వలంటీచర్స్

23 Apr, 2015 22:37 IST|Sakshi
వలంటీచర్స్

రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తారు. మరికొందరు కృష్ణారామా అంటూ తీర్థయాత్రలు చేస్తారు. కానీ.. అడవికొలను కనకరాజు అందుకు భిన్నం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసినా.. వాలంటరీ టీచర్‌గా మారారు. విశ్రాంత జీవితం గడపాల్సిన సమయంలో పాఠశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆ సరస్వతీ నిలయం గురించి...
- వాంకె శ్రీనివాస్

 
అడవికొలను కనకరాజు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 1992లో పదవీ విరమణ చేశారు. ఆ రోజు అక్షరాలకు దూరమవుతున్నానన్న ఆవేదనతో వచ్చిన ఆయన కన్నీళ్లను ఆపడం ఎవరితరం కాలేదు. నాలుగు అక్షరాలను నలుగురికీ పంచాలనే తృష్ణ ఉంటే టీచర్ ఉద్యోగమే ఉండాలా? తానెందుకు ఓ పాఠశాల నడిపించగూడదు? అనుకున్న కనకరాజ్ ఎస్‌ఈఎస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గర విశ్రాంత జీవితం గడిపేందుకు గ్రీన్ కార్డు ఉన్నా.. అక్కడికి వెళ్లడం కంటే పిల్లలకు అక్షరాలు నేర్పడంలోనే అసలైన సంతోషం ఉంటుంది అంటున్నారు కనకరాజు. ఈ ప్రయాణంలో ఆయనకు తోడుగా నిలిచింది భార్య సుందరీ ఇందిర. రిటైర్డ్ టీచరైన ఆమె కూడా ఈ అక్షర యజ్ఞంలో పాలుపంచుకుంటోంది. కాలిఫోర్నియాలో ఉంటున్న ఇద్దరు కొడుకులు వీళ్ల ఆశయానికి అండగా నిలిచారు.
 
నాన్న స్ఫూర్తితో...
‘ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సంపాదించి.. 40 ఏళ్ల కెరీర్‌లో సిటీలోని వివిధ స్కూళ్లలో సేవలందించా. రిటైర్‌మెంట్ తరువాత పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకే పాఠశాలను ప్రారంభించా. చాలా ఏళ్ల క్రితం మా నాన్న దివంగత శేషగిరిరావు ఏర్పాటు చేసిన ఎస్‌వీఈఎస్ తెలుగు మీడియం స్కూల్... తరువాత డిగ్రీ కాలేజీగా మారింది. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దింది. నా ఈ స్కూల్ ఏర్పాటు వెనుక ఆయన స్ఫూర్తి ఉంది’ అని గర్వంగా చెబుతారు కనకరాజు.

కులమతాలతో సంబంధం లేకుండా... పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించలేని పేద పిల్లలను స్కూల్లో చేర్చుకుంటున్నారు. 2001లో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ పాఠశాల ప్రస్తుతం 250 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోంది.
 
డొనేషన్లు లేకుండా...
తొలినాళ్లలో నెలకు రూ.50 ఫీజు మాత్రమే తీసుకునేవారు. 2006 నుంచి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ‘మొదట పేరెంట్స్‌ను కన్విన్స్ చేయడం కష్టమైంది. వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. అయితే ఫైనల్‌గా వారు పాజిటివ్‌గా స్పందించి పిల్లలను బడికి పంపించారు. అలా ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఎంతోమంది విద్యార్థులు చదవుతుండడం సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమారులు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అక్కడికెళ్లినప్పుడు ఆశా ఎస్‌వీ వాళ్లతో ఏర్పడిన పరిచయం మా స్కూల్‌కు ఆర్థిక సహాయం చేసే వరకు వచ్చింది. అలా మా సేవను హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా వీక్షించిన వారు ఫండింగ్ చేశారు.

ఇప్పుడు మాత్రం లోకల్ మెంబర్స్ సహకారాన్ని తీసుకుంటున్నామ’ని చెబుతున్నారు కనకరాజు దంపతులు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరికొంత మంది రిటైర్డ్ టీచర్స్ మీనాక్షి, రాణి ప్రమీల, కె.రాజ్‌గోపాల్, వాసుదేవరావులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో భాగస్వామయినందుకు సంతోషంగా ఉందంటున్నారు వాలంటరీగా పనిచేస్తున్న సాయిలత.
 
అన్నింటిపై దృష్టి...
‘ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడతాం. వారు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌లను గుర్తించి ప్రత్యేక తరగతులు తీసుకుంటాం. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి నెలా  పేరెంట్, స్టాఫ్ మెంబర్స్‌తో ఇంటారాక్టివ్ సెషన్ నిర్వహిస్తాం. ఇలా చేయడం వల్ల విద్య ప్రాధాన్యతని పేరెంట్స్‌కి చెబుతూనే... వారి నుంచి ఏమైనా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. మాణిక్యాల్లాంటి విద్యార్థులను వెలికి తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం’ అని అంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ దేవులపల్లి విజయ్.

మరిన్ని వార్తలు