'విజయశాంతిని తీసుకొచ్చి దాడి చేశారు'

16 Feb, 2014 20:00 IST|Sakshi
'విజయశాంతిని తీసుకొచ్చి దాడి చేశారు'

'నామా నాగేశ్వరరావు నాయకత్వం మాకొద్దు'- ఈ మాట అన్నది ఎవరో కాదు ఆయనతో కలిసి లోక్సభలో అడుగుపెట్టిన నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి. నాలుగున్నరేళ్లుగా భుజాలు రాసుకుని తిరిగిన నామాపై మోదుగులకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ పార్లమెంటరీ నాయకుడి పోస్టు నుంచి నామాకు వీడ్కోలు పలకాలని గొంతెత్తారు. నామా నాయకత్వాన్ని అంగీకరించడం లేదని కుండబద్దలు కొట్టారు. పార్లమెంట్ సాక్షిగా తమపై దాడికి పాల్పడిన నామా నాయకత్వంలో ఎలా పనిచేస్తామని మోదుగుల ప్రశ్నిస్తున్నారు.

లోక్సభలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు బాహాబాహికి దిగారు. బిల్లును అడ్డుకునేందుకు మోదుగుల వీరంగం సృష్టించారు. ఆయనను సొంత పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్ అడ్డుకున్నారు. మోదుగులపై దాడికి దిగారు. తమకు నాయకుడిగా ఉన్న వ్యక్తే దాడి చేయడంతో మోదుగుల అవాక్కయ్యారు. నలుగురు మద్దతుతో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న నామా విచక్షణ కోల్పోయి తమపై దాడికి పూనుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం ఎంపీగా ఆ ప్రాంత ప్రయోజనాలు నామాకు ఎంత ముఖ్యమో, నర్సరావుపేట ప్రాంత ప్రజల ఆకాంక్ష తనకు అంతే ముఖ్యమని మోదుగల స్పష్టం చేశారు.

తెలంగాణ ఎంపీలు ఆందోళనను తామెప్పుడూ అడ్డుకోలేదని మోదుగుల గుర్తుచేశారు. తెలంగాణ అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా వ్యతిరేకించలేదని చెప్పారు. సమన్యాయం చేయమని అడుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నామా, రాథోడ్- తమపై దాడి చేశారని వాపోయారు. విజయశాంతిని తీసుకొచ్చి పక్కా ప్రణాళికతో వారిద్దరూ తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతం మాత్రమే బాగుపడాలని, మిగతా వారు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా వ్యవహరిస్తున్న నామా నాయకత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణనే తమ నాయకుడిగా భావిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు రెండు ప్రాంతాల బాగు కోరుతున్నారు కాబట్టే ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామని వివరించారు.

విభజన బిల్లు టీడీపీ పార్లమెంట్ సభ్యుల మధ్య చిచ్చు రేపడం అధినేత చంద్రబాబును కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటివవరకు ఇరుప్రాంతాల నేతలతో విభజన నాటకాన్ని రక్తికట్టించిన పచ్చపార్టీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల ఫైటింగ్తో కనుకుపట్టడం లేదు. ఇకపై ఆయన ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతలను బాబు ఏవిధంగా బుజ్జగిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు