అలా సెట్ అయింది

12 Dec, 2014 04:42 IST|Sakshi
అలా సెట్ అయింది

మర్యాదరామన్న సినిమా గుర్తుందా.. ? ప్రాణరక్షణ కోసం అందులో హీరో గడప దాటని ఇల్లు గుర్తొచ్చిందా..! రాయలసీమ ఠీవి అణువణువూ కనిపించే ఆ ఇల్లు ఒక్క మర్యాదరామన్న సినిమాలోనే కాదు.. ఆపై ఎన్నో సినిమాల్లో మరెన్నో యాంగిల్స్‌లో కనిపించింది. మర్యాదరామన్న స్టోరీలైన్‌లా.. ఆ ఇంటి సెట్ వేసి ఏళ్లవుతున్నా.. సినీజనాలు నిత్యం ఆ గడప తొక్కుతూనే ఉన్నారు. మర్యాదగా షూటింగ్ చేసుకుంటున్నారు. పావు ఎకరం లోగిలిలో నిండుగా కనిపిస్తూ పల్లె వాతావరణాన్ని గుర్తుతెచ్చే విధంగా నిర్మించిన ఆ సెట్‌కు పేటెంట్ సంపాదించి అందరి మన్ననలు పొందారు ఆర్ట్ డెరైక్టర్ ఎస్.రవీంద్రారెడ్డి. సెట్ ఏమిటి..? పేటెంట్ ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! కొత్తరకం కెమికల్స్ వాడి చెక్కు చెదరని ఇంటి సెట్ వేసిన మొదటి కళాదర్శకుడిగా గుర్తింపు పొందిన రవీంద్రారెడ్డి చేసిన మ్యాజిక్ గురించి వివరంగా..
 - భువనేశ్వరి
 
నగర శివార్లలో ఉన్న కోకాపేటకు వెళ్లి.. ఇక్కడ మర్యాదరామన్న ఇల్లు ఎక్కడని ఎవర్ని అడిగినా.. ఆ సెట్‌కు రూట్ చెబుతారు. ఆ రూట్లో వెళ్లి చూస్తే.. ఆ మండువా లోగిలి మీకు కనిపిస్తుంది. మర్యాదరామన్న కథ ప్రకారం.. అందమైన ఇల్లొకటి కావాలి. ఆ ఇల్లు, ఇంటి పరిసరాలు అన్నీ అనంతపురంలోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలి. తలుపులు, దూలాలు, వాసాలు, మెట్లు అన్నీ ఒరిజినల్‌గా కనిపించాలి. దానికోసం రవీంద్రారెడ్డి పెద్ద కసరత్తే చేశారు.
 
రెండువందల పేజీల పేపర్ వర్క్, 300 మంది పనివాళ్లతో రెండు నెలలు శ్రమిస్తే ఆ సెట్ కుదిరింది. అందుకే మర్యాదరామన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఇల్లు కూడా అంత పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఈ సెట్‌కు పాపులారిటీ తగ్గలేదు. ఈ ఇంటిలో ఇప్పటి వరకూ దాదాపు 600 సినిమాలకు పైగా షూటింగ్ చేసుకున్నాయి.
 
పేటెంట్ ఏమిటి?
ఒక సీన్ కోసం.. ఒక పాట కోసం.. వేసే భారీ సెట్టింగులు సైతం.. పని అయిపోయాక పీకేస్తారు. మరీ భారీ సెట్టింగ్‌లు అయితే రెండు మూడు సినిమాలకు వాడుకుంటారు. మర్యాదరామన్న సెట్ ఇందుకు భిన్నమైంది. మామూలు సెట్‌లా కాకుండా దీన్ని వేసేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రవీంద్రారెడ్డి. రెండు టన్నుల బరువుండే అకెలా క్రేన్స్ కూడా ఈ ఇంటి రెండో అంతస్తులోకి తీసుకెళ్లి షూటింగ్ చేయొచ్చు.

అంత ధృడంగా దీన్ని వేశారు. ‘ఇలాంటి సెట్ వేయడం మన దగ్గర మొదటి ప్రయోగం. మామూలుగా సెట్‌ల నిర్మాణానికి వాడే ఫ్లైవుడ్‌నే నేనూ వాడాను. కాకపోతే వాటిని అతికించడానికి కొత్తరకం మెటీరియల్ వాడాను. దాన్ని తయారు చేసిందీ నేనే. లేటెక్స్, ఇసుక, ఫెవికాల్‌కు తోడు కొన్ని రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన ఆ మెటీరియల్ నేను ఊహించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చింది.
 
