ్యవహారం అచ్చం అలాగే ఉంది. మన దేశంలో బాబాలు, బతికున్న దేవుళ్లకు ఏమాత్రం కొదవలేదు. వాళ్లు చెప్పిన మాటలను పట్టుకుని నిప్పుల్లో దూకడం లాంటి పిచ్చిపనులు చేసేవాళ్లకు కూడా కొదవ లేదు. కానీ.. ఏకంగా ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కదిలిపోయి జీఎస్ఐ లాంటి సంస్థలను అడ్డుపెట్టుకుని బంగారం ఉందంటూ తవ్వకాలు మొదలుపెట్టడం.. నిజంగా ఎంత పిచ్చిపనో అనిపిస్తుంది. వెయ్యి టన్నుల బంగారం ఉందని ఓసారి, 2,500 టన్నులు ఉందని ఇంకోసారి చెబుతూ స్వామి శోభన్ సర్కార్ జనాన్ని పిచ్చివాళ్లను చేస్తున్నాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు కూడా తమకు ఇక్కడేదో లోహం ఉందని చెప్పడం వల్లే తాము తవ్వకాలు చేస్తున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్ జిల్లా దాండియాఖేరా గ్రామంలో 19వ శతాబ్దానికి చెందిన రాజా రావ్ రామ్‌బక్ష్ సింగ్ నిర్మించిన రాజకోటలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నట్లు తాను కలగన్నానని స్వామి శోభన్ సర్కార్ అనే సాధువు వెల్లడించడం దీనంతటికీ మూలం అయ్యింది. శుక్రవారం నుంచి ఆ కోటలో ఏఎస్‌ఐ బృందం తవ్వకాలు మొదలుపెట్టింది. అక్కడేం జరుగుతోందో చూసేందుకు జనం కట్టలు కట్టుకుని మరీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా సాధువు కన్న కల నిజం కావాలని, ప్రతి జిల్లాలో ఓ బంగారు నిధి ఉండాలని అంటున్నారు!!

కేవలం ఒక సాధువుకు వచ్చిన కలను పట్టుకుని, ఆయన చెప్పిన మాటల ఆధారంగా కోటలో తవ్వకాలు చేస్తున్న ప్రభుత్వం.. దానిమీద పెట్టే ఖర్చుతో ఎంతమందికి కూడు, గూడు, గుడ్డ లాంటివి అందించవచ్చో ఆలోచించడంలేదు. పైపెచ్చు, భూమిని తవ్వేందుకు పలుగులు, పారలతో సిబ్బంది బయల్దేరడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఉత్తరప్రదేశ్లోనే ఫతేపూర్ జిల్లా ఆదాంపూర్ గ్రామంలో కూడా మరో 2,500 టన్నుల బంగారం ఉందని, అక్కడ తవ్వకాలకు కావాలంటే తాను 10 లక్షల రూపాయలు ఇస్తానని సాధువు శోభన్ సర్కార్ చెబుతున్నారట. అసలాయనకు ఆ 10 లక్షలు ఎక్కడివో, దానికి ఇన్నాళ్లూ ఆదాయపు పన్ను కట్టారో లేదో తేలిస్తే ఇలాంటి కూతలు ఆగుతాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు