వింటేజ్‌లెస్ వెహికల్స్

27 Jan, 2015 01:13 IST|Sakshi
వింటేజ్‌లెస్ వెహికల్స్

ఈ బుల్లి బైక్ భలే ఉంది కదూ. సయ్యద్‌నగర్‌కు చెందిన మెకానిక్ మహ్మద్ సలీమ్ దీని రూపకర్త. తన కుమారుడు రోజూ స్కూల్‌కు వెళ్లేందుకని దీనిని తయారు చేశాడు. లుంబినీపార్క్‌లో సోమవారం నిర్వహించిన వింటేజ్ వాహనాల ప్రదర్శనలో ఇటువంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఎన్నో... అలనాటి మేటి వాహనాలు.. సిటీవాసులకు కనువిందు చేశాయి. తాతల నాటి వాహనాలను వారసత్వ సంపదగా గుర్తించిన వారు కొందరు. గతంలో ఓ వెలుగు వెలిగిన వాహనాన్ని అందిపుచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్న వారు ఇంకొందరు. వీరంతా వింటేజ్ కార్లు, ఆనాటి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను తమ స్టేటస్ సింబల్‌గా చూపిస్తున్నారు.
 
 అలనాటి మేటి వాహనాలు.. సిటీవాసులకు కనువిందు చేశాయి. తాతల నాటి వాహనాలను వారసత్వ సంపదగా గుర్తించిన వారు కొందరు. గతంలో ఓ వెలుగు వెలిగిన వాహనాన్ని అందిపుచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్న వారు ఇంకొందరు. వీరంతా వింటేజ్ కార్లు, ఆనాటి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను తమ స్టేటస్ సింబల్‌గా చూపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా లుంబినీ పార్క్‌లో డెక్కన్ హెరిటేజ్ ఆటోమొబైల్ అసోసియేషన్ సోమవారం నిర్వహించిన 12వ వింటేజ్ కార్ అండ్ మోటార్ సైకిళ్ల ర్యాలీలో ప్రదర్శించిన
 ఆ పాత వాహనాలు.. అందరి మనసులనూ దోచుకున్నాయి.
 - వాంకె శ్రీనివాస్

1936 మోడల్ ఆస్టిన్ కారును కుటుంబసభ్యుడిగా చూసుకుంటున్నారు రాంకోఠికి చెందిన మాధవరావు.. ‘ఈ కారు తొక్కితే ఇప్పటికీ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది’ అని మురిసిపోతూ చెబుతుంటారు. 1930 షెవర్లే, ప్లిమత్, సన్‌బీమ్ టాల్‌బోల్ట్.. ఇలా రకరకాల కార్లు నాటి ఠీవిని కళ్ల ముందుంచాయి.
 
 ఇప్పటికీ అదే డామినేషన్..
 కార్లే కాదు.. నాడు మధ్యతరగతి మారుతిగా పేరొందిన వెస్పాపై ఇప్పటికీ సిటీవాసికి మోజు తగ్గలేదు. 1971నాటి మోడల్ బజాజ్ బండికి నయా హంగులద్ది హ్యాపీ జర్నీ సాగిస్తున్నాడు బాలానగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్. ర్యాలీలో 1952 నాటి నార్టన్ డామినేటర్ 500 సీసీ ట్విన్‌బైక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఇది బుల్లెట్ వేగంతో దూసుకుపోతుందని అంటున్నారు దాని యజమాని గురుదేవ్ సింగ్ సోఖి. తన కుమారుడు పాఠశాలకు వెళ్లేందుకు సయ్యద్‌నగర్‌కు చెందిన మెకానిక్ మహ్మద్ సలీమ్ తయారు చేసిన బుల్లి బైక్ ప్రదర్శనలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.  
 
 సూపర్ బైక్
 పాత మోడల్ బుల్లెట్‌ను రీమోడల్ చేశా. జీపీఎస్ సిస్టమ్, 30 లైట్లు, విండ్ వెలాసిటీ, వెదర్ ఫోర్‌కాస్టింగ్, ఎఫ్‌ఎం రేడియో తదితర పరికరాలతో ఫ్లయింగ్ ఏంజిల్‌గా మార్చాను. డబుల్ ఎగ్జాస్టర్, టర్బో ఇంజిన్‌తో పాటు బాంబు జామర్ కూడా అమర్చాను. బైక్ ఉన్న 500 మీటర్ల రేడియస్‌లో ఎక్కడ బాంబ్ ఉన్నా పట్టేయడం దీని స్పెషాలిటీ.
 - వెంకట్‌రావు
 
 శతాబ్ది ఎక్స్‌ప్రెస్..
 అద్దంలా మెరిసిపోతున్న ఈ కారుకు వందేళ్ల చరిత్ర ఉంది. 1915లో లండన్ నుంచి వచ్చిన ఈ కారు... బీహార్‌కు చెందిన ఓ మహారాజు వినియోగించేవారు. ‘నలభై ఏళ్ల కిందట బీహార్ వెళ్లినప్పుడు మహారాజు వాడిన గోల్ఫర్ కూపే కారు ఉందని తెలిసి.. మా పేరెంట్స్‌ను ఒప్పించి ఆ కారు కొనుగోలు చేశాను. అప్పట్నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇందులో ప్రయాణిస్తుంటే ఆ దర్జాయే వేరు’ అని అంటున్నారు ఖైరతాబాద్‌లో ఉంటున్న వ్యాపారి రామ్ ప్రకాశ్ అగర్వాల్.

మరిన్ని వార్తలు