బాటిల్స్ విత్ థీమ్స్

13 Aug, 2014 00:41 IST|Sakshi
బాటిల్స్ విత్ థీమ్స్

కళాత్మక దృష్టి ఉంటే కనిపించే ప్రతి వస్తువును కళాకృతిగా మార్చేయవచ్చు. సుద్దముక్కతో కళాఖండాలు తీర్చిదిద్దవచ్చు. సబ్బుబిళ్లలతో అబ్బురపరిచే అందాలను తయారు చేయవచ్చు. సునిశిత పనితనంతో సున్నితత్వంలోనే మెరుపులు సృష్టించవచ్చు. అలాంటి జిజ్ఞాసతోనే ఓ వనిత గాజుసీసాలను మణిరత్నాల్లా మార్చేసింది.
 
 కొత్తదనం కోరుకునే వారికి అంతే కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. ఆ తపనే సునందను హ్యాండ్‌మేడ్ కళాకారిణిగా తీర్చిదిద్దింది. చిన్న చిన్న సీసాలు, వాటర్ బాటిల్స్, ల్యాంప్స్.. ఇవే ఆమె ముడిసరుకు. వేళ్లు కూడా సరిగా దూరని సీసాల్లోనికి ఆమె సృజన ప్రవేశిస్తుంది. అద్భుతాలను ఆవిష్కరిస్తుంది.
 
 మెరిసే సీసాలు..
 రకరకాల గాజు సీసాలు సునంద చేతిలో పడితే చాలు వెలిగిపోతాయి. ఆ సీసాల లోపలి అంచులు ఆమెకు కాన్వాస్‌లా మారిపోతాయి. కుంచె నుంచి జాలువారిన రంగులు గాజుపై నాట్యం చేస్తాయి. క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ హీరోలు.. ఒకరేమిటి ఫేమస్ పర్సనాలిటీలంతా అందులో బందీలు కావాల్సిందే. రంగులద్దడం పూర్తయిన తర్వాత లోపల ఎల్‌ఈడీ లైట్లు అమర్చి వాటిని మెరిపిస్తుంది. ఫైర్‌ఫ్లై ఆర్టికల్స్ తయారు చేయడం హాబీగా ఉన్న సునంద  మొదట్లో తన దగ్గరి వాళ్లకు ఇవి ప్రజెంట్ చేసేది. స్నేహితుల ప్రోత్సహంతో.. 2013లో హ్యాండ్‌మేడ్ ఆర్టికల్స్‌తో బిజినెస్ మొదలు పెట్టింది. డిఫరెంట్ థీమ్స్‌తో పాటు సునంద తీర్చిదిద్దిన కళాకృతులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్నాయి.

మరిన్ని వార్తలు