మిగతా వస్తువుల తయారీలో కూడా నా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోగలిగాను. ఇంటి సెట్ క్వాలిటీని చూసిన చాలా మంది పేటెంట్ కోసం అప్లయ్ చేయమని చెప్పారు. దాంతో అన్ని వివరాలతో చెన్నైకి చెందిన పేటెంట్ కంపెనీకి అప్లికేషన్ పంపాను. వాళ్లు ఆరునెలలు ఈ ఇంటికి సంబంధించిన పరిశోధన జరిపారు. మన దేశంలోనే కాదు.. ఇంకెక్కడా కూడా ఇంత నాణ్యమైన ఇంటిసెట్ లేదని, నేను వాడిన మెటీరియల్ యూనిక్ అని గుర్తించి నాకు పేటెంట్ హక్కుల్ని కల్పించారు’ అని చెప్పారు రవీంద్రారెడ్డి. మెటీరియల్
 
చుట్టూ పొలాలు..
‘మర్యాదరామన్న చిత్రంలో పొలాల్లో కనిపించే సీన్ల కోసం ఆ ఇంటిపక్కనే రెండు ఎకరాల్లో జొన్నపంట పండించి మరీ షూటింగ్ చేశారు రాజమౌళి. ఆ సీన్లలో ఈ ఇంటి నీడైనా కనిపించకపోవడం జక్కన్న పనితనానికి మచ్చుతునక. కథ చెప్పి పక్కకు తప్పుకుంటారు. ఆర్ట్ విషయంలో అసలు కల్పించుకునేవారు కాదు. నిర్మాత సహకారం కూడా మరువలేనిది. ఇంటి సెట్ ఒకెత్తయితే.. ఆ ఇంట్లో కనిపించే వస్తువులు మరోఎత్తు. ఊయల నుంచి వంటింటి సామాన్ల వరకూ అన్నిట్లో ఆ తరం నేటివిటీ కనిపించేలా డిజైన్ చేశాను. ఇవన్నీ
 
ప్లైవుడ్, థర్మాకోల్, ఫైబర్ వాడి తయారు చేశాను. చివరికి పశువుల కొట్టంలో కనిపించే నీళ్ల తొట్టెలతో సహా. కథకు జీవం పోసిన ఆ సెట్‌ని ఆ తర్వాత కొన్ని వందల సినిమాలకు వాడడం, ఇప్పటికీ మర్యాదరామన్న ఇంటి సెట్ అనే పదం వాడడం.. వింటుంటే గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చిరునవ్వుతో చెప్పారు రవీంద్రారెడ్డి.

 కొన్ని వందల సినిమాలు...
గబ్బర్‌సింగ్‌లో విలన్ ఇల్లు, బృందావనంలో శ్రీహరి ఇల్లు, కందిరీగ, పూలరంగడు, మిర్చి.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఆ ఇంట్లోనే జరిగాయి. తమిళ విక్రమార్కుడు కూడా ఇక్కడే షూట్ చేశారు. నాలుగేళ్లలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు ఆరువందల సినిమాల చిత్రీకరణ జరిగిన ఆ ఇంట్లో ప్రస్తుతం తెలుగులో ఓ టాప్‌హీరో షూటింగ్ జరుగుతోంది.

దానికి కూడా రవీంద్రారెడ్డి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి  వరకూ ఆ ఇంటిని చిన్న చిన్న మార్పులు చేసి వాడుకుంటే ఈసారి రవీంద్రా ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. తమిళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనం కోసం ఆ ఇంటికి ద్రవిడ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎంట్రన్స్ లుక్ కూడా మారిపోయింది. రిచ్ అండ్ లేటెస్ట్‌గా కనిపించేలా కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.
 
అదీ సెట్టే..
‘మర్యాదరామన్న సినిమాలోనే ట్రైన్ జర్నీ సీన్ చూశారుగా.. ఆ ట్రైన్ కూడా సెట్టే. ఈ ఇంటి పక్కనే రెండు బోగీలు సెట్ వేసి.. ట్రైన్ సీన్‌ను లాగించేశారు. రాయలసీమలో కనిపించే నేటివిటీని చూపిన ఆ సెట్ తర్వాత ఓ ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈగ మూవీలో ఇల్లు, అత్తారింటికి దారేది, జులాయి.. ఇలా మిగితా సినిమాల్లో ఇళ్ల సెట్లనూ ఆ దృష్టితో వేసినవే’ అంటూ ముగించారు.

మరిన్ని వార్తలు