రావోయి మన్మథా..

20 Mar, 2015 23:26 IST|Sakshi
రావోయి మన్మథా..

మన్మథుడు వలపుల రేడు. ఆయన బాణం తగిలితే ప్రవరాఖ్యుడు కూడా ప్రేమలో పడాల్సిందే. పొద్దస్తమానం పరుగులతోనే గడిపేసే సిటీజనుల దగ్గర మన్మథుని పప్పులు ఉడకడం లేదు. విఫలమవుతున్న వివాహబంధాలు, విడిపోతున్న జంటలే దీనికి నిదర్శనం. ఈ మన్మథనామ సంవత్సరం నుంచైనా ప్రేమానుబంధాలు వర్ధిల్లాలని కోరుకుంటూ... మన్మథుడికి వెల్‌కమ్ చెబుతూ...
 ..:: ఎస్.సత్యబాబు  
 
‘నీకో జీతం.. నాకో జీతం.. నీదో ఉద్యోగం.. నాదో ఉద్యోగం..’ ఇలాంటి ఒప్పందాల మధ్య అనుబంధాల్లోకి యాంత్రికత అనివార్యంగా చొచ్చుకొచ్చేస్తోంది. ఉరుకుల పరుగుల నగర జీవనం ‘దగ్గరితనాన్ని’ దూరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మన్మథ నామ సంవత్సరం వచ్చేసింది. ఇప్పటికైనా వలపు బాణాలు విసిరే మన్మథుడికి తలొగ్గితే జంటలకు లభించేది అనురాగపూర్వక విజయాలే. దీన్నే కోరుకుంటూ నూరేళ్ల పంట మూణ్నాళ్ల ముచ్చటగా మారకూడదనుకుంటున్న వారి కోసం.. మానసిక వైద్యులు చేస్తున్న సూచనల్లో కొన్ని..
 
జోరుగా హుషారుగా..
దాంపత్యజీవనాన్ని  రసహీనంగా మార్చే కారణాల్లో మూసధోరణి ఒకటి. పొద్దున్న లేస్తే పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ సాగే జీవనం.. జీవిత భాగస్వామితో సరసాలకు, ముచ్చట్లకు అవకాశం ఇవ్వడం లేదు. ఆధునిక యుగంలో తీరిక లేని జీవనం ఎలాగూ తప్పేది కాదు. అయితే ఈ తీరిక లేనితనంలోకి జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కూడా జొప్పించకుండా వీలైనంత వరకూ తప్పించాలి. దీని కోసం ప్రత్యేక సందర్భాలను, సమయాలను సృష్టించుకోవాలి. ఆయా సమయాల్లో ఇచ్చి పుచ్చుకునే అబ్బురపరిచే కానుకలు మాత్రమే కాదు.. వారాంతపు షికార్లు కూడా ఉపకరిస్తాయి. విహారయాత్రలంటే ఊటీలు, సిమ్లాలు మాత్రమే కాదండోయ్.. శివార్లలోని రిసార్ట్స్ నుంచి సిటీ చుట్టుపక్కలే ఉన్న బోలెడన్ని విహారస్థలాలు కూడా.
 
కలిసి నడిస్తే కలదు సుఖం..

‘ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతాం. అసలు తను పక్కన లేకుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది’ అని కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ప్రశాంత్, రేఖలు ఒకరి గురించి ఒకరు అంటారు. ఇది అన్ని జంటలకూ అనుసరణీయం. సిటీలో విందులు, వినోదాలకు కొదవలేదు. ఎవరి స్థాయిలో వారికి ఆహ్వానాలూ అందుతుంటాయి. వీలైనంత వరకూ ఆయా పార్టీలకు జంటగా వెళ్లడం సిటీలో జరిగే మార థాన్‌లు, ఫన్ ఈవెంట్లలో కలిసి పాల్గొనడం దాకా దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి పోషిస్తాయి. ఇప్పటికే ఇలా చేస్తున్న సక్సెస్‌ఫుల్ జంటలు ఎన్నో ఉన్నాయి సిటీలో.
 
ఆరోగ్యం.. ఆకర్షణ..
‘ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్..’ అన్న పాటను గుర్తు చేస్తూ జంటగా మారిన కొత్తలో ఒకరికొకరే ప్రపంచం అన్నట్టు తిరిగే యువతీయువకులు స్వల్పకాలంలోనే ఒకరంటే ఒకరు నిరాసక్తంగా మారిపోవడం.. లోపిస్తున్న ఆకర్షణ ఒక కారణం. ఆరోగ్యాన్ని దూరం చేసే అలవాట్లు, అందాన్ని మాయం చేసే వ్యసనాలు వదులుకోవడం లేదా బాగా తగ్గించాలి. ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరు శ్రద్ధ చూపిస్తే అది పరస్పరం ఆకర్షణను మాత్రమే కాదు ఆప్యాయతను కూడా రెండింతలు చేస్తుంది.  కలిసి రెగ్యులర్‌గా వ్యాయామానికి వెళ్లడం అన్యోన్యతను పెంచుతుంది.
 
ముఖాముఖి ముచ్చట్లే..
వ్యాపారరీత్యానో, మరో లావాదేవీల కోసమో చేసే మొబైల్ చాట్‌లు లైఫ్‌పార్ట్‌నర్‌కి కూడా వర్తింపజేసేయడం యాంత్రికత పెరగడానికి మరో కారణం. అవసరాల రీత్యా చేసే సంభాషణకి, అనురాగంతో చేసే ముచ్చట్లకి మధ్య వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి. రిలేషన్ పెంచుకోవడానికి కేవలం కమ్యూనికేషన్ మీద ఆధారపడడం సరైంది కాదు.  చాట్‌లు, మెసేజ్‌లు ఉన్నాయి కదాని ముఖాముఖి మాట్లాడుకోవడం తక్కువయితే అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువ.

ఇటీవలి కాలంలో బంధాలు ముక్కలవ్వడానికి మొబైల్ ఫోన్‌లే కారణంగా పలు సర్వేలు వెల్లడిస్తున్న విషయం తెల్సిందే. ఏ మనిషికైనా అసలు సిసలు ఆనందం లభించేది మరో మనిషి సమక్షంలోనే తప్ప యంత్రాలతో కాదు. మానవ సంబంధాలు సజావుగా ఉన్నంతకాలమే సమాజం సంతోషంగా ఉంటుంది. మన్మథుడు తరహా పురాణ పాత్రల సృష్టి వెనుక మన పూర్వీకుల ఆంతర్యం అదే. పెద్దల ఆంతర్యాన్ని గౌరవిద్దాం. మనసారా మన్మథుడిని స్వాగతిద్దాం.
 
 ‘పండుగ రోజుల్లో కుటుంబీకులతో కలిసి పంచుకునే ఆనందకర క్షణాలు రొటీన్ ఫీలింగ్‌ని దూరం చేస్తాయి. మన రెగ్యులర్ ప్రొఫెషనల్ వర్క్ మరింత బాగా చేసేందుకు హెల్ప్ అవుతాయి’
 - మోహన్, శైలజ

మరిన్ని వార్తలు